బీహార్‌లో భారత ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఈ సందర్భంగా పలు విమర్శలు ఎదురు కావడంతో ఇది కేవలం ఆ రాష్ట్రానికి పరిమితం కాబోదని, దేశవ్యాప్తంగా చేపడుతున్నామని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు సమాధానాన్ని సమర్పించింది. దేశవ్యాప్తంగా ఓటర్ల నమోదును అనూహ్యమైన రీతిలో నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ అనేక ప్రతిపక్ష పార్టీలు, ఇతరులువేసిన పిటిషన్లకు ప్రతిస్పందనగా ఎన్నికల సంఘం ఈ సమాధానం సమర్పించింది. త్వరితగతిన సవరణ కార్యక్రమంలో ఒక వ్యక్తి పౌరుడో కాదో ధ్రువీకరించే అధికారం తమకు ఉందని ఈ సందర్భంగా ఎన్నికల సంఘం కోర్టుకు పునరుద్ఘాటించింది.
అయితే తమ పౌరసత్వాన్ని నిరూపించే డాక్యుమెంటరీ ఆధారాలను అందించే భారం ప్రజలపై ఉందని కూడా స్పష్టంగా పేర్కొనడం పలు వివాదాలకు దారి తీస్తున్నది. జూన్ 24న, బీహార్‌లో ఓటర్ల జాబితాలను పూర్తిగా సవరించడానికి ఇసిఐ ఆశ్చర్యకరమైన సవరణ ప్రక్రియను (Amazing editing process) ప్రకటించింది. బీహార్ సవరణ సమయంలో ఎదుర్కొంటున్న గందరగోళం కారణంగా ఇసిఐ తన స్వరాన్ని మధ్యలో మార్చింది. 30 రోజుల గడువులోపు గణన ఫారమ్‌లను నింపేటప్పుడు ప్రజలు ఇకపై మొదట్లో పత్రాలను అందించాల్సిన అవసరం లేదు. అయితే, ఈ పత్రాలను ధ్రువీకరణ ప్రక్రియలో అందించాలి. క్షేత్రస్థాయి నివేదికల ప్రకారం, దీనివల్ల ఎక్కువ మంది ప్రజలు డాక్యుమెంటరీ రుజువు లేకుండా తమ ఫారాలను సమర్పించారు. సుప్రీంకోర్టుకు ఇచ్చిన సమాధానంలో, బీహార్‌లోని 94.68% జనాభా ఇప్పటికే తమ గణన ఫారాలను సమర్పించారని ఎన్నికల సంఘం తెలిపింది.
వీరిలో ఎంతమంది పౌరసత్వాన్ని నిరూపించుకునే పత్రాలు లేకుండా ఉన్నారో తెలియజేయడంలో మాత్రం విఫలమైంది. దీనితో, తదుపరి దశ ఓటర్ల జాబితా సవరణలో త్వరలో క్వాసీ- జ్యుడీషియల్ వెరిఫికేషన్ ప్రక్రియకు లోనయ్యే రాష్ట్రంలోని ఓటర్ల సంఖ్యను ఇసిఐ అస్పష్టం చేయడానికి ప్రయత్నిస్తోందని అనుమానాలకు దారితీస్తుంది. అసలు ఈ సవరణ ఉద్దేశం ప్రజల పౌరసత్వ నిర్ధారణ కోసం అనే విమర్శలు చెలరేగుతున్నాయి.బీహార్‌లో ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ఓ విధంగా దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీసింది. గత ఏడాది జరిగిన మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓటర్ల జాబితాలో ఆకస్మిక మార్పులు చోటుచేసుకోవడంతో అనేక భయాందోళనలు సైతం వ్యక్తం అవుతున్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం పారదర్శకంగా వ్యవహరించడం లేదని విమర్శలు చెలరేగుతున్నాయి. ఎస్‌ఐఆర్ రాజ్యాంగబద్ధత పట్ల నేడు తీవ్రమైన విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
65 లక్షల మందిని ముసాయిదా ఓటర్ల జాబితా నుండి తొలగించామని, వారు మరణించడమో లేదా శాశ్వతంగా వేరే చోటుకి మారడంతో జరిగిందని అంటూ ఎన్నికల సంఘం పేర్కొనడంతో మరిన్ని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అందుకనే సుప్రీంకోర్టు ఈ అంశాన్ని అత్యవసరంగా పరిగణిస్తూ ఆగస్టు 12,13 తేదీలలో ప్రత్యేకంగా విచారణకు పూనుకొంది. 2003 తర్వాత ఓటర్ల జాబితాలో చేర్చబడిన వారిలో 63% మంది ఓటర్ల వద్ద 11 ‘ఆమోదయోగ్యమైన’ గుర్తింపు పత్రాలలో ఏవీ లేవని, అయినప్పటికీ వారికి ఆధార్, ఓటరు ఐడి ఉన్నాయని ఒక వేగవంతమైన సర్వే వెల్లడించింది. ప్రభుత్వం విస్తృతంగా జారీ చేసిన కార్డులు ఇవే, అయినప్పటికీ ఇప్పుడు వాటిని పరిగణనలోకి తీసుకోవడానికి నిరాకరిస్తూ పెద్ద సంఖ్యలో ఓటర్ల జాబితా నుండి పేర్లను తొలగిస్తున్నారు.
