Thursday, September 11, 2025

రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ప్రాజెక్టులు తీవ్ర నష్టం:బోయనపల్లి వినోద్ కుమార్

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ప్రాజెక్టులకు తీవ్ర నష్టం జరిగే ప్రమాదం ఉందని బిఆర్‌ఎస్ మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరంలో భాగమయిన తుమ్మిడిహెట్టి నుంచి ఎత్తిపోతలు జరగాల్సిందేనని, గ్రావిటీ ద్వారా నీళ్ల తరలింపు సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. వానా కాలం ముగియగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లకు మరమ్మత్తులు చేయిస్తామని జలసౌధలో జరిగిన సమీక్ష సమావేశంలో నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించినట్లు గుర్తు చేశారు. ప్రాజెక్టులకు మరమ్మత్తుల్లో ఆలస్యం చేయవద్దని చెపుతున్నామని, మేడిగడ్డ బ్యారేజ్‌కే మరమ్మత్తులు అవసరముంటాయని, అన్నారం, సుందిళ్లకు అవసరం ఉండకపోవచ్చుని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

వీటికి మర్మమత్తులు నిర్వహించాల్సి ఉన్నా ఇబ్బందేమీ ఉండదని ఆయన వివరించారు. తుమ్మిడిహట్టి దగ్గర నుంచి నీళ్లు ఎత్తిపోయాలంటే రెండు చోట్ల లిఫ్ట్‌లు అవసరమని ఆయన చెప్పారు. 152 మీటర్ల ఎత్తున గోదావరి జలాల తరలింపునకు మహారాష్ట్ర అంగీకరించే ప్రసక్తే లేదని, ఏపీ, మహారాష్ట్ర, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నా 152 మీటర్ల ఒప్పందాన్ని సాధించలేక పోయారని ఆయన విమర్శించారు. ఇప్పుడు ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎంగా ఉన్నారని, ముంపు ఎక్కువుంటుందని ఆయన 152 మీటర్లకు అస్సలు ఒప్పుకోవడం లేదని చెప్పారు. 152 మీటర్ల వద్ద తుమ్మిడి హెట్టి దగ్గర ప్రాజెక్టు అసాధ్యమని, తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి లిఫ్ట్ ద్వారా నీళ్లు తరలించాలని ఆయన పేర్కొన్నారు.

మేడిగడ్డని త్వరగా మరమ్మత్తులు చేయించండి
మేడిగడ్డ పిల్లర్లు రిపేర్ చేస్తామని ప్రభుత్వం చెప్పడాన్ని స్వాగతిస్తున్నట్లు వినోద్ కుమార్ తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీ విలువ రూ. 3,500 కోట్లు. అందులో మూడు పిల్లర్ల విలువ కేవలం రూ. 300 కోట్లని, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వ్యయంలో మూడు బారేజ్‌ల్ విలువ 6 శాతం మాత్రమే అన్నారు. యాసంగిలో మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయక పోవడంతో రైతులు నష్టపోయారని వివరించారు. ఆ పరిస్థితి పునరావృతం కానీయొద్దని, వీలయినంత త్వరగా మేడిగడ్డకు మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తేవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి కరీంనగర్, మెదక్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల రైతులకు యాసంగి పంటకు నీళ్లు ఇవ్వాలని, ఉత్తర తెలంగాణ జిల్లాల రైతులు ఇబ్బందులు పడకుండా చూడాలని కోరారు.

రెండు పార్టీలకు సమాన దూరంలో ఉన్నాం
కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా రాష్ట్రంలో ఉండడంతో దీంతో రెండు పార్టీలకు సమాన దూరంలో ఉన్నామని వినోద్ కుమార్ తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌పై కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు క్రాస్ అయ్యాయని ప్రచారం జరుగుతోందని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారని, కాంగ్రెస్‌కు ఓట్లు వేయించారా లేదా క్రాస్ చేయించారో తెలియదని విమర్శించారు. ఇంతకుముందు బిఆర్‌ఎస్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనలేదని ఆయన గుర్తు చేశారు. సందర్భాన్ని బట్టి బిఆర్‌ఎస్ నిర్ణయం తీసుకుంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ కోసం పదవులు వదులుకున్న చరిత్ర మాదని, తెలంగాణ మీద ఈగ వాలినా బీఆర్‌ఎస్ సహించదని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు కె .వాసుదేవ రెడ్డి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News