మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తన పదవిని కాపాడుకోవడానికే తరచూ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారని బిజెపి ఎమ్మెల్సీ సి. అంజి రెడ్డి విమర్శించారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పటి వరకు నలభై పర్యాయాలు ఢిల్లీకి వెళ్ళారని ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో అన్నారు. అధిష్టానాన్ని మచ్చిక చేసుకోవడానికి ఢిల్లీ వెళుతున్నారు తప్ప రాష్ట్రాభివృద్ధి కోసం కాదని ఆయన తెలిపారు. అధిష్టానాన్ని కలిసేందుకు వెళుతున్నందున నామమాత్రంగా కేంద్ర మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారని ఆయన అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏకాణా కూడా ఇవ్వలేదని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యను ఆయన ప్రస్తావిస్తూ తెలంగాణ అభివృద్ధికి ఇప్పటి వరకు కేంద్రం పన్నెండు లక్షల కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. ఏయే పథకాలకు కేంద్ర నిధులు వచ్చాయో తెలుపుతూ కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి గతంలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని ఆయన చెప్పారు. తెలంగాణలోని మొత్తం 33 జిల్లాల్లో 32 జిల్లాల రోడ్లను అనుసంథానం చేయడం జరిగిందన్నారు. కాచిగూడ, చర్లపల్లి రైల్వే స్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించడం జరిగిందని ఎమ్మెల్సీ అంజిరెడ్డి వివరించారు.