ప్రకృతి వనరులను కేవలం పారిశ్రామిక అవసరాలు తీర్చే వ్యాపార వస్తువులుగా చూసే అభివృద్ధి చెందిన దేశాల అహంకారపూరిత వైఖరే నేడు భూమ్మీద యావత్తు జీవరాశి ఎదుర్కొంటున్న సమస్త సంక్షోభాలకి కారణం. మానవుని అనాలోచిత చర్యల వల్ల వాతావరణంలో కలుగుతున్న మార్పులే భూమ్మీద నివశిస్తున్న కోట్లాది జీవరాశుల మనుగడ పాలిట శాపాలుగా మారాయి. పారిశ్రామిక యుగం ప్రారంభమైన తర్వాత ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగించుకుంటున్న పారిశ్రామిక దేశాలు, దానికి బదులుగా లక్షల టన్నుల కలుషితాలను తిరిగి ప్రకృతిలోకి విడుదలచేయటం జరుగుతున్నది. నిత్యం పెద్దయెత్తున్న వెదజల్లబడుతున్న కలుషితాలు, విడుదలవుతున్న కర్బన ఉద్గారాల వల్ల భూవాతావరణం గతంలో ఎన్నడూ లేనంతగా వేడెక్కుతుంది. పెరుగుతున్న భూతాపం, భూమ్మీద నివశిస్తున్న సకల జీవరాశుల మనుగడను తీవ్ర సంక్షోభానికి గురిచేస్తుంది.
రోజురోజుకీ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు భూమ్మీద జీవరాశుల (Biodiversity destruction) మనుగడ అతలాకుతలం చేస్తున్న సంకట పరిస్థితులలో మనం నేడు ప్రపంచ జీవవైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. మానవ మనుగడలో అత్యంత కీలకమైన పాత్రను పోషించిన జీవరాశలను రక్షించుకోవాల్సిన భాద్యత సమస్త మానవాళిపైన ఉందని, దానిలో భాగంగా ఈ సంవత్సరం ప్రకృతితో సామరస్యం, స్థిరమైన అభివృద్ధి అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ జీవదినోత్సవ వేడుకలు జరుపుకోవాలని ఐక్యరాజ్యసమితి ప్రపంచ దేశాలను కోరింది.భూమ్మీద ప్రకృతి చర్యల వల్ల సంభవించిన ఐదవ మహాప్రళయం వల్ల డైనోసార్ల వంటి వందలాది జీవుల తమ మనుగడను కోల్పోయాయి.
అభివృద్ధి పేరుతో మానవుడు సాగిస్తున్న పర్యావరణ వినాశకర కార్యక్రమాల వల్ల జీవవైవిధ్యం అత్యంత వేగంగా విధ్వంసానికి గురవుతున్నది. పెరుగుతున్న కాలుష్యం, జనాభా పెరుగుదల, రెట్టింపవుతున్న భూతాపం, సహజ వనరుల క్షీణత, వేగంగా విస్తరిస్తున్న ఎడారీకరణ, విచ్ఛిన్నమవుతున్న ఓజోన్ పొర వంటి పర్యావరణ విపత్తుల వల్ల కోట్లాది జీవులు తమ మనుగడను కోల్పోయే దుస్థితిని ఎదుర్కొంటున్నాయి. 1972లో స్టాక్‌హోంలో జరిగిన అంతర్జాతీయ పర్యావరణ సదస్సు ‘వాతావరణంలో సంభవిస్తున్న మార్పుల వల్ల భూమ్మీద నివసిస్తున్న కోట్లాది జీవుల మనుగడ ప్రశ్నార్థకమవుతుందని, పారిశ్రామిక యుగం ప్రారంభమైన అనంతరం వాతావరణంలోకి విడుదలవుతున్న కార్బన్ ఉద్గారాల వల్ల భూతాపం పెరుగటం వల్ల విలువైన జీవవైవిధ్యం ధ్వంసమైపోతుందని, ఈ విధ్వంసాన్ని అరికట్టకపోతే రానున్న రోజుల్లో మానవాళి కూడా అనేక విపరిణామాను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ సదస్సు హెచ్చరించింది.
ఐక్యరాజ్యసమితి ఒత్తిడి మేరకు 1997లో జపాన్‌లోని క్యోటోలో జరిగిన వాతావరణ సదస్సులో జీవరాశి (Biodiversity destruction) మనుగడకు ప్రమాదంగా మారిన భూతాపానికి కారణమైన కర్బన్ ఉద్గారాలను కట్టడి చేయాలని, తద్వారా 1990 నాటి ఉష్ణోగ్రతల కన్నా 2 శాతం మించకుండా అన్ని ప్రపంచ దేశాలు చర్యలు తీసుకోవాలని తీర్మానించింది, ప్రపంచవ్యాప్తంగా ఏటా పెరుగుతున్న భూఉష్ణోగ్రతల వల్ల కోట్లాది జీవుల మనుగడ ప్రమాదంలో పడింది. పెరుగుతున్న భూతాపం వల్ల ప్రతి సంవత్సరం 27వేలకు పైగా జీవజాతులు అంతరించిపోతున్నాయని, ఇదే పరిస్ధితులు ఇలాగే కొనసాగితే రానున్న 30 సంవత్సరాలలో 20 శాతం జీవజాతులు పూర్తిగా అంతరించిపోతాయని జీవవైవిధ్య పితామహుడుగా పేరుగాంచిన ప్రఖ్యాత జీవశాస్త్రవేత్త, ఎడ్వర్డ్.ఒ.విల్సన్ హెచ్చరిస్తున్నారు.
