Saturday, September 6, 2025

చిన్న దేశం.. గొప్ప సందేశం

- Advertisement -
- Advertisement -

‘మీ దేశంలో మా నిధులతో 400 మసీదులు నిర్మిస్తాం. ఇది మేము ఎంతో ఉదారతతో చేస్తున్నాం. దీనికి మీ అంగీకారం కావాలి’ ఇది సౌదీ అరేబియా ప్రధాని మహ్మద్ బిన్ సాపోన్, పశ్చిమ ఆఫ్రికాలోని బుర్కిన ఫాసో దేశాధ్యక్షుడు ఇబ్రహీం ట్రవొరేకు సందేశం పంపారు. సాధారణంగా, పేద దేశాలకు చెందిన దేశాధినేతలెవరైనా అత్యంత ధనిక దేశమైన సౌదీ అరేబియా మాటలను శిరోధార్యంగా భావిస్తారు. అంతేకాకుండా, మరి కొంత సహాయాన్ని అర్థిస్తారు. కానీ ట్రవొరే మాత్రం అందరి అంచనాలకు విరుద్ధంగా జవాబిచ్చారు. “మా దేశంలో ఇప్పుడు మసీదులు, ప్రార్థనా స్థలాలు కాదు కావాల్సింది. ఎటువంటి నిర్మాణాలు లేకుండా, ఆకాశం కింద ఎక్కడైనా ప్రార్థనలు చేయగలం. పాలస్తీనాలో వేలాది మంది నిరాశ్రయులు, ప్రత్యేకించి పిల్లలు ఎటువంటి సహాయం అందకుండా దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారు.

వారికి సాయం చేయండి మాకు ఎవరి ధాతృత్వం అక్కర లేదు. ఈ రోజు మా దేశానికి పాఠశాలలు, వైద్యశాలలు, పరిశ్రమలు, రహదారులు, ప్రాజెక్టులు కావాలి. నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరగాలి” అంటూ ఘాటైన సమాధానమిచ్చారు. ఇది ప్రపంచంలోని అనేక మంది పరిశీలకులను ఆశ్చర్యపరిచింది. బుర్కిన ఫాసో ఆఫ్రికాలోని ఒక చిన్నదేశం. గత ఎన్నో ఏళ్లుగా ఫ్రెంచి వలస పాలనలో మగ్గిన దేశం. 1960 ప్రాంతంలో ఫ్రెంచి పాలకులు ప్రత్యక్షంగా దేశాన్ని వదిలిపెట్టినప్పటికీ, పరోక్షంగా ఫ్రెంచి వ్యాపారస్థులు, పెట్టుబడిదారులు బుర్కిన ఫాసోను పీల్చిపిప్పి చేస్తూనే ఉన్నారు. అయితే 2022 నుంచి ఆ దేశం నడక మారింది. ఇప్పటి దాకా ఆకలి, అవమానం, అనారోగ్యం, నిరుద్యోగాలతో విలవిలలాడిపోయిన బుర్కిన ఫాసో వాటన్నింటికీ చరమ గీతం పాడాలనుకుంది. అదే ఇబ్రహీం ట్రవొరే నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బుర్కిన ఫాసో చరిత్రను తిరగ రాయబోతున్నది.

“ప్రపంచంలోనే అత్యధిక బంగారు నిల్వలు కలిగిన ఆఫ్రికా ఖండం, ప్రత్యేకించి బుర్కిన ఫాసో ఎందుకు పేదరికంతో ఉంది? ఇక్కడ ఆకలితో ప్రారంభమైన జీవితాలు అనారోగ్యం పాలవడం మాత్రమే కాకుండా, హింస, దాడులు, చావులు ఎందుకు దర్శనమిస్తున్నాయి? దీనికి కారణం మా వనరులను ఇతరులు ప్రత్యేకించి వలసవాదాలు దోచుకుపోవడమే దీనికి కారణం” అంటూ ఇబ్రహీం ట్రవొరే తన తిరుగుబాటు జెండాను ఎత్తారు. ఇబ్రహీం ట్రవొరే 36 సంవత్సరాల యువకుడు. మార్చి 14, 1988న ఇబ్రహీం ట్రవొరే బుర్కిన ఫాసోలోని మౌహాన్ ప్రాంతంలోని కెరలో జన్మించారు. ప్రాథమిక విద్యాభాస్యాన్ని తన సొంత ప్రాంతంలో ముగించుకొని దేశ రాజధాని ఒగడొగవ్‌లో డిగ్రీ పూర్తి చేశారు. ఆయన విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్న సమయంలో అసోసియేషన్ ముస్లిం స్టూడెంట్స్, మార్కిస్టు నేషనల్ అసోసియేషన్ స్టూడెంట్స్ సంస్థలతో కలిసి పని చేశారు. ఆ తర్వాత 2009 సంవత్సరంలో బుర్కిన ఫాసో సైన్యంలో చేరారు.

