కన్నెపల్లి పంప్ హౌస్ కు ఎందుకు వెళ్లి ప్రారంభించడం లేదు.
కన్నెపల్లి పంపులు ఆన్ చేస్తే 50 లక్షల ఎకరాలకు నీళ్లు
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి
మన తెలంగాణ/మోత్కూర్: కృష్ణా నది నీళ్లు సముద్రం పాలు చేయడానికి హుటాహుటిన హెలికాప్టర్ లో వెళ్లి నాగార్జున సాగర్ గేట్లు ఎత్తిన రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ప్ర్రారంభించడానికి ఎందుకు వెళ్లడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ మండలంలోని పాటిమట్ల ఎక్స్ రోడ్ లోని శ్రీ లక్ష్మీ నర్సింహా ఫంక్షన్ హాల్ లో బుధవారం మోత్కూర్,అడ్డగూడూరు మండలాల బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షత జరిగింది. సమావేశానికి ముఖ్య అతిధిగా హాజరైన జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి దమ్ముంటే కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని సవాల్ విసిరారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే రాష్ట్రంలోని 50 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించవచ్చునని తెలిపారు. ప్రభుత్వానికి నీళ్లు ఇవ్వడం చేతకాక పోతే కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసిఆర్ కు అప్పగిస్తే సూర్యాపేటలోని కాల్వ చివరి వరకు 4 రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపుతామని, నీళ్లు ఇవ్వలేక పోతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. కొందరు నాయకులు ముఖ్యమంత్రి మెప్పు కోసం తనను రాజీనామా చేయాలని డిమాండ్ లు చేస్తున్నారని, నేనొక్కడినే ఎందుకు ఉమ్మడి జిల్లాలోని 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేసి ప్రజల ముందుకు వెళ్దాం రండి అంటే.. ఒక్కరూ మాట్లాడటం లేదని ఎద్దేవా చేశారు.
ఢిల్లీలో జరిగే సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్లడం లేదని అధికారులు ప్రకటిస్తే, ఢిల్లీ నుండి వచ్చిన ఒక్క ఫోన్ తో అర్డరాత్రి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారని, ఢిల్లీ వెళ్లిన ఆయన అధికార నివాసంలో కాకుండా ప్రయివేటు హోటల్ లో ఎందుకు ఉన్నారో సమాధానం చెప్పాలన్నారు. అధికార నివాసంలో ఉంటే మోడీ,చంద్రబాబు ఏజెంట్ లను కలిసే విలుండదనే హోటల్ లో ఉన్నారని అన్నారు. ఢిల్లీలో బనకచర్ల అంశంపై చర్చే జరగలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెబుతుంటేనే ఆంధ్ర నాయకుడు ఒకరు బనకచర్లపై కమిటీ వేయడానికి రేవంత్ సంతకం చేశారని విలేకరులకు పత్రాలు చూపించారని తెలిపారు. బనకచర్లకు అనుమతులు రావడం కోసమే ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంను ఎండబెడుతున్నారని అన్నారు. కాళేశ్వరం కింద ఇంకా నీళ్లు వాడుకోవడం లేదని రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తుందని అన్నారు. ఎన్నికల ముందు అలవి కాని హామీలు, డిక్లరేషన్ లు ఇచ్చి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించింది.
ఆరు గ్యారెంటీలు,13 పథకాలు, 420 హామీలు,5 డిక్లరేషన్ లు ఏమైనాయని ప్రజలు ప్రశ్నిస్తారనే రోజుకో విధంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అందులో భాగమే ఫోన్ ట్యాపింగ్, ఈ డి రైడ్స్,సి బీ ఐ, సి ఐ డి అంటూ రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ నడుపుతున్నాడని అన్నారు.మంత్రులు చిల్లరగా వ్యవహరిస్తున్నారని, ఢిల్లీకి మూటలు మోసే,ఓటుకు నోటు దొంగ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాడని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికి దొరికింది వారు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఎస్సారెస్పీ, సింగూరు, మంజిరాలలో నీళ్లు లేకుండా చేసి, గోదావరిపై ఒక్క ప్రాజెక్టు కట్టకుండా చూడాలని ఆంధ్ర నాయకులు 60 ఏళ్ళు కుట్రలు చేశారని ఇది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న వెంటనే కెసిఆర్ గోదావరిపై కాళేశ్వరం పాజెక్టు కట్టి నీళ్లు ఎత్తి పోసి లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నీళ్లు ఇవ్వడం చేతకావడం లేదన్నారు. మోడీ పదకొండున్నర ఏళ్ళ పాలనలో తెలంగాణకు ఒక్క రూపాయి ఇవ్వలేదని, తెలంగాణపై మోడీ సవతి తల్లి ప్రేమ చూపుతారన్నారు. రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసిందే మోడీ, చంద్రబాబు అని, రేవంత్ రెడ్డి ఆర్థికంగా, అధికారికంగా మోడీ సహకరించారని చెప్పారు. మోడీ రేవంత్ కు శతృత్వమే ఉంటే బీజేపీ నాయకులు ఎవరిపై విమర్శలు చేస్తారో చూస్తే అది శతృత్వమా, లేక చీకటి ఒప్పందామా అర్ధమవుతుంది అన్నారు.
