Wednesday, June 18, 2025

ముందు నన్నే కెప్టెన్ చేయాలనుకున్నారు.. కానీ: బుమ్రా

- Advertisement -
- Advertisement -

ఇంగ్లండ్ జట్టుతో జరగబోయే టెస్టు సిరీస్ కు బిసిసిఐ.. మొదట భారత సీనియర్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా ఎంపిక చేయాలనుకుందట.. కానీ ఆ ఆఫర్ ను తిరస్కరించినట్లు బుమ్రా చెప్పారు. అయితే, తాను ఎందుకు కెప్టెన్సీని తిరస్కరించానో..దానికి కారణాలు ఏంటో బుమ్రా వివరించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో బుమ్రా మాట్లాడుతూ.. బిసిసిఐ తనకు టీమిండియా టెస్టు కెప్టెన్ ఆఫర్ ఇచ్చిందని.. అయితే, దానికి తాను ఒప్పుకోలేదని స్పష్టం చేశారు. రోహిత్ శర్మ టెస్టు రిటైర్మెంట్ ప్రకటించకముందే.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ సందర్భంగా తనను BCCI సంప్రదించిందని తెలిపాడు. భారత టెస్టు జట్టుకు నాయకత్వం వహించాలని తనను కోరుకుందని బుమ్రా చెప్పాడు. తాను అన్ని టెస్ట్ మ్యాచ్‌లకు అందుబాటులో ఉండనని.. నాయకత్వ బాధ్యతలు చేపట్టడం తనకు సరైనది కాదని పేర్కొన్నాడు. వెన్ను గాయం గురించి కూడా BCCIతో చర్చించానని, ఆ తర్వాత కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడు.

“ఐపిఎల్ సమయంలో రోహిత్, విరాట్ రిటైర్ కావడానికి ముందు నేను BCCIతో మాట్లాడాను. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో పనిభారం గురించి నేను చర్చించాను. వెన్ను గాయం కారణంగా సర్జన్‌తో కూడా నేను మాట్లాడాను. పని భారంపై నేను ఎంత తెలివిగా ఉండాలో వారు ఎల్లప్పుడూ నాకు చెప్పారు. అప్పుడు కొంచెం తెలివిగా ఉండాలని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. BCCIకి ఫోన్ చేసి నన్ను కెప్టెన్ గా చూడవద్దని కోరుతున్నానని.. ఎందుకంటే నేను అన్ని టెస్ట్ మ్యాచ్‌లు ఆడలేనని చెప్పాను. ఐదు టెస్ట్‌ల సిరీస్ లో ఎవరైనా 3 టెస్ట్‌లకు నాయకత్వం వహించి తప్పుకుంటే.. మిగిలిన టెస్ట్‌లకు మరొకరు నాయకత్వం వహించాల్సి వస్తుంది. అది జట్టుకు న్యాయం కాదని వివరించా” అని కెప్టెన్సీ రేసు నుంచి తప్పుకోవాడానికి గల కారణాన్ని బుమ్రా చెప్పుకొచ్చాడు.

కాగా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత నాయకత్వ బాధ్యతలను ఎవరు చేపట్టవచ్చనే దానిపై పలు సందేహాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో స్టార్ క్రికెటర్లు శుభ్ మన్ గిల్, రిషబ్ పంత్, జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ రేసులో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. చివరకు జట్టు యాజమాన్యం, సెలక్షన్ కమిటీ గిల్‌ను టెస్టు కెప్టెన్ గా ప్రకటించింది. జూన్ 20 నుండి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ కు గిల్ నాయకత్వం వహించనున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News