Thursday, July 17, 2025

కవితకు బిఆర్ఎస్ షాక్..

- Advertisement -
- Advertisement -

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నుంచి ఎంఎల్‌సి కవితకు ఉద్వాసన
టిజిబిజికెఎస్ ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
తెలంగాణ భవన్‌లో కెటిఆర్‌తో సమావేశమైన సంఘం నేతలు
బిఆర్‌ఎస్‌కు అనుబంధంగానే కార్మిక సంఘం పనిచేయాలని నిర్ణయం
మనతెలంగాణ/హైదరాబాద్: బిఆర్‌ఎస్ అనుబంధ సింగరేణి కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టిజిబిజికెఎస్) నుంచి ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను తొలగిస్తూ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు టిజిబిజికెఎస్ వ్యవహారాల ఇంచార్జ్‌గా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు టిజిబిజికెఎస్‌ను కల్వకుంట్ల కవిత గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం కెటిఆర్‌తో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం బిఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా అనేక కార్యక్రమాలను చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ దిశగా సింగరేణి ప్రాంతంలో ఉన్న పార్టీ ఎంఎల్‌ఎలు, ఇంఛార్జీలు, మాజీ మంత్రులతో సమన్వయం చేసుకోవాలని కెటిఆర్ దిశానిర్ధేశం చేశారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కోసం పార్టీ తరఫున ఇంచార్జ్‌గా ఇకపై బొగ్గు గని కార్మిక సంఘం వ్యవస్థాపక సభ్యులు, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ వ్యవహరిస్తారని ప్రకటించారు. కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కార్యకలాపాలను పార్టీ తరఫున ముందుకు తీసుకుపోవాలని, సింగరేణి సమస్యలపై మరింత పెద్దఎత్తున పోరాటం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు. సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేదాకా ప్రభుత్వంపై ప్రజాక్షేత్రంతో పాటు అనేక ఇతర రూపాల్లో ఒత్తిడి తీసుకురావాలని దిశానిర్ధేశం చేవారు. పది సంవత్సరాల బిఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో సింగరేణి కార్మికుల కోసం, సింగరేణి సంస్థ కోసం చేసిన అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా కార్మికుల్లోకి తీసుకుపోవాలని కెటిఆర్ సూచించారు.

పది సంవత్సరాల కాలంలో సింగరేణితో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో కెసిఆర్ పనిచేశారని తెలిపారు. కేవలం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవడం మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణలను బిఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకించిందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలకు అడ్డగోలుగా అమలు చేయడానికి వీలుకాని హామీలు ఇచ్చిన తీరుగానే సింగరేణికి కూడా మోసం చేసిందని, ఈ అంశాలను కార్మికుల దృష్టికి తీసుకుపోవాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.

సింగరేణి గనుల ప్రైవేటీకరణ కోసం బిజెపితో కలిసి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై గళమెత్తాలని తెలిపారు. బొగ్గు గని కార్మిక సంఘానికి పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు సహకారం అందిస్తుందని వెల్లడించారు. కార్మికులకు ఎలాంటి కష్టం వచ్చినా అండగా నిలబడుతుందని భరోసా ఇచ్చారు. కార్మికుల కోసం పార్టీ లీగల్ సెల్ కూడా పూర్తిస్థాయి అండగా ఉంటుందని, ఏ కార్మికునికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేసినా… చట్టబద్ధంగా ఎదుర్కొనేందుకు పార్టీ లీగల్ సెల్ సహకారం అందిస్తుందని తెలిపారు. త్వరలోనే సింగరేణి ప్రాంతంలో బొగ్గు గని కార్మిక సంఘం ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం ఉంటుందని కెటిఆర్ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News