- రాత్రి 8.58 గంటలకు ఆరంభమైన సంపూర్ణ చంద్రగ్రహణం
- 11.41 గంటలకు బ్లడ్‌మూన్‌గా మారిన చందమామ
- తెల్లవారు జామున 2.25గంటలకు విడిచిన గ్రహణం
న్యూఢిల్లీ : ఖగోళ అత్యద్భుత ఘట్టంగా ఆదివారం సంపూర్ణ చంద్ర గ్రహణం ఆవిష్కృతం అయింది. భారతదేశంలో ఆదివారం రాత్రి 8.58 గంటలకు గ్రహణం ఆరంభమైంది. ఖగోళ పరిశోధనలకు అరుదైన అవకాశంగా గ్రహణం నిలిచింది. ఇదే దశలో తరతరాల సాంప్రదాయాలు, ప్రజల విశ్వాసాల క్రమంలో ఆదివారం సాయంత్రం నుంచే గ్రహణం పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ జనం గడిపారు. పలు చోట్ల రాత్రి పది తరువాత జన సంచారం తగ్గింది. ఈ గ్రహణకాలం మొత్తం నిడివి 82 నిమిషాలుగా ఖరారు అయి ఉంది. రాత్రి పూట 11.41 ప్రాంతంలో చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి నీడ అడ్డుపడిన దశలో చంద్రుడు ఎరుపు రంగులో కన్పించిన ఘట్టం బ్లడ్‌మూన్‌గా వ్యవహరిస్తారు.
తెల్లవారుజామున 2.25 వరకూ ఈ గ్రహణం ఉంటుందని ప్లానిటోరియం అధికారులు తెలిపారు. భారత్‌తో పాటు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యూరప్‌దేశాల్లో ఈ చంద్ర పరిణామం కన్నించింది. చంద్రుడు 82 నిమిషాల పాటు పూర్తిగా భూమి నీడలో ఉండే క్రమంలో చంద్రమండల వెలుపలి ఎరుపు పొరలు బ్లడ్‌మూన్‌కు ప్రతీకలు అయ్యాయి. ఈ గ్రహణం భారత్‌లోని అన్ని ప్రాంతాల్లోనూ నెలకొంది. అయితే మబ్బులు పట్టిన దశలో చంద్రుడి గ్రహణ దృశ్యాలను మామూలు కంటితో చూడలేకపోయారు.