ఏపీలోని నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో బొలేరో వాహనం బోల్తాపడిన ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. శ్రీశైలం మల్లన్న దర్శనానికి బొలేరో వాహనంలో వెళ్లి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 21 మందికి గాయాలు కాగా వారిని చికిత్సనిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో తీవ్ర గాయాలైన వారిని వైద్యుల సూచన మేరకు ఏడుగురిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఆదోనికి చెందినవారే. మృతులను లక్ష్మీ,చంద్రమ్మ, శశికళ, గిడ్డయ్యగా గుర్తించారు.
నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం బైర్లూటి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఆదోనికి చెందిన నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలవడం పట్ల ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. శ్రీశైలం దర్శనానికి వెళ్లి తిరిగొస్తుండగా ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాను. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుంది. కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నానని పేర్కొన్నారు.