సొంత కూతురును పార్టీ నుంచి సస్పెండ్ చేసిన కెసిఆర్ కొంతకాలంగా
పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని కవితపై ఆరోపణలు హరీశ్‌ను
అవినీతి అనకొండ అంటూ వ్యాఖ్యానించిన బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి
పార్టీలో పెను ప్రకంపనలు సృష్టించిన కవిత వ్యాఖ్యలు
ఫాంహౌస్‌లో సీనియర్ నేతలతో కెసిఆర్ వరుస భేటీలు
కీలక నిర్ణయం తీసుకున్న గులాబీ పార్టీ..
నేడు ఎంఎల్‌సి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి
రాజీనామా చేయనున్న కవిత? భగ్గుమన్న జాగృతి
శ్రేణులు, ధర్నాలు కవితను కాంగ్రెస్‌లో చేర్చుకోం :
పిసిసి చీఫ్ మహేశ్‌గౌడ్ అవినీతిపరులకు బిజెపిలో
చోటు లేదు : ఎంపి లక్ష్మణ్ బిఆర్‌ఎస్
కార్యాలయాల్లో కవిత పోస్టర్లు తొలగింపు’
మనతెలంగాణ/హైదరాబాద్ : భారత రాష్ట్ర సమితి(బిఆర్‌ఎస్) సంచలన నిర్ణయం తీసుకుంది. పార్టీ అధినేత, మాజీ సిఎం కెసిఆర్ కుమార్తె, ఎంఎల్‌సి కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలను తీవ్రంగా పరిగణిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు బిఆర్‌ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శులు సోమ భరత్‌కుమార్, టి.రవీందర్‌రావు పేరిట ఒక ప్రకటన విడుదల చేసింది. “ఇటీవలి కాలంలో పార్టీ ఎంఎల్‌సి కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బిఆర్‌ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నందున పార్టీ అధిష్ఠానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు, కె.కవితను తక్షణం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు” అని భారత రాష్ట్ర సమితి ప్రకటనలో పేర్కొంది.
కవిత ప్రస్తుతం నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎంఎల్‌సిగా ఉన్నారు. కొంతకాలంగా భారత రాష్ట్ర సమితితో విభేదిస్తున్న కవిత.. ఎక్కువగా తెలంగాణ జాగృతి తరఫున నిర్వహించే కార్యక్రమాలకే పరిమితమయ్యారు. కెసిఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని.. తనపై కొందరు కుట్రలకు పాల్పడుతున్నారని ఇటీవల ఆరోపించారు. గతంలో పరోక్ష విమర్శలు చేసిన కవిత.. సోమవారం అమెరికా నుంచి రాగానే నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్‌కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. కెసిఆర్‌పై సిబిఐ విచారణ వరకు పరిస్థితి వచ్చాక.. పార్టీ ఉంటే ఎంత..? లేకపోతే ఎంత..? అని కవిత వ్యాఖ్యానించారు. బిసి రిజర్వేషన్ల విషయంలో పార్టీ విధానంతో ఆAమె విభేదించారు. ఈ పరిణామాల నేపథ్యంలో కవితను పార్టీ సస్పెండ్ చేసింది.
నేడు ఎంఎల్‌సి పదవిపై, పార్టీ
ప్రాథమిక సభ్యత్వంపై ప్రకటన
శాసనమండలి సభ్యత్వాన్ని వదులుకునే యోచనలో కల్వకుంట్ల కవిత ఉన్నట్లు తెలుస్తోంది. తన శాసనమండలి సభ్యత్వంపై కవిత బుధవారం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. నిజామాబాద్ స్థానిక సంస్థల కోటాలో బిఆర్‌ఎస్ తరపున 2020లో కవిత ఎంఎల్‌సిగా ఎన్నికయ్యారు. ఆమె పదవీకాలం 2028 వరకు ఉంది. కానీ, పార్టీ నుంచి ఆమెను సస్పెండ్ చేసిన నేపథ్యంలో కవిత ఎంఎల్‌సి పదవి నుంచి స్వఛ్చందంగా తప్పుకోనున్నట్లు తెలుస్తోంది.
2016లో తెలంగాణ
జాగృతికి అంకురార్పణ
తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడం, స్వాభిమానాన్ని చాటడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి సంస్థను 2006లో కవిత ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఈ సంస్థను నెలకొల్పారు. దశాబ్దంపాటు తెలంగాణతోపాటు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఉమ్మడిరాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసేందుకు కృషి చేశారు. భారత్ సౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ రాష్ట్ర చీఫ్ కమిషనర్‌గా 2015లో కవిత తొలిసారి ఎన్నికయ్యారు. దేశంలోనే ఈ హోదా పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా, యావత్ భారత్‌లోనే రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్ 2న రెండోసారి ప్రధాన కమిషనర్‌గా ఎన్నికయ్యారు. కవిత 2014లో నిజామాబాద్ నుంచి అప్పటి టిఆర్‌ఎస్ ఎంపిగా గెలిచి, పార్లమెంట్‌లో ఎస్టిమేట్స్ కమిటీ, వాణిజ్యంపై స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీల్లో సభ్యురాలిగా పని చేశారు.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్‌పై ఓడిపోయారు. అనంతరం 2020 అక్టోబర్‌లో జరిగిన శాసనమండలి ఎన్నికల్లో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల స్థానిక సంస్థల ఎంఎల్‌సి ఉపఎన్నికలో ఎంఎల్‌సి గెలిచారు.
