భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు శుక్రవారంనాడు ఎక్స్‌లో ఒక ట్వీట్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నందుకు ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సిగ్గుపడాలి అన్నారు ఆ ట్వీట్లో. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ఓటర్ల నమోదు, ఎన్నికల నిర్వహణ మొదలైన అంశాలలో జరుగుతున్న అవకతవకల మీద ఓట్ చోరీ అని సాగిస్తున్న ఉద్యమం కంటే కూడా ఎంఎల్‌ఎల చోరీ దారుణమైన నేరమని కెటి రామారావు అభిప్రాయపడ్డారు. ఇదంతా ట్వీట్‌లోనే, ఈ మధ్యకాలంలో ఒక కెటి రామారావే కాదు చాలామంది రాజకీయ నాయకులు, చాలా రాజకీయ పార్టీలు తాము ప్రజలకు చేరవేయదల్చుకున్న సమాచారాన్ని ఇట్లా ఎక్స్ లోనో, వాట్సాప్ లోనో, ఇంకా ఇతర సామాజిక మాధ్యమాల్లోనో పెట్టి మీడియాను అది రాసుకోండి, ప్రసారం చేసుకోండి అని చెప్తున్నారు.
ఇక్కడ ఈ వార్తను రాసే విలేకరులు, ప్రచురించే పత్రికలు, ప్రసారం చేసే ఛానళ్లు ఏవైనా సందేహాలు ఉంటే తీర్చుకునే మార్గం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది రాసుకోవాలి అంతే. సామాజిక మాధ్యమాలేవి లేని కాలంలో రాజకీయ నాయకులు తాము ప్రజలకు తెలియజేయదలుచుకున్న విషయాలను విలేకరుల సమావేశాలు నిర్వహించి చెప్పేవారు. అప్పుడు సదరు నాయకుడు చెప్తు న్న దానిలో ఏమైనా సందేహాలు ఉంటే అక్కడే విలేకరులు ప్రశ్నలు అడగడం, దానికా నాయకుడు సమాధానం చెప్పడంతో వార్త సంపూర్ణంగా ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం పోయింది. ఎప్పుడో అమావాస్యకో, పున్నానికో నాయకులు పత్రిక గోష్టి నిర్వహించినా విలేకరులు సందేహాలు తీర్చుకోవడానికి ప్రశ్నలు వేసే అవకాశం ఇవ్వడం చాలా అరుదు. మేము చెప్పింది రాసుకోండి అన్న ధోరణి ఈ పార్టీ, ఆ పార్టీ అనే తేడా లేకుండా అందరూ పాటిస్తున్నదే.
Also Read: ఉరుమురిమి హరీశ్‌పైనా?
రాజకీయ పార్టీలు ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి అందులో తాము మాత్రమే సమాచారం పంపే విధంగా అవతలి వాళ్ళు ఎవరు చర్చలోకి గాని, సంభాషణలోకి గాని దిగకుండా ఉండేట్టు ఏర్పాటు చేసుకుంటున్నారు. దానితో వాట్సాప్‌లో వచ్చిన సమాచారాన్ని యథాతథంగా నాయకులు రాసే తప్పులతో సహా తూచా తప్పకుండా ప్రచురించేస్తున్నాయి కొన్ని పత్రికలూ. దీనికి కట్ అండ్ పేస్ట్ జర్నలిజం అని పేరు కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. సరే ఇప్పుడు మళ్లీ కెటిఆర్ తాజా ట్వీట్ లోకి వెళితే ఆయన ఈ సమాచారం ఎక్స్ లో కాకుండా నేరుగా పత్రికా గోష్టి నిర్వహించి ఉంటే విలేకరులు ఎటువంటి ప్రశ్నలు అడిగేవారు అన్న విషయం గురించి చర్చించుకుందాం.