చంద్రబాబు ఏజెంట్ ను ముఖ్యమంత్రి రాష్ట్ర నీటిపారుదల కార్యదర్శిగా నియమించారని, ఆయన రాసి ఇచ్చినవే ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడతారని అన్నారు. తెలంగాణ సాధించిన నాయకుడు, తెలంగాణ జాతి పీత తెలంగాణా తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ పై ఎవరైనా ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సందర్భంలోనే బీ ఆర్ ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు తప్ప.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ నాయకుల లాగా నోటికి వచ్చినట్టు ఎవరూ మాట్లాడటం లేదన్నారు. కాళోజీ చెప్పినట్టు తెలంగాణ కు ద్రోహం చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా ఇస్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో హామీ ఇచ్చారని అన్నారు. బీసీ రిజర్వేషన్లు అమలు కోసం ఢిల్లీలో ధర్నా చేస్తామంటున్న సీఎం, బీసీలకు రిజర్వేషన్లు అమలుచేసి చూపాలని డిమాండ్ చేశారు.
బీఆ ఎస్ నాయకులు కలిసి కట్టుగా ఉండి రాబోయే స్థానిక సంస్ధల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగుర వేయాలని పిలుపు నిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, బూడిద బిక్షమయ్య గౌడ్, బీ ఆర్ ఎస్ యాదాద్రి,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి, బడుగుల యాదవ్, హుజూర్ నగర్ ఇంచార్జ్ ఒంటెద్దు నర్సింహా రెడ్డి లు ఎన్నికల్లో గెలిచేందుకే అలవిగాని హామిలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ మోసాలను ప్రజలకు తెలిపి వారిని చైతన్య వంతులుగా చేయాలన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయక పోగా ఉన్న పథకాలు తీసేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి రైతు భరోసా 5 సార్లు ఇవ్వాల్సి ఉండగా ఎంపీ ఎన్నికల అప్పుడు ఒకసారి, ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఉన్నాయని మరోసారి రెండు సార్లే ఇచ్చారని, మూడు సార్లు ఎగొట్టారన్నారు. ఎన్నికలు ఏవైనా గులాబీ జెండా ఎగురవేయడానికి నాయకులు,కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ప్రధాని మోడీ పోటీ చేసిన వారణాసి ఎక్కడ ఉందో తెలియని వ్యక్తి మన ముఖ్యమంత్రి అన్నారు.2023 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నమ్మి మోసపోయారని, కాంగ్రెస్ పాలనపై ప్రజలు చాలా విరక్తి చెందారని,దానిని బీ ఆర్ ఎస్ నాయకత్వం ఓట్లుగా మలుచుకోవాలన్నారు. బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెట్టారని అది అమలు అయ్యేది కాదన్నారు. 2013 నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వమే కోర్ట్ కు రిజర్వేషన్లు 50 శాతం మించుకుండా అమలు చేస్తామని రాసిచ్చారని అందుకు అనుగుణంగానే రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని తెలిపారు. అధికారంలో ఉన్న పదేళ్ళలో ఎప్పుడూ సంస్కారం లేకుండా మాట్లాడలేదన్నారు. ఎన్నికలు ఏవైనా బీ ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు కలిసి కట్టుగా పని చేసి గులాబీ జెండా ఎగురవేయాలని అన్నారు.
ఈ సమావేశంలో. బీ ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేంధర్ రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీ నర్సింహా రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్లు చిప్పలపల్లి మహేంద్రనాద్, కోణతం యాకూబ్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పొన్నెబోయిన రమేష్, కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీరాముల జ్యోతి అయోధ్య, మాజీ ఎంపీపీ దర్శనాల అంజయ్య, నాయకులు కల్లెట్లపల్లి శోభన్ బాబు, అశోక్ గౌడ్, పొన్నాల వెంకటేశ్వర్లు, జంగ శ్రీను, గిరగాని శ్రీను, చౌగోని సత్యం గౌడ్, కొండ సోం మల్లు, మర్రి అనిల్ కుమార్, ద బ్బేటి శైలజ,కట్ట ఇంద్ర జ్యోతి, బండ స్వరూప, గజ్జి మల్లేష్, రాంపాక నాగయ్య,అండెం రాజిరెడ్డి, క్రాంతి కుమార్ రెడ్డి, దాసరి తిరుమలేష్, బయ్యని పిచ్చయ్య, దండెబోయిన మల్లేష్, రాజేష్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.