కవిత సస్పెన్షన్‌ను
స్వాగతించిన బిఆర్‌ఎస్ నేతలు
ఎంఎల్‌సి కవితను బిఆర్‌ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఆమె ఫ్లెక్సీలను, కటౌట్‌లను, బ్యానర్లను పార్టీ శ్రేణులు తొలగిస్తున్నాయి. కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ఆ పార్టీలోని సీనియర్ నేతలు స్వాగతించారు.
కుటుంబ కలహాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు : పల్లా
కన్నబిడ్డ కంటే పార్టీ శ్రేయస్సే ముఖ్యమని కెసిఆర్ తెలియజేశారని బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి పల్లా రాజేశ్వర్ రెడ్డి తెలిపారు. కవిత సస్పెన్షన్‌పై ఎంఎల్‌ఎ పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పందించారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే కవితపై చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. పా ర్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకే కవితపై చర్యలు తీసుకున్నారని అన్నారు. కవిత కాం గ్రెస్ ఉచ్చులో పడి ఆ పార్టీ చెప్పినట్లు కవిత నడుచుకుంటున్నారని ఆరోపించారు. ప్రాంతీయపార్టీల్లో కుటుంబ కలహాలు సృష్టించడం కాంగ్రెస్‌కు అలవాటు అని మండిపడ్డారు.
కవిత ఉంటే ఏంటి..?
లేకపోతే ఏంటి..? : సత్యవతి రాథోడ్
పేగు బంధం కన్నా తనను నమ్ముకున్న కోట్లాది ప్రజలే ముఖ్యమని కెసిఆర్ నిరూపించారు మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ నాయకురాలు సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. మూడు నెలలుగా కవిత తన తీరుతో పార్టీకి ఎంతో నష్టం చేశారని ఆవేవన వ్యక్తం చేశారు. కవితను సస్పెండ్ చేస్తూ తీసుకున్న నిర్ణయం అందరినీ, ముఖ్యంగా మహిళలను సంతోష పరిచిందని చెప్పారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం బిఆర్‌ఎస్ మహిళా నేతలతో క లిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించా రు. లక్షలమంది అభిమానించే పార్టీ, కోట్ల మంది ఆదిరించి నిలబెట్టిన పార్టీని ఆమె ఉం టే ఎంత పోతే అనడం ఏంటంటూ కవితను ఈ సందర్భంగా ఆమె సూటిగా ప్రశ్నించారు. మరి నువ్వు ఉంటే ఏంటి..? లేకపోతే ఏం టి..? అంటూ కవితకు సత్యవతి రాథోడ్ చురకలంటించారు. కార్యకర్తల కన్నా కుటుంబ సభ్యులు ఎక్కువ కాదని కెసిఆర్ నిరూపించారని అన్నారు. పార్టీ తర్వాతే ఎవరైనా అని కెసిఆర్ సందేశం ఇచ్చారని అన్నారు.
కవిత తనకు తానే గొయ్యి
తీసుకుంది : గొంగిడి సునీత
ఎంఎల్‌సి కవిత తనకు తానే గొయ్యి తీసుకుందని బిఆర్‌ఎస్ నాయకురాలు, మాజీ ఎంఎల్‌ఎ గొంగిడి సునీత స్పష్టం చేశారు. కెసిఆర్ ను గౌరవించినట్లే కవితను సైతం తెలంగాణ సమాజం గౌరవించిందని గుర్తు చేశారు. బిఆర్‌ఎస్ ఉంది కాబట్టే కవితకు ఎంపీగా, ఎంఎల్‌సిగా పోటీ చేసేందుకు బిఫాం ఇచ్చారన్నా రు. అది మరిచి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కెసిఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం: మాలోతు కవిత
బిఆర్‌ఎస్ పార్టీలోని సీనియర్ నేతలు హరీష్ రావు, సంతోష్‌కుమార్‌లపై కవిత చేసిన వ్యాఖ్యలు తనను బాధించాయని మాజీ ఎంపి మాలోతు కవిత అన్నారు. బిఆర్‌ఎస్ పార్టీని నమ్ముకుని ఎంతో మంది ఉన్నారని, అలాంటి పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అంటే బాధేసిందని పేర్కొన్నారు.
పార్టీ కంటే ఎవరు పెద్ద కాదు : కె.పి.వివేకానంద
పార్టీకి నష్టం కలిగించే వ్యక్తి ఎవరినైనా ఉపేక్షించేది లేదని బిఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని బిఆర్‌ఎస్‌ఎల్ విప్ కె.పి.వివేకానంద స్వాగతించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటనలో విడుదల చేశారు. బిఆర్‌ఎస్ అంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఇంటి పార్టీ అని, 60 లక్షల మంది సైనికులు, నాయకులు, కార్యకర్తలు ఉన్న సైన్యం అని పేర్కొనారు. తప్పు చేస్తే కుటుంబ సభ్యులనైనా సహించేది లేదని కెసిఆర్ గతంలోనే చెప్పారని గుర్తు చేశారు.