ఎలాంటి శిక్షణ లేకుండా డ్రైవింగ్ నేర్చుకోవడానికి వచ్చిన ఓ మహిళ అజాగ్రత్తగా కారును నడిపి పక్కన ఆడుకుంటున్న చిన్నారులపైకి ఎక్కించడంతో ఒక బాలుడు మృతి చెందగా, మరొక బాలిక తీవ్రంగా గాయడింది. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లా, అమీన్‌పూర్‌లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అమీన్‌పూర్ మున్సిపల్ పరిధిలోని నర్రెగూడెంలో నివాసముండే శేఖర్ కూతురు ఏకవాణి (14), కుమారుడు మణిధర్ వర్మ (10) తో కలిసి ఆదివారం సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నర్రెగూడెం గ్రౌండ్స్‌కి వెళ్లాడు. పిల్లలను ఆడిస్తూ చాలాసేపు అక్కడే సేదతీరారు. ఇంతలో నవ్య కాలనీకి చెందిన మహేశ్వరి, ఆమె భర్త రవి శేఖర్‌తో కలిసి కారు డ్రైవింగ్ నేర్చుకోవడానికి అదే గ్రౌండ్స్‌కి వచ్చింది. లెర్నింగ్ లైసెన్స్ మాత్రమే కలిగిన మహేశ్వరి ఎలాంటి శిక్షణ లేకుండానే కారు నడిపింది.
అజాగ్రత్తగా, నిర్లక్ష్యంగా కారును నడిపి పక్కన ఆడుకుంటున్న ఏకవాణి, మణిధర్ వర్మలపైకి ఎక్కించింది. ఈ ప్రమాదంలో మణిధర్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోగా తీవ్ర గాయాలపాలైన ఏకవాణిని స్థానికులు హాస్పిటల్‌కు తరలించారు. సరదాగా ఆడుకుంటున్న పిల్లలపైకి కారు రావడంతో వారి తండ్రి శేఖర్ ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు. షాక్ నుండి తేరుకునే లోపే కొడుకు ప్రాణాలు పోగా, కూతురు ఉలుకు, పలుకు లేకుండా పడి ఉంది. అక్కడే ఉన్న స్థానికులు, పలువురు విద్యార్థులు వచ్చి కింద పడి ఉన్న వారిని లేపి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వారిని హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం బాలిక పరిస్థితి నిలకడగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన మహేశ్వరిని పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. సిఐ నరేశ్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.