Tuesday, July 29, 2025

పాలమూరుకు సిఎం రేవంత్ చేసింది శూన్యమే: బిజెపి చీఫ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/మహబూబ్‌నగర్ బ్యూరో: నా సొంత జిల్లా .. నా ఆత్మ పాలమూరు జిల్లా అని చెప్పుకుంటున్న పాలమూరు జిల్లాకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసింది ఏమి లేదని, ఆయన అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కె. రామచంద్రారావు ఘాటుగా ఆరోపించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక మొదటి సారి పాలమూరు జిల్లా పర్యటనకు వచ్చిన రామచంద్రారావుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం స్థానిక అన్నపూర్ణ గార్డన్‌లో జరిగిన కార్యకర్తల ముఖ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు జిల్లానే తనకు రాజకీయ ఓనమాలు నేర్పడంతోనే రాజకీయంగా ఎదిగినట్లు చెప్పకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నా పాలమూరుకు ఏమి చేశారో చెప్పాలని నిలదీశారు.

పాలమూరు ప్రాజెక్టుల పనులు సమీక్షల వరకే ఉంటున్నాయని ఎక్కడ ఏ ప్రాజెక్టు పూర్తి చేశారో చూపాలని ఎద్దేవ చేశారు. పాలమూరు రంగారెడ్డి,నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి , కోయిలసాగర్ వంటి ప్రాజెక్టుల పెండింగ్ పనులు ఒక్కటైనా పూర్తి చేశారి అంటూ నిలదీశారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ప్రాజెక్టుల పనులు ఇలా ఉంటే రాష్ట్రంలో ప్రాజెక్టుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కులగణన చేపట్టి బిసిలకు అన్యాయం చేస్తోందని దుయ్యబట్టారు. కులగణనలో బిసి జనాభ శాతం 46 శాతం ఉన్నారని చెప్పి,42 శాతం బిసిల రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించి, చివరికి అందులో 10 శాతం రిజర్వేషన్లు ముస్లింలకు కేటాయిస్తు చివరికి బిసిలకు మిగిలేది 32 శాతం మాత్రమేనని అన్నారు. ఇది బిసిలకు కాంగ్రెస్ చేపడుతున్న చారిత్రక తప్పిదమని ఆరోపించారు. బిసిలకు న్యాయం చేస్తామని బిసిలకే తీవ్ర మోసం చేస్తున్నారని వాఖ్యానించారు.

బిసిల గురించి గొంతు చించుకునే కాంగ్రెస్ పార్టీ ఎంతమందిని ఆ పార్టా రాష్ట్ర ముఖ్యమంత్రులను చేసిందని నిలదీశారు. అసలు కాంగ్రెస్ చేపట్టిన కులగణనే బూటకమని విమర్శించారు. కేంద్ర క్యాబినెట్‌లో 27 మంది బిసి మంత్రులు ఉన్నారని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర క్యాబినెట్‌లో ఇద్దరే బిసి మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. బిసి హాస్టల్స్‌లో పురుగుల అన్నం నీళ్ల చారు పెడుతున్నారని, ఫుడ్‌పాయిజన్ అయ్యి బిసి హాస్టల్ విద్యార్థులు చనిపోతున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలు గాలికి ఎగిరిపోయాయని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందన్నారు. కాంగ్రెస్ చేపడుతున్న గారడి పథకాలను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఎద్దేవ చేశారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ప్రజలు బిజెపి వైపు చూస్తున్నారని, అన్ని చోట్ల బిజెపి గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఐక్యతతో ఉండి పార్టీ గెలుపుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకు ముందు మహబూబ్‌నగర్ ఎంపి డికె అరుణ మాట్లాడుతూ గతంలో తాను ఎంపిగా పోటి చేసిన సమయంలో పార్టీలోని కొందరు నాయకులు తనను ఓడించేందుకు కుట్రుల పన్నినట్లు ఆరోపించారు. తనను ఓడించేందుకు ఫాం హౌస్‌ల్లో దావత్‌లు ఇచ్చారన్నారు. తమ దగ్గర అన్ని ఆధారులు వారిపై క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని డికె అరుణ డిమాండ్ చేశారు.

ఇరు వర్గాల రసాభస
డికె అరుణ వాఖ్యలు సభలో తీవ్ర దుమారం రేపాయి. అప్పుడే బిజెపి రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్‌ను వేదిక పైకి రావాలని ఆహ్వానించే సమయంలో కొందరు డికె అరుణ వర్గీయులు శాంతికుమార్ గో బ్యాక్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా శాంతికుమార్ వర్గీయులు డికె అరుణ గో బ్యాక్ అంటూ ఇరు వర్గాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారావు సమక్షంలోనే వాగ్వివాదానికి దిగారు. దీంతో సభ కొంత సేపు రసాభసగా మారింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News