ఇటీవల జింబాబ్వేతో జరిగిన ఓ టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్టాండ్ ఇన్ కెప్టెన్ వియాన్ ముల్డర్ (Wiaan Mulder) 400+ పరుగులు చేసే అవకాశాన్ని తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. 367 పరుగల వ్యక్తిగత స్కోర్ వద్ద ఉండగా.. అతనే ఇన్నింగ్స్‌ని డిక్లేర్ చేశాడు. ఈ నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే విండీస్ క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారాపై ఉన్న గౌరవంతోనే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ముల్డర్ ఆ తర్వాత వెల్లడించారు. దీంతో 400 పరుగుల రికార్డు లారా పేరిటే ఉండిపోయింది. అయితే తాజాగా ఈ ఘటనపై లారా స్పందించారు. ముల్డర్‌తో ఆయన మాట్లాడారు.
ఈ విషయాన్ని ముల్డర్ (Wiaan Mulder) స్వయంగా బయటపెట్టాడు. రికార్డులు ఉండేదే బ్రేక్ చేయడానికి అని లారా అన్నారని.. ఆయన సాధించిన ఘనతను మరొకరు అధిగమించాలని కోరుకున్నట్లు వెల్లడించాడు. ఒకవేళ మరోసారి ఛాన్స్ వస్తే వదులుకోవద్దని లారా సూచించినట్లు తెలిపాడు. సొంతంగా కష్టపడి ఓ లెగసీని సృష్టించాలనని.. తాను సాధించిన రికార్డులను ఎవరైన బ్రేక్ చేస్తే.. తనకు సంతోషంగా ఉంటుందని ఆయన అన్నట్లు ముల్డర్ పేర్కొన్నాడు. కానీ, ఇప్పటికీ తాను సరైన నిర్ణయమే తీసుకున్నానని.. ఆట గౌరవాన్ని కాపాడాలని.. భారీ స్కోర్లు దిగ్గజాల పేరిటే ఉండాలని తన నిర్ణయాన్ని ముల్డర్ సమర్థించుకున్నాడు.