తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా..
అనుమతులు లేని ఎపి ప్రాజెక్టులకు
కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోంది
కేంద్రం తన చేతిలో ఉందని
ఎపి సిఎం చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు
ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి
గోదావరి బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ
వ్యతిరేకిస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని
నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళనన్న సిఎం,
అందరి కంటే ముందే వెళ్లి కూర్చున్నారు
రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే.. సిఎం రేవంత్,
మంత్రి ఉత్తమ్ ఎందుకు మాట్లాడటం లేదు
మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు
మనతెలంగాణ/హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి బిజెపి ద్రోహం చేస్తోందని మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీష్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వకుండా.. అనుమతులు లేని ఎపి ప్రాజెక్టులకు కేంద్రం నిధుల వర్షం కురిపిస్తోందని విమర్శించారు. ఎపికి ఒక నీతి.. తెలంగాణకు మరొక నీతి అన్నట్లు కేంద్ర ప్రభుత్వం వ్యహరిస్తోందని ఆరోపించారు. బిజెపికి తెలంగాణ పట్ల సవతి తల్లి ప్రేమ ఎందుకు..? అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు..కానీ కాళేశ్వరం, పాలమూరు, సీతారామ ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరు అని అడిగారు. పోలవరంకు 80 వేల కోట్ల, బనకచర్లకు 80 వేల కోట్లు.. అంటే లక్షా 60వేల కోట్లు ఎపి ఇచ్చారని, కానీ ఒక్క శాతం అయినా తెలంగాణ ప్రాజెక్టులకు ఇచ్చారా..? అని ప్రశ్నించారు.
ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది బిజెపి ఎంపీలు ఉండి ఏం లాభం అని అడిగారు. తెలంగాణ భవన్‌లో ఆదివారం బిఆర్‌ఎస్ నేతలతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ, రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుంటే ప్రభుత్వం కళ్లు అప్పగించి చూస్తోందని విమర్శించారు. నీరు జీవనాధారం అని, దేశాల మధ్య నీళ్ల కోసం పోరాటాలు జరిగిన చరిత్ర మనకు తెలుసు అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం కూడా నీళ్ల నుంచే పుట్టిందని, అంతటి ప్రాధాన్యం ఉన్న నీళ్లను కాంగ్రెస్ విస్మరించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి అవసరాలు కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సమైక్య ఆంధ్రలో సీమాంధ్ర నాయకుల వల్ల తెలంగాణకు తీవ్రనష్టం జరిగిందని, స్వరాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల వల్ల తీవ్రనష్టం జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతల రూపంలో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని విమర్శించారు.
కాంగ్రెస్ పాలనలో మళ్లీ జలదోపిడి మొదలైంది
ఉమ్మడి రాష్ట్రంలో కొనసాగిన జలదోపిడి కాంగ్రెస్ పాలనలో మళ్లీ మొదలైందని హరీష్‌రావు ఆరోపించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు పదవుల కోసం పెదవులు మూసుకున్నారని చెప్పారు. గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని, 200 టిఎంసిల గోదావరి జలాలు తరలించుకుపోయే కుట్ర జరుగుతోందని చెప్పారు. సముద్రంలో కలిసే నీళ్లు తీసుకుపోతే తప్పేందని మాట్లాడుతున్నారని, నదీ పరివాహక ప్రాంతాల్లోని అన్ని రాష్ట్రాలు ఒప్పుకోవాలని చెప్పారు. అపెక్స్ కౌన్సిల్‌లో అనుమతి తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గోదావరిపై ప్రాజెక్టులు కడితే ఎందుకు మోకాలు అడ్డుపెట్టారని, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు రద్దు చేయాలని, తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వవద్దని ఎపి సిఎం చంద్రబాబు కేంద్రానికి ఎందుకు లేఖలు రాశారని ప్రశ్నించారు. పాలమూరు, భక్తరామదాసు, డిండి ప్రాజెక్టులపై చంద్రబాబు కేంద్రం, గ్రీన్‌ట్రైబ్యునల్, సీడబ్ల్యూసీకి లేఖలు రాశారని, హైకోర్టు, సుప్రీంకోర్టులో కేసులు వేసి మోకాలు అడ్డంపెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు తెచ్చుకుంటే.. చంద్రబాబు 2018లో కేంద్ర జలవనరులకు లేఖ రాశారని, దిండి, పాలమూరు రంగారెడ్డికి అనుమతులు ఇవ్వొద్దని చంద్రబాబు లేఖలు రాశారని అన్నారు. పాలమూరు, కాళేశ్వరం పాత ప్రాజెక్టులేనని, ఉమ్మడి ఎపిలో ప్రారంభించినవేనని గుర్తు చేశారు. కాళేశ్వరం కొత్త ప్రాజెక్టు కాదని, ప్రాణహితకు కొనసాగింపేనని కేంద్రం అనుమతులు ఇచ్చిందని అన్నారు.
