Saturday, September 6, 2025

సిఎం రేవంత్‌పై బిజెపి పరువు నష్టం దావా..ఈ నెల 8న విచారణ

- Advertisement -
- Advertisement -

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టులో ఈ నెల 8న కేసు విచారణకు రానుంది. 2024 లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్ రెడ్డి ప్రసంగం వివాదాస్పదం అయింది. దీనిపై తెలంగాణ బిజెపి విభాగం దాఖలు చేసిన పరువు నష్టం దావాను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది. దీనిని సవాలు చేస్తూ బిజెపి సుప్రీంకోర్టుకు వెళ్లింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, న్యాయమూర్తులు కె వినోద్ చంద్రన్, అతుల్ ఎస్ చంద్రూకర్‌తో కూడిన బెంచ్ విచారణ జరుపుతుంది. ఇందుకు తేదీ ఖరారయింది. గత ఏడాది మే 4వ తేదీన రేవంత్ రెడ్డి తమ పార్టీపై అసత్య, విద్వేషకర మాటలతో ప్రచారం సాగించారని బిజెపి తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హైకోర్టులో పిటిషన్ వేశారు. బిజెపి అథికారంలోకి వస్తే రిజర్వేషన్లకు అంతం పలుకుతారని రేవంత్ రెడ్డి చెప్పారని, ఇది అనుచిత, విద్వేషపూరిత ప్రచారం అని బిజెపి తమ పిటిషన్‌లో తెలిపింది.

విచారణల తరువాత ఈ ఏడాది ఆగస్టు 1వ తేదీన రేవంత్ రెడ్డి అభ్యర్థన మేరకు హైకోర్టు ఇది విచారణకు అనర్హ పిటిషన్ అని పేర్కొంటూ , దీనిని కొట్టివేస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు ట్రయల్ కోర్టు ఈ ప్రసంగం ద్వారా ముఖ్యమంత్రి బూటకపు రాజకీయ దుష్ప్రచారానికి దిగినట్లు సాక్షాధారాలు ఉన్నాయని పేర్కొనడాన్ని బిజెపి ఇప్పుడు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో తెలిపింది. అంతకు ముందటి ఐపిసి, ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 125 పరిధిలో ఆయన సమాజంలోని ఇరు వర్గాల మధ్య కక్షలకు, ఘర్షణలకు తావిచ్చినట్లుగా భావించాల్సి ఉంటుందని, పరువు నష్టం దావా చెల్లనేరుతుందని బిజెపి తెలియచేసుకుంది. కాగా ట్రయల్ కోర్టు రూలింగ్‌ను రేవంత్ రెడ్డి తమ న్యాయవాదుల ద్వారా హైకోర్టులో సవాలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చేసే వ్యాఖ్యలతో కేసుకు, పరువునష్టం ఇతరతీవ్రస్థాయి ఆరోపణల పరిధికి తీసుకురాకూడదని తెలిపారు. ఈ పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఫిర్యాదీ కేసుకు బిజెపి జాతీయ స్థాయి నుంచి ఎటువంటి అధికారిక అనుమతి లేదని నిర్థారణ అయినందున ,

ఇతరత్రా ఆధారాల విషయం పక్కన పెడితే , కేసు విచారణకు అర్హం కాదని భావిస్తున్నట్లు తెలిపింది. పైగా రాజకీయ ప్రసంగాలు , అందులోనూ ఎన్నికల దశలో చేసే వ్యాఖ్యలు తరచూ అతిశయోక్తులతో ఉంటాయి. ఇటువంటి వాటిని తీసుకుని పరువునష్టం దావాకు వెళ్లడం మరింత అతి అవుతుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ విషయంలో రేవంత్‌రెడ్డిపై ఎటువంటి కేసు ఉండదని, విచారణ ప్రసక్తే రాదని తేల్చిచెప్పింది. హైకోర్టు తీర్పుపై బిజెపి శాఖ సుప్రీంకోర్టులో ఇప్పుడు దాఖలు చేసిన కేసు విచారణ రాజకీయ సంచలనానికి దారితీసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News