Sunday, August 31, 2025

సచివాలయం వద్ద బిఆర్‌ఎస్ మెరుపు ధర్నా

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : యూరియా కొరత తక్షణమే తీర్చాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు సచివాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. ప్రధాన గేటు వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు సరిపడా యూరియాను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం కెటిఆర్, హరీష్‌రావు నేతృత్వంలోని బిఆర్‌ఎస్ ప్రజాప్రతినిధులు అసెంబ్లీ నుంచి వ్యవసాయ కమిషన్ వద్దకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ర్యాలీగా వెళ్లారు. కమిషనర్‌కు వినతిపత్రం ఇచ్చి కమిషనర్ కార్యాలయం ఎదుట వారు ధర్నాకు దిగారు. అక్కడ పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని తరలించారు.

ఈ క్రమంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఉన్న పోలీసు వ్యాన్ సచివాలయం వద్దకు చేరగానే తమకు వాంతులు వస్తున్నాయని, వ్యాన్ ఆపాలని బిఆర్‌ఎస్ నాయకులు పోలీసులపై ఒత్తిడి తెచ్చారు. అయినా వాహనం ఆపకుండా వెళుతుండడంతో వారు బలవంతంగా వ్యాన్ నుంచి దిగడానికి ప్రయత్నించడంతోపాటు విధిలేని పరిస్థితిలో పోలీసులు వాహనాన్ని నిలిపివేశారు. దీంతో వ్యాన్ ఆపగానే కెటిఆర్, హరీష్‌రావు సహా బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు అందులో నుంచి దిగి పరుగెత్తుకుంటూ వెళుతూ సచివాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగారు. పోలీసులు అక్కడికి కూడా చేరుకుని వారిని అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు.

కాగా, పోలీసులు అదుపులో ఉన్న బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ఏ విధంగా తప్పించుకుని సచివాలయం వద్ద ధర్నాకు దిగారని సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ ఘటనపై నగర పోలీసు కమిషనర్ సి.వి.ఆనంద్‌ను నివేదిక ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, అంతకుముందు యూరియా కొరత తక్షణమే తీర్చాలని డిమాండ్ చేస్తూ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు సచివాలయం ప్రధాన గేటు వద్ద బైఠాయించారు. మాజీ మంత్రి హరీష్‌రావు నేతృత్వంలో ఇనుప కంచెలను, పోలీసు ఆంక్షలను లెక్క చేయకుండా సచివాలయం ప్రధాన గేటు వద్దకు చేరుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కెటిఆర్, ఇతర బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలు ర్యాలీగా అక్కడికి చేరుకుని యూరియా కొరత తీర్చాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News