అవసరానికి మించి సరఫరా చేస్తే ఎరువుల కొరత ఎందుకువచ్చింది?
బ్లాక్‌మార్కెట్‌కు తరలిస్తున్నారా?
కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదు
కాంగ్రెస్ ప్రభుత్వంపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఫైర్
మన తెలంగాణ/ఖమ్మం బ్యూరో: రాష్ట్రానికి అవసరానికి మించి సరఫరా చే సిన యూరియా ఎక్కడికి వెళ్లింది, ఎవరైనా తీసుకున్నారా లేదా బ్లాక్ మార్కెటింగ్‌కు తరలించారా అనేది తేలాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్ర రా వు డిమాండ్ చేశారు. రాష్ట్ర కాషాయ దళపతిగా నియమితులైన అనంతరం మంగళవారం ఆయన తొలిసారిగా ఖమ్మం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా సరిహద్దులో నాయకన్ గూడెం, కూసుమంచి వద్ద ఆయనకు ఘన స్వాగతం లభించింది. అనంతరం ఖమ్మం నగరంలో కాల్వవోడ్డు నుంచి బై పాస్ రోడ్డులోని సభా స్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడు తూ…కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులకు అందిస్తున్న యూరియా కోటాను తక్కువ చూపిస్తూ, ఎరువుల కొరతపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలు పూర్తిగా అసత్యం, ఆధార రహితమని స్పష్టం చేశారు. అవసరానికి మించి యూరియా, డిఎపి సరఫరా చేసి న కేంద్ర ప్రభుత్వంపై, రైతులను తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని కోరారు. 202425 రబీ సీజన్ లో అవసరమైన 9.80 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాకు బదులుగా కేంద్రం 12.47 లక్షల మెట్రిక్ టన్నులు, అంటే 2.67 లక్షల టన్నులు అదనంగా పంపిందని వివరించారు. డిఎపి విషయంలో అవసరమైన 1.50 లక్షల మెట్రిక్ టన్నులకు బదులుగా 1.74 లక్షల మెట్రిక్ టన్నులు సరఫరా చేయగా ఎందుకు ఎరువుల కొరత వచ్చిందని ఆయన ప్రశ్నించారు. కేంద్రం యూరియాను సరఫరా చేయడం లేద ని ఆరోపణలు చేయడం తగదన్నారు. ఎరువులపై రైతులకు ఇచ్చే సబ్సిడీల గురించి, బస్తాలపై నమోదు చేసే వివరాలను బస్తాలను చూపిస్తూ సభికులకు వివరించారు.