9వ షెడ్యూలు సవరణ సాధ్యం కాదన్న రాంచందర్ రావు
ఇతర పార్టీలకు అస్త్రం అందించినట్లేనన్న ఆందోళన
బిసిలను ఆకర్షించాల్సిన సమయంలో వ్యతిరేకత
కేంద్రం అభిప్రాయాన్నే రాంచందర్ రావు చెప్పారా?
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః బిజెపిలో బిసి బిల్లు ‘లొల్లి’ ప్రారంభమైంది. 42 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు రాజ్యాంగంలోని 9వ షెడ్యూలును సవరించడం సాధ్యం కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు వ్యాఖ్యానించడంతో సొంత పార్టీలోని బిసి నేతలూ కొంత మంది నొచ్చుకున్నారు. పైగా తమ పార్టీపై ధ్వజమెత్తడానికి ఇతర పార్టీల నేతలకు అస్త్రం అందించినట్లు అయ్యిందని వారు ఆందోళన చెందుతున్నారు. ఈ బిల్లుపై రాంచందర్ రావు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశాన్ని చెప్పారా? అనే సందేహాలూ వ్యక్తమవుతున్నాయి. రాంచందర్ రావు బిజెపి రథ సారధిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి పార్టీ జాతీయ నాయకులను కలిసేందుకు ఢిల్లీ వెళ్ళారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం లభించదని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపించిందని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రిజర్వేషన్ల బిల్లు విషయంలో కాంగ్రెస్ వ్యూహాన్ని ఎండగట్టాలే తప్ప సాధ్యం కాదని మనేమే ముందుగా ఎందుకు తేల్చేయాలన్నది బిజెపిలోని బిసి నేతలు అంటున్నారు.
రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీం కోర్టు పలు పర్యాయాలు ఖచ్చితంగా ఆదేశించినందున, కేంద్రం ఆమోదించినా, మళ్లీ సుప్రీంలో ఎవరైనా ఛాలెంజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ముందుగానే మనమే తేల్చడం ద్వారా ఇతర పార్టీల నేతలకు విమర్శించేందుకు అవకాశం కల్పించినట్లు అయ్యిందని పార్టీలోని బిసి నేతలు ఆవేదన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిసి బిల్లు ఆమోదించేందుకు ప్రవేశపెట్టినప్పుడు బిజెపి కూడా మద్దతునిచ్చిన విషయాన్ని నాయకులు గుర్తు చేస్తున్నారు. బిసి రిజర్వేషన్ బిల్లుపై కాంగ్రెస్‌కూ అనేక అనుమానాలు ఉన్పప్పటికీ, అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్ వద్దకు పంపించిందని, దీంతో గవర్నర్ కేంద్రానికి పంపించారని వారంటున్నారు. అటువంటప్పుడు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మాత్రం ఎందుకు తొందరపడాలని వారు తమ బాధను వ్యక్తం చేశారు. ఇప్పుడు ఇతర పార్టీల నేతలకు విమర్శించేందుకు అవకాశం ఇచ్చినట్లు అయ్యింది కదా? అని వారన్నారు.
అయితే అసెంబ్లీలో బిసి బిల్లుకు తమ పార్టీ మద్దతునిచ్చిందని రాంచందర్ రావు స్పష్టంగా చెబుతూనే తన అనుమానాలను వ్యక్తం చేశారని బిజెపిలోని మరి కొందరు నాయకులు బలంగా తమ వాదన వినిపిస్తున్నారు. తొమ్మిదవ షెడ్యూలును సవరించడానికి సాధ్యం కాదని మీ న్యాయవాదులు సలహా ఎందుకు ఇవ్వలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో తప్పేమి లేదని వారు అంటున్నారు. బిసి రిజర్వేషన్లను పెంచాలంటే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ రాజ్ చట్టంలోని సెక్షన్ 285ని సవరించాల్సి ఉంటుందని అధ్యక్షుడు చెప్పడం ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లే కదా, ఇది కూడా మీకు తెలియదా? మీకు సలహాలు, సూచనలు ఇచ్చే న్యాయవాదులు ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడంలో తప్పేమి లేదని వారు అంటున్నారు. ఏదైనా బహిరంగంగా మాట్లాడే మనస్తత్వం ఉన్న రాంచందర్ రావు ఈ విషయంలో కూడా తను అనుమానాలను బహిర్గతం చేయడంలో తప్పేమి లేదంటున్నారు.
బిసి నేతకు అధ్యక్ష పదవి దక్కకపోవడంతో, బిజెపి బిసి వ్యతిరేక పార్టీ అనే విమర్శలు ఎదుర్కొంటున్న సమయంలో ఒసి అయిన రాంచందర్ రావు బిసి బిల్లు సాధ్యం కాదని తేల్చేయడంతో ఒకవైపు బిసిలు పార్టీకి దూరం అవుతారేమోనన్న అనుమానాలనూ పార్టీలో కొంత మంది నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు తొందర పడి అలా చెప్పకుండా తామూ కేంద్రంపై వత్తిడి తెస్తామని చెబితే సరిపోయేదన్న భావనను వారు తెలిపారు. ఏదైనా బిసి రిజర్వేషన్ల బిల్లు విషయంలో బిజెపి రాష్ట్ర నేతలకు ఇబ్బందికరంగా మారింది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయంతో పార్టీకి లాభ, నష్టాలు ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు.
దాడి ప్రారంభించిన కాంగ్రెస్
ఇదిలాఉండగా బిసి రిజర్వేషన్లపై మాట్లాడిన రాంచందర్ రావుపై కాంగ్రెస్ నేతలు విమర్శల దాడి ప్రారంభించారు. కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుందో రాంచందర్ రావు స్పష్టం చేసినందున బిజెపి ఎంపీలు తమ పదవులకు రాజీనామా చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ప్రభృతులు మంగళవారం విమర్శించారు.