హైదరాబాద్: సిటీలోని ఉప్పల్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. నిన్న(మంగళవారం) ఉప్పల్ పరిధిలోని భాగాయత్‌లో ఇద్దరు మైనర్ బాలురు మిస్ అయ్యారు. అయితే, బుధవారం మిస్ అయిన ఇద్దరిలో ఓ బాలుడు పిల్లర్ గుంతలో పడి మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని నింపింది. పిల్లర్ గుంతో బాలుడి మృతదేహం గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని బయటకు తీసి పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.
వివరాల్లోకి వెళితే.. ఉప్పల్ భాగాయత్ ప్రాంతంలో జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన సుజాత, వెంకటేష్ దంపతులు తమ ఇద్దరు కుమారులు అర్జున్ (8), మణికంఠ(15), ఒక కూతురుతో కలిసి నివాసం ఉంటున్నారు. నిన్న ఇద్దరు కుమారులు కనిపించకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలోనే భాగాయత్‌లో కుల సంఘాల భవన నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలో బుధవారం అర్జున్ మృతదేహం లభ్యమైంది. దీంతో మరో కుమారుడు మణికంఠ కొరకు ఉప్పల్ పోలీసులు, డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. ఈత కోసం వెళ్లారా? లేదా ఎవరైన చంపి పిల్లర్ గుంతలో పడేశా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.