బెంగళూరు : మంగళవారం రాత్రి భారతీనగర్‌లో రౌడీషీటర్ శివప్రకాష్ అలియాస్ బిక్లుశివును కారులో వచ్చిన ఆగంతకులు హత్య చేశారు. శివప్రకాష్ తల్లి ఎదుటే ఈ హత్య జరిగింది. మృతుడి తల్లి ఫిర్యాదుపై బీజేపీ ఎమ్‌ఎల్‌ఏ, మాజీ మంత్రి భారతి బసవరాజ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. శివప్రకాష్ తల్లి విజయలక్ష్మి తన ఫిర్యాదులో ఎనిమిది నుంచి తొమ్మిది మంది ఇనుపరాడ్లతో తన కుమారుడిని చావ బాదారని, శివప్రకాష్ స్నేహితుడు అడ్డుకోవడానికి ప్రయత్నించగా అతడిపై కూడా దాడి చేశారని ఆరోపించింది. తాను గట్టిగా అరవగానే చుట్టూ ఉన్న జనం వచ్చారని,హంతకులు తెల్లని స్కార్పియో వాహనం, టూవీలర్‌పై పరారయ్యారని పేర్కొంది.
వారిని చూస్తే తాను గుర్తు పడతానని ఆమె పోలీసులకు చెప్పింది. డిజిపి డి దేవరాజ్, జాయింట్ కమిషనర్ రమేష్ బనోథ్, సంఘటన ప్రదేశాన్ని పరిశీలించారు. నిందితులు బసవరాజ్‌తోపాటు జగదీష్ , కిరన్, విమల్ , అనిల్ తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు.బసవరాజ్‌ను ఎఫ్‌ఐఆర్‌లో ఐదో నిందితునిగా నమోదు చేశారు. ఫిబ్రవరి 11న కిటానూర్ లోని శివప్రకాష్ ఆస్తిని జగదీష్, కిరణ్ ఆక్రమించుకున్నారు. అక్కడ ఉన్న ఇద్దరు మహిళా సెక్యూరిటీ గార్డులను తరిమికొట్టారు. నిందితులు తన కుమారుడికి ఫోన్ చేసి బెదిరించేవారని విజయలక్ష్మి ఆరోపించింది.