ప్రధాని నరేంద్ర మోదీ బిసి కాదని, కన్వర్టెడ్ బిసి అని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించి మొత్తం బిసి సమాజాన్నే అవమానించారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు విమర్శించారు. ‘మీ ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అడిగితే ఏమని సమాధానం చెబుతారు..’ అని ఆయన రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. శుక్రవారం రాంచందర్ రావు పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ప్రధాని మోదీ కన్వర్టెడ్ బిసి అనే కొత్త పదాన్ని తీసుకుని వచ్చిన రేవంత్ రెడ్డికి గోబెల్స్ బహుమతి ఇవ్వాలని ఎద్దేవా చేశారు.
ముఖ్యమంత్రిగా ఉన్నతమైన పదవిలో ఉన్న రేవంత్ రెడ్డి హుందాగా మాట్లాడాలని ఆయన సూచించారు. తమ పార్టీ బిసిల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నదని ఆయన చెప్పారు. తమ పార్టీ రాష్ట్ర కమిటీలో ఇరవై పదవులు మాత్రమే ఉన్నాయని ఆయన తెలిపారు. ఎనిమిది మంది ఉపాధ్యక్షులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు, ఏడుగురు కార్యదర్శులు, ఒక కోశాధికారి ఉంటారని ఆయన వివరించారు. కాగా కాంగ్రెస్ కుటుంబ పార్టీ కాబట్టి జంబో కమిటీ ఉంటుందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా తనకు ఎటువంటి పదవి లేదని, ఇప్పుడు పార్టీ జాతీయ నాయకత్వం తనను అధ్యక్షునిగా నియమించిందని ఆయన తెలిపారు.