ఇదే విధంగా జరిగితే 2.9 కోట్లకు పైగా ప్రజలు, ఎక్కువగా యువత, తమ ఓటు హక్కును తిరస్కరించవచ్చనే ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఎన్నికలకు ముందు ఇటువంటి భారీ ప్రక్రియను ఇప్పుడు ఎందుకు హడావుడిగా చేపట్టాల్సి వచ్చిందో ఎన్నికల కమిషన్ వివరించ లేకపోయింది. బీహార్‌లో ఇప్పటికే సాధారణ సవరణ చేశారు. కాబట్టి తగినంత పారదర్శకత లేదా చట్టపరమైన రక్షణలు లేకుండా లక్షలాది మందిని లక్ష్యంగా చేసుకుని ఇటువంటి అదనపు, దూకుడు పరిశీలన ఎందుకు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బీహార్‌లో చేపట్టిన ఈ ప్రక్రియ పెద్ద సంఖ్యలో ఓటర్లను చేర్చుకునేలా వుండాలి కానీ పెద్ద ఎత్తున ఓటర్లను తొలగించేలా వుండకూడదని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా తేల్చిచెప్పడం పరిస్థితుల తీవ్రతను వెల్లడి చేస్తున్నది. గుర్తింపు కార్డులుగా ఆధార్, ఓటర్ కార్డులను ఆమోదించాలని సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తరువులో స్పష్టం చేసినా ఆధార్, ఓటర్, రేషన్ కార్డులను సులభంగా ఫోర్జరీ చేయవచ్చని ఎన్నికల సంఘం వితండవాదన చేయడం గమనార్హం.
దీనిపై సుప్రీం తీవ్రంగా స్పందిస్తూ, ఈ భూమ్మీద ఏ డాక్యుమెంట్‌నైనా ఫోర్జరీ చేయవచ్చని పేర్కొంటూ వంద ఓటర్ల కార్డుల్లో బహుశా ఏ ఒక్కటో నిజమైన కార్డు కాకపోవచ్చని పేర్కొంది. అటువంటి విషయాలను ఏ కేసుకు ఆ కేసుగానే చూడాలి తప్ప అన్నింటికీ వర్తించలేమని అంటూ సున్నితంగా మందలించింది. పౌరుల పౌరసత్వాన్ని నిర్ధారించుకొనేందుకు భారత ప్రభుత్వం ఆమోదించిన ఆధారాలను తాము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని పేర్కొంటూ పౌరసత్వ నిర్ధారణలో కేంద్ర ప్రభుత్వ అధికారం పరిమితమైనదని స్పష్టం చేసింది. వారి పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి ఏ పత్రాలు సరిపోతాయో చట్టం నిర్దేశించలేదని, కాబట్టి ఓటరు నమోదు విషయంలో, పౌరుల నుండి ఏ రుజువు అవసరమో సూచించే అధికారం తమకు ఉందని తెలిపింది. పరోక్షంగా సుప్రీంకోర్టు సూచించిన విధంగా ఆధార్, తాము గతంలో జారీచేసిన ఓటర్ గుర్తింపు కార్డులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది.
