దొరల పాలన కోసం ప్రజా ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసేందుకు దోపిడీదారులంతా ఏకమవుతున్నారని.. తస్మాత్ జాగ్రత్త అని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. దోపిడీదారుల మాటలు నమ్మకండి వారిని దూరంగా ఉంచి ఇందిరమ్మ పాలనలో సంక్షేమ పథకాలు అమలు చేసుకుందామని అన్నారు. ‘కెసిఆర్.. నువ్వు నీ కుటుంబం, నీ పార్టీ రాష్ట్ర సంపదను దోచుకుంటే న్యాయం, రాష్ట్ర సంపదను నాలుగు కోట్ల ప్రజలకు పంచాలని ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేపట్టడం అన్యాయమా’? అని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా ఫామ్‌హౌస్‌లో పడుకొని అడ్డగోలుగా సంపాదించిన డబ్బుతో సభలు పెట్టి బిఆర్‌ఎస్ నాయకులు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లపాటు పాలించిన వారు ప్రజల శక్తిని జలగల్లా పీల్చి పీల్చి పిప్పి చేశారని, ఆ పాలన నుంచి విముక్తి కోసమే రాష్ట్ర ప్రజలు ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని అన్నారు.
రూ.7 లక్షల కోట్ల అప్పుచేసి ఒక పెద్ద పరిశ్రమ గానీ, నాగార్జునసాగర్, ఎస్‌ఆర్‌ఎస్‌పి వంటి ఒక భారీ నీటి ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ఎందుకు నిర్మించలేదని అన్నారు. వద్దు మొర్రో అని అంతా చెప్పినా వినకుండా రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కడితే అది కాస్త కూలిపోయిందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర సొమ్ము కాజేసి దివాలా తీయించి, బ్యాంకులకు రాష్ట్రాన్ని కుదరపెట్టి తగుదునమ్మ అంటూ కెసిఆర్ కుటుంబం మాట్లాడుతోందని విమర్శించారు. ఈ రాష్ట్రానికి మేలు చేయాలన్న తలంపుతో రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ కేబినెట్ నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇండ్ల్లు మంజూరు చేశాం, రూ.22,500 కోట్లు ఖర్చు చేసి 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇండ్ల్లు నిర్మించబోతున్నాం..కెసిఆర్‌కు ఇది కనబడడం లేదా ? అని ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అని పదేళ్ల కాలంలో ఒక్కసారి కూడా గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించలేకపోయారు కానీ తాము అధికారంలోకి రాగానే సర్వీస్ కమిషన్‌ను ప్రక్షాళన చేసి గ్రూప్ వన్ పరీక్షను విజయవంతంగా నిర్వహించామని అన్నారు.
ఏడాదిన్నర కాలంలో 57, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసామని, మరో 30 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని అన్నారు. పదేళ్ల పాటు పాలించిన కెసిఆర్ నిరుద్యోగ యువత గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు. కెసిఆర్ ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి వంటి ఏ పథకాన్ని కూడా తాము ఆపలేదని స్పష్టం చేశారు. రైతు భరోసా పథకానికి మరో రెండు వేలు అదనంగా జోడించి అందజేస్తున్నామని అన్నారు. లక్ష రుణమాఫీనీ కెసిఆర్ ప్రభుత్వం పదేళ్లపాటు చేయలేకపోయింది అదే ప్రజా ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీని మొదటి ఏడాదిలోనే చేసిందని అన్నారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ రైతు రుణమాఫీ కోసం రూ.21,500 కోట్లు ఖర్చు చేశామని అన్నారు. రూ.13 వేల కోట్లు ఖర్చు చేసి 90 లక్షల కుటుంబాలకు ఒక్కొక్కరికి ప్రతినెల 6 కిలోల చొప్పున సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, కెసిఆర్‌కి ఇది కనబడడం లేదా అన్నారు. అటవీ హక్కుల చట్టం కింద కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పట్టాలు పొందిన గిరిజన రైతులు సాగు చేసుకునేందుకు వెళితే..
మహిళలని చూడకుండా గత ప్రభుత్వం చెట్టుకు కట్టేసి కొట్టిందని అన్నారు. గిరిజన రైతులకు భరోసా కల్పించేందుకు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని ఈనెల 18న నాగర్‌కర్నూలు జిల్లా, అచ్చంపేటలోని చెంచు కాలనీలో సిఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా ప్రారంభించబోతున్నామని వివరించారు. ఈ పథకం కింద రూ.12,500 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. ఈ పథకం కింద ప్రతి గిరిజన రైతుకు సోలార్ విద్యుత్ పంపుసెట్టు, స్ప్రింక్లర్లు, అవకాడో, పామ్ ఆయిల్ వంటి మొక్కలు ఉచితంగా అందజేస్తామని అన్నారు. సమావేశంలో పాల్గొన్న మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. అశ్వారావుపేట నియోజకవర్గం కొన్ని దశాబ్దాల కాలంగా వెనుకబడి ఉందని, అలాంటి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే కాంగ్రెస్ ధ్యేయమని అన్నారు. అందులో భాగంగానే ఉప ముఖ్యమంత్రి చొరవతో కరెంట్ వెలుగులు నింపేందుకు ఈ రోజు విద్యుత్ సబ్ స్టేషన్‌ల ఏర్పాటుకు శంకుస్థాపన చేసుకుంటున్నామని అన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఎంపి రామసహాయం రఘురాం రెడ్డి, ఎంఎల్‌ఎలు జారే ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, రాందాస్ నాయక్, జిల్లా కలెక్టర్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.