గోదావరి బంకచర్లను ఆపాలని తీర్మానం చేసి కేంద్రానికి పంపాలి
గోదావరి- బనకచర్ల కొత్త ప్రాజెక్టు నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తోందని హరీష్‌రావు పేర్కొన్నరు. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం జుట్టు తన చేతిలో ఉందని ఎపి సిఎం చంద్రబాబు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని విమర్శించారు. గోదావరి -బనకచర్లకు ఒక్క అనుమతి లేకుండానే ఎపి ముందుకెళ్తోందని, రాత్రికిరాత్రి ప్రాజెక్టుకు రూపకల్పన చేసి టెండర్లు పిలిచి ముందుకెళ్తున్నారని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు గుండుసున్నాపెట్టారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతి ఇవ్వడం లేదని సిఎం అసెంబ్లీలోనే చెప్పారని గుర్తు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చొరవ చూపి.. ఎపి నిర్మిస్తున్న గోదావరి బంకచర్లను ఆపాలని, లేకుంటే.. ఢిల్లీలో సిడబ్ల్యూసి కార్యాలయం ముందు ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై సిఎం రేవంత్ రెడ్డి.. తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. గోదావరి బనకచర్ల ప్రాజెక్టును తెలంగాణ వ్యతిరేకిస్తుందని ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసులు వేయాలని అన్నారు.
తెలంగాణకు నష్టం జరుగుతుంటే.. సిఎం ఎందుకు మాట్లాడటం లేదు
తెలంగాణకు నష్టం జరుగుతుంటే.. సిఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నీతి ఆయోగ్ సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించలేదని విమర్శించారు. మౌనంగా ఉండి..సిఎం రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటున్నారని ఆరోపించారు. కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి, అనుమతులు లేకుండా.. ఎపి ప్రాజెక్టులు కడుతోందని అన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్ళనన్న ముఖ్యమంత్రి, అందరి కంటే ముందే వెళ్లి ఆ సమావేశంలో కూర్చున్నారని విమర్శించారు.
సిఎం బనకచర్ల అడ్డుకుంటారు, నీతి అయోగ్ సమావేశంలో మాట్లాడుతారని అనుకున్నామని, కానీ మంత్రి మాట్లాడరు, ముఖ్యమంత్రి మాట్లాడరు అని విమర్శించారు. కాంగ్రెస్, బిజెపి ఎంపీలు పార్లమెంట్‌లో ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. కేంద్రమంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు తెలంగాణ ప్రయోజనాలు పట్టవా..? అని నిలదీశారు. కేంద్రం అనుమతిస్తుంటే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మౌనంగా ఎందుకు ఉంటున్నారని అడిగారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అన్ని పార్టీ నేతలను కిషన్ రెడ్డి ప్రధానమంత్రి వద్దకు తీసుకెళ్ళాలని హరీష్‌రావు అన్నారు.