న్యూఢిల్లీ: ఉత్తర ఢిల్లీలోని ఆజాద్ మార్కెట్ సమీపంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బారా హిందూ రావు ప్రాంతంలోని పుల్ మిథాయ్‌లోని టోక్రి వాలన్‌లో ఉన్న ఓ భవనం కుప్ప కూలిపోయింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. కూలిపోయిన భవనంలో గ్రౌండ్ ఫ్లోర్‌లో మూడు దుకాణాలు.. మొదటి అంతస్తులో గోడౌన్లు ఉన్నాయి. పోలీసు నివేదికల ప్రకారం.. ఈ ఘటనకు సంబంధించిన ఫోన్ కాల్ అందుకున్న బారా హిందూ రావు పోలీసులు.. వెంటనే ఢిల్లీ అగ్నిమాపక దళం, జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం(NDRF), సెంట్రలైజ్డ్ యాక్సిడెంట్ అండ్ ట్రామా సర్వీసెస్(CATS) అంబులెన్స్, ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ(DDMA), క్రైమ్ బృందానికి వెంటనే సమాచారం అందించి.. సహాయక చర్యల కోసం సంఘటన స్థలానికి తరలించారు.
రెస్క్యూ బృందాలు శిథిలాల నుండి ఒక మృతదేహాన్ని బయటకు తీశారు. మృతు చెందిన వ్యక్తిని 45 సంవత్సరాల మనోజ్ శర్మగా గుర్తించారు. అతను గత 30 సంవత్సరాలుగా భవనంలోని ఓ దుకాణంలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇ ఘటనలో మరేవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కూలిపోయిన సమయంలో భవనం ముందు ఆపి ఉంచిన ట్రక్కు పూర్తిగా ధ్వంసమైంది. అయితే, సమీపంలో జరుగుతున్న మెట్రో నిర్మాణ పనుల కారణంగా ఈ ఘటన జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.