అప్పటి నుంచి 2020 వరకు వివిధ హోదాల్లో సైన్యంలో పని చేశారు. ఆ సంవత్సరమే ఆయన కెప్టెన్‌గా పదోన్నత పొందారు. అయితే 2009 సంవత్సరం నుంచి సైన్యంలో చేరినప్పటి నుంచి ఇబ్రహీం దేశంలోని రాజకీయ నాయకుల, వలస కంపెనీల దోపిడీ భాగస్వామ్యాన్ని అర్థం చేసుకున్నారు. ఈ రెండు వర్గాలు దేశ సంపదను దోచుకుపోతున్నారని, దాని వల్లనే ఈ దారిద్య్రం దాపురించిందని బలంగా అభిప్రాయపడ్డారు. ఆ ప్రేరణతోనే 2022 అక్టోబర్‌లో తన నాయకత్వంలోని సైన్యంతో తిరుగుబాటు చేసి ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఆ దేశంలో కొత్తేమీ కాదు. గతంలో కూడా 1963లో సెంకర అనే స్వతంత్ర స్వభావం కలిగిన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని కొంత మంది కలిసి కూలదోశారు. దానికి ఫ్రాన్స్‌తో సహా అమెరికా ఇతర దేశాలు పరోక్ష మద్దతు ఉన్నది.

సెంకర అనే బుర్కిన ఫాసో నాయకుడు ఆ దేశాన్ని స్వేచ్ఛగా ఇతరుల జోక్యం లేకుండా పాలన సాగించాలని ప్రయత్నించారు. కానీ ఆయనను అతి తొందరలోనే కూలదోసి మళ్లీ వలస పాలకుల తొత్తులతో ప్రభుత్వాలను నడిపారు. అయితే ఇబ్రహీం ట్రవొరే మళ్లీ తాను సెంకర స్ఫూర్తితో పాలన సాగించాలనుకుంటున్నానని, తనకు సెంకర సిద్ధాంతాలు, ఆశయాలు మార్గదర్శకమని ప్రకటించారు. అయితే సెంకర లాంటి ఆఫ్రికా జాతీయవాదులకు, ఇబ్రహీం ట్రవొరేకు చాలా తేడా ఉన్నది. ఇబ్రహీం ట్రవొరే కేవలం సైన్యంతో పాలన సాగించాలనుకోవడం లేదు. ఆయన అధ్యక్ష పదవి చేపట్టిన వెంటన చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యమైన స్వయం సమృద్ధి. స్వేచ్ఛపాలన ఇప్పటి వరకు తమ బంగారు నిల్వలన దోచుకునిపోయి, తమకు దారిద్య్రాన్ని మిగుల్చుతున్న కంపెనీలను పూర్తిగా వెనక్కు పంపారు. అంటే బంగారు గనులతోపాటు అనేక గనులను జాతీయం చేశారు.

ఇప్పటి వరకు బంగారు ముడి పదార్థాన్ని ఇక్కడి నుంచి తరలించుకొని పోయి ఫ్రాన్స్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు తమ తమ ప్రాంతాల్లో దానిని శుద్ధిచేసి తామే బంగారు నిల్వలు గల దేశాలుగా చెలామణి అవుతున్నాయి. ఇంకొక్క ముఖ్య విషయమేమంటే ప్రపంచంలో ఉన్న బంగారు నిల్వలలో 40 శాతం కేవలం ఆఫ్రికా ఖండంలోనే ఉన్నాయి. అందులో సహెలి ప్రాంతంలోనే అత్యధిక నిల్వలున్నాయి. సహెలి అంటే బుర్కిన ఫాసో, నైజర్, మాలి, చాడ్‌లలో కూడిన ప్రాంతం. బుర్కిన ఫాసోలో 6.5 మిలియన్ మెట్రిక్ బంగారు నిల్వలున్నాయి. అందుకే ఇబ్రహీం ట్రవొరే తమ దేశానికి ఎవరి సహాయం అక్కర లేదని ప్రకటించారు. ఆయన మొదటి చర్యగా బంగారాన్ని శుద్ధి చేసే కర్మాగారాన్ని బుర్కిన ఫాసోలో ఏర్పాటు చేశారు. దానితో తమ బంగారాన్ని తామే వెలికి తీసి తామే దానిని శుద్ధి చేసి తామే అమ్ముతామని ప్రకటించారు.