దానికన్నా ముందు పార్టీ ఫిరాయింపులను కెటి రామారావు అంత దారుణమైన నేరంగా ఎందుకు పరిగణించారు? అన్న విషయం కొంచెం వివరంగా మాట్లాడుకోవాలి. బహుశా ఆయన 2001 నుండి 2014 వరకు అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత రాజకీయ పరిణామాలు గుర్తొచ్చి, 2014 తర్వాత 2023 వరకు జరిగిన విషయాలు గుర్తుకు రాక మాట్లాడి ఉంటారు. ఒక పార్టీకి రాజీనామా చేస్తున్నప్పుడు ఆ పార్టీ ద్వారా సంక్రమించిన పదవికి రాజీనామా చేయాలనే మంచి ఆలోచన తెలంగాణ ఉద్యమ మలి దశలో 2001లో కెటిఆర్ తండ్రిగారు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు తోటే మొదలైంది. 2001లో ఆయన తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం కోసం ట్యాంక్ బండ్ వద్ద జలవిహార్‌లో నిర్వహించిన సభలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడిటికి రాజీనామా చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ద్వారా సంక్రమించిన ఉపసభాపతి పదవికి, తెలుగుదేశం పార్టీ ద్వారా సంక్రమించిన శాసన సభ్యత్వానికి, అట్లాగే ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామాలు చేశారు. ఆ తర్వాత కూడా ఒక లక్ష్యం కోసం రాజీనామాలు చేయడంలో కెసిఆర్‌ని ఆదర్శంగా తీసుకోవచ్చు.
2006లో, 2008లో రెండుసార్లు ఆయన కరీంనగర్‌నుంచి గెలిచిన లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఉపఎన్నికల్లో తిరిగి గెలిచి వచ్చారు. అంతేకాదు 2011లో తన పార్టీకి చెందిన 11 మంది శాసనసభ్యుల చేత రాజీనామాలు చేయించి ఉపఎన్నిక తప్పనిసరి చేయించారు. అప్పట్లో ఒక బిజెపి సభ్యుడు నిజామాబాద్ నుంచి ఎండల లక్ష్మీనారాయణ కూడా రాజీనామా చేసి ఉపఎన్నికలు గెలిచినట్టున్నారు. అప్పుడు ఆయన ఓడించింది సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడిగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నాయకుడు డి శ్రీనివాస్‌ను. ఇదంతా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రజల్లో నెలకొన్న దృఢ సంకల్పం కారణంగా సాధ్యమైంది అనడంలో సందేహం లేదు. బహుశా ఇవే గుర్తుండి కెటి రామారావు రాహుల్ గాంధీని సిగ్గుపడండి అంటున్నట్టు ఉన్నారు. అంతేకాదు ఆయన ఇంకో మాట కూడా ఎక్కడో అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న అబద్ధాలను మీడియా యథాతథంగా ప్రచురిస్తున్నది అని. మరి ఈ శనివారంనాటి పత్రికలన్నీ కెటి రామారావు గారి ట్వీట్‌లో అర్ధ సత్యాలన్నిటిని కూడా యథాతథంగానే ప్రచురించాయి వాటి మాటేమిటి.
ఒక పార్టీ వ్యవహారం నచ్చకపోతే నో లేదా మరో పార్టీ బాగా పని చేస్తుందనిపిస్తేనో పార్టీ మారడానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఆ పార్టీ ద్వారా సంక్రమించే పదవులకు రాజీనామా చేసి ఇంకో పార్టీ లోకి మారితే పేచీ ఉండదు. తాజా ఉదాహరణ, కెటి రామారావు సొంత సోదరి కవితను తాను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆమె ఆ పార్టీ ద్వారా సంక్రమించిన శాసనమండలి సభ్యత్వానికి స్పీకర్ ఫార్మాట్‌లో రాజీనామా పంపించారు. పార్టీకి కూడా రాజీనామా చేశారు. శాసనమండలి అధ్యక్షులు ఇంకా ఆమె రాజీనామా మీద ఏ నిర్ణయం తీసుకున్నట్టు లేరు. ఈ సందర్భంగా మరొకరిని గురించి కూడా మాట్లాడుకోవాలి. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు రాజాసింగ్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఆ విషయాన్ని స్పీకర్‌కు తెలిపి నిర్ణయం తీసుకోమనండి అని బాధ్యత పార్టీ మీదకు తోసి కూర్చున్నారు. పార్టీ ఆయన రాజీనామాను ఆమోదించింది, కానీ శాసనసభ్యత్వం తొలగించమని స్పీకర్‌కు ఇంకా అడిగినట్లు లేదు. ఈలోగా ఆయనే నేను రాజీనామా చేయను ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నారు.