ఎన్నికల కమిషన్ వాదనలను సుప్రీంకోర్టు సున్నితంగా తోసిపుచ్చింది. ఆధార్ వినియోగంలో వున్నప్పుడు దాన్ని ధ్రువీకరించేందుకు ఒక వ్యవస్థ వుందని అత్యున్నత న్యాయస్థానం గుర్తు చేసింది. అదేవిధంగా ఓటరు కార్డు అయితే ఎన్నికల కమిషనే జారీచేసింది. కాబట్టి ఆధార్, ఓటర్ కార్డులను గుర్తింపు కార్డులుగా ఆమోదించవచ్చని స్పష్టం చేసింది. పైగా, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డులుగా సూచించిన 11 డాక్యుమెంట్ల జాబితాలో ఏవీ కూడా నిర్ణయాత్మకమైన స్వభావం కలిగినవి కావని తేల్చి చెప్పింది. అది నివాస పత్రం కావచ్చు లేదా కుల ధ్రువీకరణ పత్రం కావచ్చు. ‘మీ అభిప్రాయం ప్రకారం, ఆ 11 డాక్యుమెంట్లలో ఏవీ కూడా కచ్చితమైనవి, నిర్ణయాత్మకమైనవి కానపుడు, అవి కేవలం జనగణన ఫారమ్‌లతో పాటూ జతపరిచిన పత్రాలు అనుకున్నపుడు ఎవరైనా ఆధార్‌ను గుర్తింపు కార్డుగా ఇస్తే, వారిని ఓటర్ల జాబితాలో ఎందుకు చేర్చరు? అని జస్టిస్ బగ్చి ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు ఆదేశంపై ఎన్నికల కమిషన్ అఫిడవిట్‌కు సమాధానం దాఖలు చేస్తూ ఓటర్ల పౌరసత్వాన్ని ధ్రువీకరించేందుకు తమకు రాజ్యాంగ అధికారం ఉందని చేస్తున్న వాదనను గతంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పుల దృష్ట్యా చెల్లదని అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫారమ్స్ (ఎడిఆర్) స్పష్టం చేసింది. ఆమోదయోగ్యమైన పత్రాల జాబితా నుండి ఆధార్, రేషన్ కార్డులను మినహాయించడాన్ని కూడా ఇది ‘అసంబద్ధం’ అని పేర్కొంది. పాస్‌పోర్ట్‌లు, కులధ్రువీకరణ పత్రాలు, శాశ్వత నివాస పత్రాలకోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు ఆధార్ విస్తృతంగా ఆమోదయోగ్యమని గుర్తుచేసింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు సవరణ ప్రక్రియను ఎందుకు హడావుడిగా చేపట్టారో ఎన్నికల సంఘం సమర్ధించుకోవడంలో విఫలమైందని తెలిపింది.
ఇది బీహార్ ఓటర్లపై ‘తీవ్ర మోసం’గా జరుగుతుందని స్పష్టం చేసింది. కాగా, 2003 తర్వాత చేర్చబడిన ఓటర్లందరూ ఇసి సూచించిన 11 ఆధార పాత్రలలో ఒకటి సమర్పించాలని కోరుతూ, 2003 తర్వాత ఓటర్లు వయస్సు, పౌరసత్వంతో సహా వారి అర్హతను నిరూపించుకునే బాధ్యతను సమర్థవంతంగా మోపాలని ఎస్‌ఐఆర్ సందర్భంగా వాదనలను ప్రస్తావిస్తూ ఈ వాదనలు గతంలో జరిగిన బీహార్ ఎన్నికల చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోందని హెచ్చరించింది. విదేశీ పౌరులు లేదా అక్రమ వలసదారులను జాబితాలో చేర్చినట్లు అనేక ఫిర్యాదులు వచ్చాయని చెబుతున్న ఎన్నికల సంఘం వాటికీ సంబంధించిన వివరాలు ఎందుకు ఇవ్వలేకపోతుందని ఎడిఆర్ ప్రశ్నించింది. ఏదిఏమైనా బీహార్ ఎస్‌ఐఆర్ ఎన్నికల కమిషన్ విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నది.
- చలసాని నరేంద్ర
98495 69050