Sunday, August 10, 2025

అన్ని ప్రభుత్వ భవనాలకు సౌరకాంతులు

- Advertisement -
- Advertisement -

 ఇందిరా సౌర గిరిజల వికాసం వేగవంతం చేయాలి
 ఏజెన్సీ ప్రాంత అధికారులు ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల వివరాలు పంపండి
 సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలి
 జిల్లా కలెక్టర్లతో విద్యుత్ శాఖ పై డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్
మన తెలంగాణ / హైదరాబాద్: సోలార్ విద్యుత్ ను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని యావత్ క్యాబినెట్ విధాన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు, ఆర్ ఓ ఎఫ్ ఆర్ భూముల్లో ఇందిరా సౌర గిరిజన వికాసం పథకం అమలుపై జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల పార్కింగ్, క్యాంటీన్ ప్లాన్లు హైదరాబాద్ కు పంపాలని డిప్యూటీ సీఎం సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లు అన్నీ కూడా ఒకే నమూనాలో నిర్మించినందున సోలార్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటుకు అవసరమైన డిజైన్లు హైదరాబాద్ నుంచి పంపిస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు. కలెక్టర్ కార్యాలయాల్లో మంచి డిజైన్లు ఉంటే ఆయా కలెక్టర్లు హైదరాబాద్ కు పంపవచ్చని డిప్యూటీ సీఎం సూచించారు.

ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు

గ్రామపంచాయతీ బిల్డింగ్ మొదలుకుని సెక్రటేరియట్ వరకు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటుచేసి పెద్ద ఎత్తున విద్యుత్ ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు. సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటుకు అవసరమైన వివరాలకు సంబంధించి కలెక్టర్లు హైదరాబాద్ కు పంపాల్సిన వివరాలకు సంబంధించి ఒక ప్రశ్నావళిని పంపిస్తున్నామని, అందులో అన్ని వివరాలు నమోదు చేసి వారం లోపు విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ కార్యాలయానికి పంపాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ప్రభుత్వ భవనాలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు , ఉన్నత విద్యాసంస్థల భవనాలపై కూడా సోలార్ పవర్ ప్లాంట్ లు ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన భవనాల వివరాలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. నీటిపారుదల శాఖ, రోడ్లు భవనాల శాఖ పరిధిలో పెద్ద ఎత్తున ఖాళీ స్థలాలు ఉన్నాయని, వాటి వివరాలు సైతం పంపాలని కలెక్టర్లకు డిప్యూటీ సీఎం సూచించారు. ఇందిరా సౌర గిరిజన వికాసం పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, కలెక్టర్లు ఎక్కడ అలసత్వం ప్రదర్శించకుండా వారంలోగా వివరాలు అందజేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, విద్యుత్ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ నవీన్ మిట్టల్, ఎస్‌పిడిసిఎల్ సిఎండి ముషారఫ్ ఫారుకి, రెడ్కో సిఎండి అనిలా, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.

మహిళలకు ఉచితంగా నాలుగు ఎకరాల భూమి

రాష్ట్రంలోని మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం మరో తీపి కబురు చెప్పింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ విపరీతంగా పెరుగుతోన్న తరుణంలో సోలార్ విద్యుత్ వైపు రేవంత్ సర్కార్ దృష్టి సారించింది. అన్ని జిల్లాల్లో మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం నాలుగు ఎకరాల ప్రభుత్వ భూములను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అందుకు సంబంధించి జీవో కూడా జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయో నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రెవెన్యూ శాఖ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు దాదాపు రూ.3 కోట్లు అవసరం అవుతుండగా అందులో స్వయం సహాయక సంఘాలు 10 శాతం ఖర్చును భరించనుండగా 90 శాతం రుణం వివిధ బ్యాంకుల ద్వారా అందజేయనున్నారు. ప్రభుత్వ, దేవాదాయ, గిరిజన, నీటిపారుదల శాఖల ఆధీనంలోని భూములను ఈ ప్రాజెక్ట్ కోసం వినియోగించనున్నారు. సోలార్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను ఆయా సంస్థలకు విక్రయించి ఒక మెగావాట్ సోలార్ ప్లాంట్ కింద ఏడాదికి రూ.30 లక్షల ప్రాఫిట్ వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News