బిఎసి నుంచి బిఆర్‌ఎస్ వాకౌట్
వరదలపై చర్చిద్దామంటే బురద రాజకీయాలు: హరీశ్‌రావు
పదిహేను రోజులైనా నిర్వహించాలని బిజెపి డిమాండ్
మన తెలంగాణ/హైదరాబాద్/ప్రత్యేక ప్రతినిధిః ఎంతో హుషారుగా ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు రెండో రోజే ముగియనున్నాయా? లేక మరో రోజు అంటే సోమవారం కూడా కొనసాగుతుందా? అనేది ఇదమిద్దంగా తేలలేదు. శనివారం తొలి రోజు అసెంబ్లీ వాయిదా పడిన తర్వాత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనభ వ్యవహారాల సలహా సంఘం (బిఎసి) సమావేశం జరిగింది. కాగా అసెంబ్లీ సమావేశాలను రెండు రోజులు నిర్వహించాలనుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. దీంతో బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి బిఎసి నుంచి వాకౌట్ చేశారు.
బిఎసి ప్రారంభంకాగానే ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క సమావేశాల అజెండా గురించి వివరిస్తూ ఆదివారం కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నివేదికను సభలో పెడతామని, అదే విధంగా బిసి రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ స్థానే బిల్లు ప్రవేశపెడతామని చెప్పారు. అందుకు బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు టి. హరీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి సమావేశాలను 30 రోజులు కొనసాగించకపోయినా, కనీసం 15 రోజులైనా నిర్వహించాలని బిఆర్‌ఎస్, బిజెపి నేతలు పట్టుబట్టారు. పైగా రెండో రోజు (ఆదివారం) ప్రాధాన్యత అంశాలైన వరదలపై, యూరియా కొరతపై చర్చించాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి పట్టుబట్టారు.
బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సభను కనీసం 15 రోజులైనా నిర్వహించాలని డిమాండ్ చేశారు. దీంతో సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహిస్తారన్న సందిగ్దం నెలకొంది. ఆదివారం సభ ప్రారంభంకాగానే బిసి రిజర్వేషన్ ఆర్డినెన్స్ స్థానే బిల్లు ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. అనంతరం కాళేశ్వరంపై జస్టిస్ పిసి ఘోష్ నివేదికపై చర్చను ప్రారంభిస్తుంది. అయితే నివేదికపై చర్చ జరుగుతున్న సమయంలో బిఆర్‌ఎస్ గొడవ చేసినట్లయితే స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేసే అవకాశం ఉందన్న అనుమానం ప్రతిపక్షాల సభ్యులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో సోమవారం వరదలు, యూరియాపై చర్చకు ఆస్కారం లేకుండా పోతుందన్న అనుమానం వారిలో ఉంది.
బ్రేక్ తర్వాత మళ్లీ ..
మిలాద్ ఉన్ నబీ, వినాయక నిమజ్జనం అనంతరం తిరిగి సమావేశాలను కొనసాగిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చెప్పినా వారు విశ్వసించడం లేదు. సమావేశాలను 15 రోజుల పాటు నిర్వహించాలని బిజెపి శాసనసభాపక్షం నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి బిఎసి సమావేశంలో డిమాండ్ చేశారు. 30 ప్రజా సమస్యలపై చర్చించాల్సి ఉందని ఆయన చెప్పారు.
స్పీకర్‌కు అక్బర్ లేఖ..
ఇదిలాఉండగా బిఎసి సమావేశానికి ముందే మజ్లీస్ పార్టీ శాసనసభాపక్షం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిసి అసెంబ్లీ సమావేశాలను కనీసం 15 రోజులైనా నిర్వహించాలని కోరుతూ లేఖ అందజేసి వెళ్ళిపోయారు. ఇతర పనులు ఉన్నందున బిఎసికి హాజరుకాలేనని అక్బర్ స్పీకర్‌కు చెప్పారు.