ప్రజల్లో దేశ భక్తిని మరింత ఇనుమడింపజేసేందుకు ఈ నెల 14న హర్ ఘర్ తిరంగా (ప్రతి ఇంటా మువ్వన్నెల జెండా) పేరిట పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని చేపట్టామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్డు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు సుమారు 15 వేల మంది విద్యార్థులతో తిరంగా యాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. 14న ఉదయం 10.30 గంటలకు ప్రారంభించే ఈ యాత్రలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని దేశ భక్తిని చాటాలని ఆయన పిలుపునిచ్చారు.
సోమవారం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 40 లక్షల ఇళ్ళపై త్రివర్ణ పతకాలు రెపరెపలాడాలని లక్షంతో కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ద్విగుణీకృతమైన ఉత్సాహంతో రంగంలోకి దిగారని అన్నారు. ఎవరికైనా మువ్వన్నెల జెండా అవసరమైతే ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలిపారు. ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ఈ యాత్ర చేపడుతున్నామని రాంచందర్ రావు వివరించారు.