అధికమవుతున్న భూతాపం ప్రభావం వల్ల ప్రపంచ వ్యాప్తంగా 24 శాతం క్షీరద జాతులు, 12 శాతం పక్షిజాతులు అంతరిచిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే 75 శాతం జన్యుపంటలు అంతరించిపోయాయి. రానున్న 20 సంవత్సరాలలో భూమ్మీద నివసిస్తున్న 620 రకాల వానర జాతులలో 120పైగా వానర జాతులు అంతరించిపోతాయంటున్న జీవశాస్త్రవేత్తలు, ఇప్పటికే ఈ ప్రక్రియ ప్రారంభమయ్యిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉష్ణోగ్రతలతోపాటు వేగంగా తరిగిపోతున్న అటవీ వనరులు కూడా జీవరాశి మనుగడపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. భూమండలం మీద 90 శాతం జీవవైవిధ్యానికి ఆవాసాలుగా అలరారుతున్న సమశీతోష్ణ మండలాలలోని సతత హరితారణ్యాలు పెద్దయెత్తున నరికివేతకు గురికావటం వల్ల ఏటా 27 వేల జీవజాతులు తమ ఉనికిని కోల్పోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ అడవులు ఏటా 2 బిలియన్ టన్నుల కర్బన్ డై యాక్సైడ్‌ను శోషించుకుని భూతాపాన్ని తగ్గించడంలో తమ వంతు పాత్రను పోషిస్తున్నాయి.
గడిచిన ఒక్క దశాబ్దంలోనే సుమారు 12 లక్షల హెక్టార్ల అడవులు నరికివేతకు గురయ్యాయని అంచనా. ఇప్పటికే సృష్టిలోనే అత్యంత అరుదైన జీవజాతులకు రక్షణ కేంద్రాలైన పగడపు దిబ్బలు 75 శాతం పైగా ధ్వంసమైపోయాయి. ఉష్ణోగ్రతలు ఇదే స్ధాయిలో పెరుగుతూపోతే అతి తక్కువ కాలంలోనే పగడపు దీవులు భూమ్మీద నుండి శాశ్వతంగా అదృశ్యమైపోయే అవకాశముంది.ప్రపంచ జీవవైవిధ్యంలో 8% వాటాను కలిగిన భారతదేశం అత్యంత జీవవైవిధ్యం కలిగిన దేశాల జాబితాలో 7వ స్థానంలో ఉంది. ప్రపంచంలోనే అరుదైన జీవవైవిధ్యాన్ని కలిగిన ఆస్ట్రేలియా మొదటిస్థానంలో ఉంటే, బ్రెజిల్ రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ దేశాలు అవలంబిస్తున్న పర్యావరణ వ్యతిరేక విధానాల వల్ల భూమ్మీద సమస్త జీవరాశుల మనుగడ సంక్షోభంలో చిక్కుకుంది. పరిమితమైన వనరులను వినియోగించుకుని, అపరిమితమైన ఆర్థికవృద్ధిని సాధించే దిశగా పారిశ్రామిన దేశాల ఆలోచన చేయాల్సిన సమయమిది.
అప్పుడు మాత్రమే సహజవనరులపై ఒత్తిడి తగ్గి తిరిగి అవి పునర్జీవించే అవకాశముంటుంది. పెద్దయెత్తున కోల్పోయిన జీవావరణాన్ని తిరిగి పునరుద్ధరించగలిగితేనే కోల్పోయిన జీవవైవిధ్యాన్ని(Biodiversity destruction) కూడా తిరిగి రక్షించుకోగలుగుతాం. దురదృష్టకరమైన అంశమేమిటంటే, ఇంతటి పర్యావరణ సంక్షోభంలో కూడా పారిశ్రామిక దేశాలు తమ వైఖరికి మార్చుకోకపోగా, మరింత అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి వల్ల కలుగుతున్న అనర్థాలు కళ్ల ముందు కనబడుతున్న ఈ దశలో వాటికి పరిష్కార మార్గాలను అన్వేషించి పర్యావరణ రక్షణకు సిద్ధం కాకపోతే కోట్లాది జీవులకు అమ్మగా భావించే భూమాత మరుభూమిగా మారిపోతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. అదే జరిగితే మనిషి తన మరణ శాసనం తాను రాసుకున్నట్టే.
డా. కె.శశిధర్
94919 91918
( నేడు జీవివైవిధ్య దినోత్సవం)