న్యూఢిల్లీ: భవనం కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాదకర సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది. నగరంలోని దర్యాగంజ్‌లో సత్భావన పార్క్, ఘాటా మసీదు, రింగ్ రోడ్ సమీపంలో ఉన్న ఓ భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మరణించారని.. చాలా మంది భవనం శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల క్రింద చిక్కుకున్న ముగ్గురిని బయటకు తీసుకొచ్చారు. వారికి స్వల్పంగా గాయాలు కావడంతో అత్యవసర చికిత్స కోసం ఎల్‌ఎన్‌జెపి ఆసుపత్రికి తరలించారు. ఇంకా చాలా మంది శిథిలాల క్రింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాలను తొలగించి.. బయటకు తీసుకొచ్చేందుకు సహాయక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తోంది. ఈ ప్రమాదంలో మరణించిన ముగ్గురు కార్మికులను జుబైర్, గుల్‌సాగర్, తౌఫిక్‌గా గుర్తించారు. ప్రస్తుతం సంఘటనాస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.