Tuesday, September 16, 2025

బిజెపి, ఆప్!

- Advertisement -
- Advertisement -

Plight of indian students in ukraine-russian attacks పటిష్ఠమైన పార్టీ వ్యవస్థ, అనేక అనుబంధ సంస్థల నిరంతర అండదండలు, తన కరకు మతతత్వ భావజాలానికి అనుగుణమైన సామాజిక మనస్తత్వం ఇవన్నీ కలిసి భారతీయ జనతా పార్టీకి మరోసారి తిరుగులేని విజయాలను కట్టబెట్టాయి. ఇందుకు మినహాయింపుగా నిలిచిన పంజాబ్ ప్రజల తీర్పు దేశ భావి రాజకీయాలకు దిక్సూచిగా నిరూపించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో కీలకమైన ఉత్తరప్రదేశ్ సహా నాలుగింట బిజెపి సాధించుకున్న విజయాలు దాని పాలన గొప్పతనం వల్ల కాక ఆ పార్టీ వున్న బలమైన స్థానం కారణంగానే ఎక్కువగా సాధ్యమైనట్టు బోధపడుతున్నది. భవిష్యత్తులో బిజెపిని ఓడించదలచుకునే ఏ పార్టీ అయినా, కూటమి అయినా దాని సంస్థాగత నిర్మాణానికి దీటైన రీతిలో ప్రజల మధ్య అల్లుకోగలగాలి. ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అధికార పీఠాల్లో వుండి నిర్విరామంగా శ్రమించారు.

పార్టీ యంత్రాంగం వారికి బాగా తోడ్పడింది. అందువల్ల ఉత్తరప్రదేశ్‌లో బిజెపి వరుసగా రెండోసారి అధికారాన్ని సాధించుకున్నది. అక్కడ అధికార పార్టీ ఇలా వరుసగా రెండోసారి నిలదొక్కుకోడం 37 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి కావడం విశేషం. అయితే 2017లో యుపిలో బిజెపి గెలుచుకున్న 312 స్థానాలతో పోలిస్తే ఈసారి గెలుపొందిన 270 సీట్లు చాలా తక్కువ. ఆ విధంగా ఆ రాష్ట్రంలో బిజెపి పాలనకు వ్యతిరేకత చోటు చేసుకున్న వాస్తవం ప్రస్ఫుటమవుతున్నది. 2017లో కేవలం 47 స్థానాలనే గెలుచుకున్న అఖిలేశ్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాది పార్టీ ఈసారి గణనీయంగా బలం పుంజుకొని 120 స్థానాలను సాధించుకున్నది. అయితే దానికి పడవలసిన బహుజనుల, మైనారిటీల ఓట్లు బాగా చీలికకు గురైనాయని బోధపడుతున్నది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాలతో, బిఎస్‌పి ఒకేఒక్క దానితో సరిపుచ్చుకోవలసి వచ్చింది.

మాయావతి నాయకత్వంలోని బిఎస్‌పి బహుజనుల ఓట్లను చీల్చడానికి ఉపయోగపడి ఇంతటి అధోగతిని చవిచూడడం బాధాకరం. యుపిలో వరుస ఓటములతో కుంగికృశించిపోయిన కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించడానికి ఏకాగ్రతతో ప్రియాంక గాంధీ చేసిన కృషి ఎందుకూ పనికి రాకుండాపోయింది. కరోనా రెండో అలలో ఆక్సిజన్ బొత్తిగా కరువై, ఆసుపత్రుల్లో తగిన సౌకర్యాలు లేక, ప్రైవేటు దవాఖానాల దోపిడీ పెచ్చరిల్లిపోయి క్షణమొక శవంగా, గంగా నదిలో మృత దేహాలు గుట్టలుగా తేలియాడిన హృదయ విదారక ఘట్టాలు గాని, జనం పడిన నరకయాతనలు గాని ఈ ఎన్నికల్లో బిజెపికి వ్యతిరేకంగా అనుకున్నంతగా పని చేయలేదని బోధపడుతున్నది. ఏడాది పాటు సాగిన రైతు ఉద్యమం ప్రభావం కూడా తగినంతగా బిజెపిని బాధించలేదని అర్థమవుతున్నది. నిరుద్యోగం, అధిక ధరల వంటి ప్రజా సమస్యలూ దాన్ని ఏమీ చేయలేకపోయాయి. ఉత్తరప్రదేశ్ ప్రజలు తిరిగి బిజెపిని, యోగి ఆదిత్యనాథ్‌నే ఎన్నుకున్నారంటే కాషాయ దళాలు కష్టపడి స్థిరపరచిన మత విభజన, మైనారిటీల పట్ల మెజారిటీ మతస్థులలో అస్థిగతం చేయగలిగిన విద్వేషం బాగా పని చేశాయని భావించాలి. దీనినే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వ శాంతి భద్రతల పరిరక్షణ సామర్థంగా, గూండా రాజ్యాన్ని అంతమొందించిన ఖ్యాతిగా చెప్పుకుంటున్నారు. యుపిలో బిజెపి పాలనలో ఇక ముందు కూడా ఇదే జరుగుతుందని, మైనారిటీలకు, దళితులకు కష్టకాలం ఇలాగే కొనసాగుతుందని భావించాలి.

యుపి తర్వాత గట్టిగా అంతకంటే ఎక్కువగా చెప్పుకోదగినది పంజాబ్ ఫలితం. అక్కడ ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) సాధించిన అఖండ విజయం దేశ భావి రాజకీయాలను ప్రభావితం చేయగలదనిపిస్తున్నది. పంజాబ్ అసెంబ్లీలో గల 117 లో 92 స్థానాలను ఆప్ వంటి కొత్త పార్టీ గెలుచుకోడం సాధారణమైన విషయం కాదు. పాత పార్టీల అవినీతి, అసమర్థ పాలనను ప్రజలు తిరస్కరిస్తున్నారని, కొత్త చూపు, ఆలోచనతో వారి సమస్యలను గుర్తించి నిర్మలమైన, సమర్థమైన పరిపాలన అందించగలిగే ఢిల్లీ మోడల్ ఆప్ పాలన వైపు మొగ్గుతున్నారని బోధపడుతున్నది.పట్టణ మధ్యతరగతి అవసరాలను గమనించి వారిని సంతృప్తిపరచడంలో విజయవంతమైన కేజ్రీవాల్ బాణీ ఇక ముందు కూడా ఆ పార్టీకి ఇటువంటి విజయాలను సాధించి పెట్టగలదని పంజాబ్ ఫలితం నిరూపిస్తున్నది. మణిపూర్‌లో, గోవాలో, ఉత్తరాఖండ్‌లో బిజెపి విజయాలను సాధించింది. మణిపూర్‌లో గల 60 స్థానాల్లో 30 స్థానాలను, గోవాలోనూ మొత్తం 40 స్థానాల్లో 20 స్థానాలు గెలుచుకున్నది. ఉత్తరాఖండ్‌లో 70 స్థానాల్లో 47 సాధించుకొని ఎదురులేని శక్తిగా నిలబడింది. ఈ విజయాలు దేశపాలనలో బిజెపి మరింత బాధ్యతాయుతంగా నడుచుకునేలా చేస్తాయని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News