మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ‘బిజెపిలో కొన్ని దుష్ట శక్తులు ఉన్నాయి..’ అని ఆ పార్టీ నుంచి ఇటీవల సస్పెన్షన్‌కు గురైన ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర ఆరోపణ చేశారు. బిజెపిలో తనకు మిత్రులతో పాటు శతృవులూ ఉన్నారని ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ బిజెపిలో పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, ఇతర నాయకులూ అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. అయితే వారి పేర్లు చెప్పేందుకు ఆయన నిరాకరించారు. కాగా వారు తనలా బహిరంగంగా మాట్లాడేందుకు భయపడుతున్నారని ఆయన తెలిపారు.
గోషామహల్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాకపోవచ్చని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తాను పార్టీకి రాజీనామా చేశానే తప్ప శాసనసభ్యత్వానికి కాదన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తప్పకుండా చేస్తానని అన్నారు. తాను శాసనసభ్యునిగా కొనసాగుతున్నాను కాబట్టి తననూ బిజెపి ఎమ్మెల్యేగా భావించవచ్చని ఆయన తెలిపారు. బిజెపి తన వెంట లేకపోయినా, ప్రజలు తన వెంట ఉన్నారని గర్వంగా చెబుతున్నానని అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరగబోయే ఉప ఎన్నికలో బిజెపి అభ్యర్థి తరఫున ప్రచారం చేయాల్సిందిగా పార్టీ జాతీయ నాయకత్వం ఆదేశిస్తే తప్పకుండా చేస్తానని ఆయన తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో పని చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యే రాజా సింగ్ పునరుద్ఘాటించారు.