ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న పార్టీ
టికెట్ రేసులో మాగంటి సతీమణి, సోదరుడు
ఎవరికి టికెట్ ఇస్తే గెలుస్తారు..?
విజయావకాశాలపై పార్టీ అగ్రనేతల చర్చలు
మనతెలంగాణ/హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవగర్గానికి ఉపఎన్నిక బిఆర్‌ఎస్ పార్టీ ఫోకస్ పెట్టింది. షెడ్యూల్ వెలువడనప్పటికీ ఇప్పటి నుంచే ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం కసరత్తు మొదలుపెట్టింది. సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకొని పూర్వవైభవం దిశగా అడుగులు వేయాలన్న నిశ్చయంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బిఆర్‌ఎస్ ఉన్నది. ఈ ఎన్నికలో బలమైన అభ్యర్థిని బరిలో దింపేందుకు గులాబీ పార్టీ కసరత్తును ప్రారంభించింది. అనారోగ్యంతో మరణించిన మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నుంచి వరుసగా మూడుసార్లు 2014, 2018, 2023 ఎన్నికల్లో విజయం సాధించారు. మొదట తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఆయన, తర్వాత గులాబీ పార్టీలో విలీనమై పోటీ చేసి గెలుపొందారు.
హైదరాబాద్ జిల్లా బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షునిగా కూడా గోపీనాథ్ బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన ఆకస్మిక మరణంతో రానున్న ఉప ఎన్నికలో అభ్యర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి అత్యంత కీలకంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా కెసిఆర్ నేతృత్వంలో వంద స్థానాలు ఖాయమని నేతలు చెబుతూ వస్తున్నారు. రాష్ట్ర రాజధాని బిఆర్‌ఎస్ బలంగా ఉందని, ప్రజల నుంచి పూర్తి మద్దతు ఉంటుందని అంటున్నారు. ఈ తరుణంలో జరుగుతున్న ఉప ఎన్నికలో పార్టీ అభర్థిని గెలిపించుకోవడం గులాబీ పార్టీకి చాలా ముఖ్యం కానున్నది. కాగా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాల్లో ఫలితాలు ప్రతికూలంగా వచ్చినప్పటికీ, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లో మాత్రం బిఆర్‌ఎస్‌కు అనుకూల ఫలితాలు వచ్చాయి.
మాగంటి కుటుంబ సభ్యులకే బిఆర్‌ఎస్ టికెట్..?
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బరిలో బిఆర్‌ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు పెద్ద సంఖ్యలో ఆశావహులు ఆసక్తి కనబరుస్తున్నారు. బిఆర్‌ఎస్ పార్టీ నుంచి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి దివంగత ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత, ఆయన సోదరుడు వజ్రనాథ్ రేసులో ఉన్నట్లు తెలిసింది. అలాగే పిజెఆర్ కుమారుడు, జూబ్లీహిల్స్ మాజీ ఎంఎల్‌ఎ విష్ణువర్దన్ రెడ్డి, రావుల శ్రీధర్ రెడ్డి పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో టికెట్ ఎవరికి కేటాయిస్తే బిఆర్‌ఎస్ విజయం దక్కుతుంది.. వీరు కాకుండా ఇతర నేతలకు ఎవరికైనా అవకాశం కల్పిస్తుందా..? పార్టీ అధిష్టానం తీవ్రంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. నియోజకవర్గంలో బిఆర్‌ఎస్ అంతర్గత సర్వేలు చేయిస్తున్నట్టుగా సమాచారం.
ఆ నివేదికల ఆధారంగా అభ్యర్థి ఎవరనే దానిపై బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే సానుభూతి కోణం, నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాల ఆధారంగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకు లేదా సోదరుడికి టికెట్ కేటాయిస్తే విజయావకాశాలు ఎలా ఉంటాయని పార్టీ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్‌లో లాస్య నందిత మృతితో ఉప ఎన్నిక రాగా ఆమె సోదరి నివేదితకు బిఆర్‌ఎస్ టికెట్ ఇవ్వగా, ఆమె ఓడిపోయారు. దీంతో సానుభూతి అంశం ఏ మేరకు పనిచేస్తుంది…? అనేది గులాబీ పార్టీ అధిష్టానం అంచనా వేస్తున్నట్లు సమాచారం.