విశాఖపట్నం: ప్రపంచంలో కాషాయ పార్టీ(బిజెపి)యే అతిపెద్ద రాజకీయ పార్టీ అని, ఇందులో 14 కోట్ల మంది సభ్యులున్నారని, వారిలో రెండు కోట్ల మంది క్రియాశీలకంగా ఉన్నారని బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి.నడ్డా ఆదివారం తెలిపారు. బిజెపికి లోక్‌సభలో 240 మంది సభ్యులు, దేశవ్యాప్తంగా 1500 మంది ఎంఎల్‌ఎలు, 170కిపైగా ఎంఎల్‌సిలు ఉన్నారని ఆయన అన్నారు . ఇక్కడ పార్టీ ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్‌డిఎ పాలన బాధ్యతాయుతంగా పనిచేస్తోందన్నారు. ప్రధాని మోడీ గత 11 ఏళ్లుగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు. ఆయనకు ముందున్న ప్రభుత్వాలు రాజకీయాలే చేశాయని, పనిచేయలేదని, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. నాడు కుటుంబ రాజకీయాలు, అవినీతి, బుజ్జగింపు రాజకీయాలే నడిచాయన్నారు.
బిజెపి ఇచ్చిన హామీ మేరకు ఆర్టికల్ 370ని రద్దు చేశామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని, సిఎఎ, వక్ఫ్ చట్టంలో సవరణలు తెచ్చామని, ట్రిపుల్ తలాఖ్‌ను రద్దు చేశామని అన్నారు. నేడు భారత్ ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉందన్నారు. జిఎస్టీ శ్లాబ్‌లను నాలుగు నుంచి రెండుకు కుదించామని అన్నారు. ఆయుధాలు, ఫార్మసీ, ఔషధాలు, మొబైల్ ఫోన్లను ఉత్పత్తి చేసి ఎగుమతిచేయడంలో భారత్ ముందుందని అన్నారు. అభివృద్ధి పథంలో ఎన్‌డిఎ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఆయన తెలిపారు.