తెలంగాణపై కూడబలుక్కొని బిఆర్‌ఎస్, బిజెపి, టిడిపి కుట్రలు, కుతంత్రాలు చేశాయని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ నియోజకవర్గంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజా కార్యక్రమాలు, సంక్షేమ పథకాల పత్రాలను లబ్ధిదారులకు ఆయన అందజేశారు. అనంతరం కొల్లాపూర్‌లో ఏర్పాటు చేసిన సభలో భట్టి విక్రమార్క మాట్లాడుతూ..బిజెపి, బిఆర్‌ఎస్, టిడిపిపై నిప్పులు చెరిగారు. బిఆర్‌ఎస్, బిజెపి కుమ్మక్కై ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాలను ఎపిలో కలిపేందుకు ఆర్డినెన్స్ తీసుకొచ్చాయని విమర్శించారు. పదేళ్లు బిఆర్‌ఎస్ మౌనంతోనే బనకచర్ల తెరపైకి వచ్చిందని తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. సిఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి వెళ్లడంతోనే బనకచర్ల ఆగిందని అన్నారు. బిఆర్‌ఎస్, బిజెపి, టిడిపి కుమ్మక్కై బనకచర్ల, పోలవరం పేరిట తెలంగాణ రాష్ట్రంపై చేస్తున్న కుట్రల సంగతి తేలుస్తామని హెచ్చరించారు.
వృధాగా పోయే నీళ్లతో తాము బనకచర్ల ప్రాజెక్టు నిర్మిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ మంత్రి లోకేష్ అమాయకంగా మాట్లాడుతున్న మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. ఎగువన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతోనే కిందికి వృథాగా నీళ్లు పోతున్నాయని తెలిపారు. ఎగువన తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తిచేసుకొని, మిగిలిన అన్ని రాష్ట్రాలకు వాటా పోయిన తర్వాతే బనకచర్ల విషయం మాట్లాడాలని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ పదేళ్లు మొద్దు నిద్రపోయి గోదావరి నదిపై ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడంతో బనకచర్ల జల వివాదం తెరపైకి వచ్చిందని ఆరోపించారు. బిఆర్‌ఎస్ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేసిందని మండిపడ్డారు. బనకచర్ల కడతామని ఎపి ప్రభుత్వం అంటే, దాన్ని కట్టనివ్వమని బిఆర్‌ఎస్ ప్రచారం మొదలుపెట్టాలని, కానీ తెలంగాణ ప్రజల దృష్టిని మళ్లించాలని రాత్రిపూట కెటిఆర్, లోకేష్ మాట్లాడుకున్నారని వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టు కడితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఏడు మండలాల్లోని రెండు లక్షల ఎకరాలు,
లక్షలాదిమంది గిరిజనులు ముంపునకు గురవుతారని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం సోనియాగాంధీకి విన్నపం చేస్తే చట్టం నుంచి ఆ ఏడు మండలాలను తీసివేసి గిరిజనులకు న్యాయం చేశారని వివరించారు. రాష్ట్ర విభజన తర్వాత బిజెపి, బిఆర్‌ఎస్ కుమ్మక్కై ఏడు మండలాలు, రెండు లక్షల ఎకరాలకు సంబంధించి ఆర్డినెన్స్ తీసుకువచ్చారని వివరించారు. ఏడు మండలాలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను ప్రశ్నిస్తాం.. తెలంగాణ ప్రజలను గుండెలో పెట్టుకొని కాపాడుతాం.. అన్నారు. నీళ్లు పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బిఆర్‌ఎస్ పాలనలో అటు గోదావరి కానీ, ఇటు కృష్ణా నదిపై ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అన్నారు. కృష్ణా నదిపై నిర్మించిన జూరాల, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, కల్వకుర్తి ఎత్తిపోతల శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులన్నీ అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టి పూర్తి చేశాయని అన్నారు. గోదావరి నదిపై ఎస్సారెస్పీ, శ్రీపాద ఎల్లంపల్లి, దేవాదుల ఎత్తిపోతల, ఇందిరా, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ ప్రభుత్వాలే ప్రారంభించాయని తెలిపారు. కృష్ణా నదిపై నిర్మించాల్సిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం జీవో జారీ చేయగా బిఆర్‌ఎస్ ఒక ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయిందని అన్నారు.
గోదావరి నదిపై 152 మీటర్ల ఎత్తులో ప్రాణహిత చేవెళ్ల నిర్మించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించగా నాటి కెసిఆర్ దానికంటే కింది భాగాన 100 మీటర్ల ఎత్తులో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని తెలిపారు. 38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్లను వదిలిపెట్టి 1.20 లక్షల కోట్లతో కాళేశ్వరం నిర్మించగా అది కుంగి, కూలిపోయిందని ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో బిఆర్‌ఎస్ పెద్దలు రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని, ఒక్క ఎకరాకు ఆధారంగా నీళ్లు ఇవ్వలేదని ఆరోపించారు. గత ప్రభుత్వ పాలనలో నీళ్లు రాలేదు, నిధుల దోపిడీ జరిగిందని, ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా అరెస్టులకు దిగి రాష్ట్రం మొత్తం భయభ్రాంతుల వాతావరణాన్ని సృష్టించారని అన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పైప్రాంతంలో తెలంగాణ భూభాగంలో ఒక డ్యామ్ కడితే పెద్ద ఎత్తున కృష్ణా నీటిని తీసుకునే అవకాశం ఉన్నా నాటి బిఆర్‌ఎస్ నేతలు ఎందుకు ఆలోచన చేయలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వేగవంతం చేశామని తెలిపారు.