ఇటువంటి ఉదాహరణలు మనకు చాలా కనిపిస్తాయి. ఇక కెటి రామారావు గుర్తు పెట్టుకున్న కాలపు విషయాలు చెప్పుకున్నాం కాబట్టి ఆయన మర్చిపోయిన విషయాలను ఒకసారి గుర్తుచేయాలి. ఇది గుర్తు చేస్తుంటే ఆయన మేము అంతా చట్టప్రకారమే చేశాం, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం చెప్పిన విధంగానే చేసాం అని వాదించవచ్చు. ఆ వాదన సాంకేతికంగా నిలబడుతుందేమో కానీ నైతికంగా ఎటువంటి బలాన్ని ఇవ్వదు. సుదీర్ఘ పోరాటం అనంతరం రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్ర సమితి 2014లో పరిపాలన చేపట్టిన నాటి నుండి 2023 వరకు ఇతర పార్టీల నుండి గెలిచిన 38 మంది శాసనసభ్యులు, 18మంది శాసనమండలి సభ్యులు అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితికి తర్వాత పేరు మార్చుకున్న భారత రాష్ట్ర సమితికి ఫిరాయించారు.
వీరిలో కొందరు మంత్రులయ్యారు, మరికొన్ని ముఖ్య పదవులు కూడా అధిష్టించారు. ఆ తొమ్మిదేళ్ల పైచిలుకు కాలం ఎన్ని ఫిర్యాదులు చేసినా స్పీకర్ గాని, మండలి చైర్మన్ గాని ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇంత పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగినా కిమ్మనకుండా ఊరుకున్న సభాపతులు 2019లో మాత్రం ఆ పార్టీనుండి కాంగ్రెస్‌కు ఫిరాయించిన ముగ్గురు శాసనమండలి సభ్యులపైన అనర్హత వేటు వేసారు. ఇదే రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం. రాజకీయ నాయకుల జవాబుదారీతనాన్ని పెంచడానికి, ప్రభుత్వాల సుస్థిరతను కాపాడటానికి ఉద్దేశించింది.
ప్రభుత్వాల సుస్థిరత్వం కాపాడుకోవడం అంటే 2014లో టిఆర్‌ఎస్ చేసిన పద్ధతిలో కాదు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను ఫిరాయింపుల ద్వారా కూల్చే అవకాశం లేకుండా వాటికి భద్రత కల్పించడం అని అర్థం. గత పది పదకొండేళ్ల కాలంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వివిధ రాష్ట్రాల్లో ఏం చేసిందో చూసాం. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఆ ప్రభుత్వాలను కాపాడలేకపోయింది. బహుశా బిజెపి నుంచి ఈ ప్రమాదం తమకు కూడా ఉంటుందేమో అన్న అనుమానంతోనే కెసిఆర్ 2014లో అధికారంలోకి వచ్చాక అంత పెద్ద ఎత్తున ఫిరాయింపుల్ని ప్రోత్సహించారేమో కానీ అది ఎన్నటికీ సమర్థనీయం కాదు. ఇదంతా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఇచ్చిన మినహాయింపు కారణంగా జరిగింది. మూడింటి రెండు వంతుల సభ్యులు పార్టీ ఫిరాయిస్తే అది ఫిరాయింపు కిందకు రాదు అన్నది ఒక మినహాయింపు. అట్లాగే అనర్హత అంశం మీద నిర్ణయం తీసుకునే విషయంలో సభాపతులకు కాలపరిమితి నిర్ణయించకపోవడం కూడా ఒక కారణం. మేము రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాం అని కెటి రామారావు చెప్పుకుంటున్నది ఈ రెండు అంశాల కారణంగానే. 2014 తర్వాత అప్పటి తెలుగుదేశం పార్టీ నుండి, కాంగ్రెస్ పార్టీ నుండి అప్పుడిద్దరు ఇప్పుడు ముగ్గురు పార్టీ ఫిరాయించినా మూడింట రెండు వంతుల మంది జమ అయ్యేదాకా ఆగి అప్పుడు అధికారికంగా ప్రకటించి మేము రాజ్యాంగాన్ని గౌరవించామన్నారు.
