Wednesday, August 20, 2025

అంగన్‌వాడీ చిన్నారులకు త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం

- Advertisement -
- Advertisement -

రాష్ట్రంలోని అంగన్‌వాడీ చిన్నారులకు త్వరలో బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రవేశపెడతామని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. బుధవారం ఎర్రమంజిల్‌లోని మిషన్ భగీరథ సమావేశం మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ ఫుడ్స్ కార్యాకాలాపాలపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన అంగన్‌వాడీ భవనాల నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పన, సాక్షం అంగన్‌వాడీ, ఆరోగ్యలక్ష్మి, మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి, చిన్నారులకు యూనిఫాం పంపిణీ, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు యూనిఫాం చీరల పంపిణీ, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌స బలోపేతం, చిన్నారులకు విజయ పాల సరఫరా, బ్రేక్ ఫాస్ట్ ప్రోగాం, పాలనా కేంద్రాలు, పోషణ్ అభియాన్ తదితర అంశాల్లో సాధించిన ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో త్వరలోనే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభిస్తాన్నామని, ఇప్పటికే హైదరాబాద్‌లోని 139 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రయోగత్మాకంగా అమలు చేశామన్నారు.

దీంతో పిల్లల హాజరు 30 శాతం పెరిగిందని మంత్రి వెల్లడించారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలను వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇండ్ల తరహాలోనే అంగన్‌వాడీ కేంద్రాలకు ఇసుక ఉచితంగా సరఫరా చేస్తామన్నారు. జిల్లా కలెకర్టర్లు ఈవిషయంలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రస్తుతం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో తొమ్మిది వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ సేవలందిస్తున్నాయని, మరో ఐదు నిర్మాణంలో ఉన్నాయని మంత్రి చెప్పారు. ప్రస్తుత అవసరాలకు అణుగుణంగా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌లో మరిన్ని సదుపాయాలు కల్పించే దిశగా కృషి చేయాలని మంత్రి సూచించారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సేవలను అందించడంలో ఎక్కడా రాజీ పడొద్దని మంత్రి ఆధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాలను దేశానికి ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని మంత్రి పేర్కొన్నారు.

టిజి ఫుడ్స్ మిషనరీపై సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలి
టిజి ఫుడ్స్‌లోని మిషనరీపై సేఫ్టీ ఆడిట్ తప్పనిసరిగా జరిపించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. నూతనంగా రూపొందించిన బాలామృతం, బ్రేక్ ఫాస్ట్ పౌడర్‌ను మంత్రి పరీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పిల్లలకు రుచికరంగా ఉండేలా ఉత్పత్తులను మెరుగుపరచాలని సూచించారు. షుగర్ కంటెంట్ తగ్గించి మిల్క్ కంటెంట్ పెంచాలని అధికారులను ఆదేశించారు. టిజి ఫుడ్స్ పరిశ్రమలో నెలకు 2600 మెట్రిక్ టన్నుల బాలామృతం, బాలామృతం ప్లస్, స్నాక్స్ ఉత్పత్తి జరుగుతుందని, పర్రిశమకు మరింత ఉత్పత్తి సామర్ధం ఉందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమ కెపాసిటీని పూర్తిస్థాయిలో వినియోగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ఫోర్టిఫైడ్ రైస్, అంగన్‌వాడీలకు రెడీ టు కుక్ బ్రేక్ పాస్ట్ పౌడర్, చిక్కీలు, టిజి ఫుడ్స్ ద్వారానే తయారైయ్యేలా కార్యచరణ రూపొందించాలని ఆదేశించారు.

లక్షలాది మంది చిన్నారులు, తల్లులకు టిజి ఫుడ్స్ ద్వారా పోషకాహారాన్ని అందిస్తున్నామని, ఇది చిన్నారుల జీవితంలో ముడిపడిన అంశమని ఎక్కడా నిర్లక్షం చోటు చేసుకోకుండా సిబ్బంది క్రమశిక్షణతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. యూనియన్ల పేరుతో కొందరు విధులకు గైర్హాజరవుతున్నారని, విధులకు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. సిబ్బందికి పదోన్నతులు, కారుణ్య నియామకాలు కల్పించామని, ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మిషనరీతో పాటు గోదాములపై సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో టిజి ఫుడ్స్ పరిశ్రమలో చైర్మన్ ఎం.ఎ ఫహీం, కార్యదర్శి అనితా రామచంద్రన్, మేనేజింగ్ డైరెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News