వైద్యుల నిర్లక్షం వల్లేనని బంధువుల ఆరోపణ
గుండెపోటు వల్ల మృతిచెందాడంటున్న వైద్యులు
మన తెలంగాణ/జూబ్లీహిల్స్, సిటిబ్యూరోః వైద్యం కోసం వచ్చిన బాలుడిని వైద్యులు కాటికి పంపించిన సంఘటన బంజారాహిల్స్‌లోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్12లోని టిఎక్స్ ఆస్పత్రిలో తులసీరాం(7) కాలుకు ఇన్‌ఫెక్షన్ రావడంతో తల్లి చేర్పించింది. ఆదిలాబాద్ జిల్లా, ఇంద్రవల్లికి చెందిన అశ్విని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించింది. బాలుడి తండ్రి ఇటీవలే మృతిచెందగా తల్లి పిల్లలను చూసుకుంటోంది. ఆరు నెలల క్రితం బాలుడిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించారు. కాలికి ఆపరేషన్ చేయాలని అప్పుడు వైద్యులు చెప్పడంతో ఆస్పత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయించారు. వైద్యులకు చూపించేందుకు తల్లి అశ్విని బాలుడిని ఆస్పత్రికి తీసుకుని రాగా పరిశీలించిన వైద్యులు మళ్లీ ఆపరేషన్ చేయాలని చెప్పారు. ఇది వరకు ఆపరేషన్ చేశారని మళ్లీ ఎందుకని బాలుడి తల్లి అశ్విని వైద్యులను ప్రశ్నించగా, ఇన్‌ఫెక్షన్ ఉందని, ఆపరేషన్ చేయాలని చెప్పడంతో రూ.4లక్షలు కట్టారు.
ఆపరేషన్ చేసిన తర్వాత బాలుడిని బయటికి తీసుకునిరాగా రెండు గంటలకే కాలు వాపు వచ్చింది. వెంటనే వైద్యులకు చెప్పినా పట్టించుకోకపోవడంతో బాలుడు మృతిచెందాడని తల్లి ఆరోపించింది. వైద్యుల నిరక్షం వల్లే బాలుడు మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తుండగా, ఆపరేషన్ తర్వాత బాలుడికి గుండెపోటు రావడంతో మృతిచెందాడని వైద్యులు చెప్పారు. మిగతా డబ్బులు కట్టి బాలుడి మృతదేహాన్ని తీసుకుని వెళ్లాలని ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో బాలుడి బంధువులు ఆస్పత్రి వద్దకు వచ్చి ఆందోళన చేశారు. దీంతో ఆస్పత్రి సిబ్బంది బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి బాలుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఆస్పత్రిపై కేసు నమోదు చేశారు.