ఇది ఎట్లా సమర్థనీయం? భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు మళ్లీ ట్వీట్ ద్వారా కాకుండా పత్రికా గోష్టి నిర్వహించి వివరిస్తే బాగుంటుంది. ఇక ప్రస్తుతం ఆయన రాహుల్ గాంధీని సిగ్గుపడమంటూ చేసిన వ్యాఖ్యలకు ప్రేరణ అయిన ఉదంతాన్ని గురించి మాట్లాడుకోవాలి. 2023లో భారత రాష్ట్ర సమితి తరపున గెలిచిన 37 మంది శాసనసభ్యుల్లో ఓ పదిమంది పార్టీ ఫిరాయించారు. దీన్ని సవాలు చేస్తూ కెటి రామారావు, మరికొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మూడు మాసాల్లో ఈ శాసనసభ్యుల పార్టీ ఫిరాయింపు వ్యవహారంలో ఒక నిర్ణయం తీసుకోవాలని శాసనసభ స్పీకర్‌ను కోరుతూ జులై 31న తీర్పు వెలువరించింది. అంటే అక్టోబర్ మాసాంతానికి స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడా 10మంది శాసనసభ్యులు తాము కాంగ్రెస్‌లో చేరలేదని లేదా ఇంకా తాము బిఆర్‌ఎస్ శాసనసభ్యులుగానే కొనసాగుతున్నామని చెప్తున్నా రు. ఇంతకుముందు కెటిఆర్ విషయంలో చెప్పినట్టే సాంకేతికంగా ఇది కూడా చెల్లుతుంది కానీ నైతికంగా కాదు. ఏ పార్టీనుంచి ఎన్నికైన శాసనసభ్యులైనా తమ నియోజకవర్గాల అభివృద్ధి కోసమో, ఇతర పనుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రిని, మంత్రులను కలవడం అసహజమేం కాదు. అయితే వాళ్లు పార్టీ మారారు అనే విషయం అందరికీ తెలిసిందే.
కాంగ్రెస్ అధికారికంగా వాళ్లను చేర్చుకోలేదు అన్న విషయం కూడా తెలిసిందే. కెటిఆర్ ట్వీట్‌లో పెట్టిన ఫోటోలోని కండువాలు కప్పుకోవడం వ్యవహారం న్యాయ పరీక్షకు నిలబడదు. ఇప్పుడు ఈ వ్యవహారంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఈ పదిమంది శాసనసభ్యులు కూడా గతంలో పలువురు చేసినట్టు కాకుండా, అటువంటి వారిని ఆదర్శంగా తీసుకోకుండా తమ పదవులకు రాజీనామా చేసి మరొక్కసారి ప్రజల తీర్పు కోరితే బాగుండేది. ఈ మాట అంటున్నప్పుడు ఒక విషయం గుర్తు చేయాలి. 2023లో బిఆర్‌ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పటికి ఇంకా మంత్రివర్గం ప్రమాణ స్వీకారం జరిగిందో లేదో, ఆ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ తరఫున ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ ఘనపురంనుంచి గెలిచిన కడియం శ్రీహరి కాంగ్రెస్ ఎక్కువ కాలం అధికారంలో ఉండదు మళ్ళీ కెసిఆర్‌రే ముఖ్యమంత్రి అవుతారు అన్న విషయం గుర్తు చేసుకోవాలి. ఉద్యమ కాలంలో పార్టీ ఫిరాయిస్తే ప్రజలు చీరి చింతకు కడతారు అని కెసిఆర్ అన్న మాటల్ని అప్పట్లో కడియం శ్రీహరికి గుర్తుచేసిన విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన కాంగ్రెస్‌లో చేరిపోయారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ శాసనసభ స్థానానికి జరగబోతున్న ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలవడానికి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న దానం నాగేందర్ ఒకప్పుడు పార్టీ మారాలనుకుని తన శాసన సభ్యుడిగా గెలిపించడానికి బి ఫాం ఇచ్చిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యత్వానికి రాజీనామా చేసారు.
ఆ కారణంగా జరిగిన ఆసిఫ్‌నగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ మీద పోటీ చేసిన విషయం గుర్తు చేసుకోవాలి. ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయాడు అది వేరే విషయం. గెలుపు ఓటములతో సంబంధం లేకుండా ఇది నైతికత కిందికి వస్తుంది. ఇప్పుడు బిఆర్‌ఎస్‌నుంచి ఫిరాయించిన పదిమందిలో దానం నాగేందర్ కూడా ఒకరు. అప్పటి తన నిర్ణయం ఆయనకు గుర్తు చేద్దాం. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ రాష్ట్రంలో ఘర్ వాపసీ అంటున్నదని దానికి స్పందించి మరి కొందరు బిఆర్‌ఎస్ శాసనసభ్యులు కాంగ్రెస్ వైపు చూస్తున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత అధికార పక్షం కూడా మూడింట రెండొంతులు ఫార్ములాను అమలు చేస్తుందేమో చూడాలి. ఆ రూపంలో బిఆర్‌ఎస్‌కు మరో ప్రమాదం పొంచి ఉందా? ఏదిఏమైనా రాజకీయాల్లో నైతిక విలువలను కాపాడాలన్న చిత్తశుద్ధి ఉంటే పార్టీలన్నీ పార్లమెంట్‌లో ఒకే ఒక్క వాక్య సవరణ చెయ్యాలి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి. “పార్టీ మారిన మరుక్షణం పదవి పోతుంది.”