ఇది బుర్కిన ఫాసో జీవనాడి. ఒక్క కలం పోటుతో ఇతర దేశాల కంపెనీలను సరిహద్దులు దాటించారు. ఇది చాలా కీలకమైనది.రెండో చర్యగా మార్చి 11, 2025 న ఒక పెద్ద వ్యవసాయక పథకానికి శ్రీకారం చుట్టారు. 1200 వందల కిలోమీటర్ల దూరం పంట కాలువను తవ్వాలని నిర్ణయించుకున్నారు. దానికి కావాల్సిన నిధులను ఇప్పటికే కేటాయించారు. దీనికి ఎటువంటి నది లేదు. బుర్కిన ఫాసోలో వ్యవసాయం పూర్తిగా వర్షాభావమే. ఎటువంటి నీటి వనరులు లేవు. దానితో 80 శాతంగా ఉన్న వ్యవసాయ జనాభా పూర్తిగా వాననీటి మీదనే ఆధారపడి జీవిస్తున్నారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఇబ్రహీం ట్రవొరే ఒక నూతన ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ఇది వినూత్న ప్రయోగం. నదులకు ఆనకట్ట కట్టి నీటిని కాలువల ద్వారా పారించడం లేదు. పర్వతాల నుంచి వచ్చే వర్షం నీటిని ఒక దగ్గర చేర్చి ఈ కాలువలను తవ్వుతున్నారు.

ఎండా కాలం నీరు ఆవిరై పోకుండా కాలువ మీద చెట్లను పెంచుతున్నారు. వర్షం ద్వారా భూమి మీదికి వచ్చే ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి నిల్వ చేయాలనేది ట్రవొరే పథకం. దానికి 500 మిలియన్ డాలర్ల వ్యయాన్ని అంచనా వేస్తున్నారు. దీనిని కొన్ని నెలల్లోనే పూర్తి చేయాలని నిర్ణయించారు. దేశంలోని ప్రజలందరూ దానిలో పాల్గొంటారని, ఇది యుద్ధం కన్నా గొప్పదని, దేశ భవిష్యత్‌ను మార్చగలదని ట్రవొరే అభిప్రాయం. అదే విధంగా ప్రజల మౌలిక అవసరాలైన విద్య, వైద్యం, రోడ్లు ఆయన ప్రాథమిక లక్ష్యాలుగా ఉన్నాయి. ఇది కేవలం బుర్కిన ఫాసోను కాదు, మొత్తం ఆఫ్రికా ఖండాన్ని ఇబ్రహీం ట్రవొరే ప్రభావితం చేశారు. అది తక్కువ కాలంలోనే ట్రవొరే దేశ ప్రజలకు ఒక ఆరాధ్య నాయకుడయ్యారు.

అయితే అదే సమయంలో అమెరికాతో సహా ఐఎంఎఫ్‌లో సభ్యులుగా ఉన్న దేశాలన్నీ బుర్కిన ఫాసో మీద ఆర్థిక ఆంక్షల యుద్ధం ప్రకటించాయి. 378 మిలియన్ డాలర్ల అప్పును చెల్లించాలని, లేనట్లయితే తదనంతర చర్యలకు బాధ్యులు కావాల్సి ఉంటుందని హెచ్చరికలు వచ్చాయి దానితో అప్రమత్తమైన ట్రవొరే ఈ అప్పు ఎప్పుడు ఇచ్చారు? ఎవరెవరు దీనిని సొంతం చేసుకున్నారు అనే వివరాలను సేకరించి గత ప్రభుత్వంలో ఉన్న మంత్రులను, అధికారులను అరెస్టు చేసి ఆ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకున్నారు. ఐఎంఎఫ్‌లతో సహా ఏ విదేశీ సంస్థ ఈ గడ్డ మీద అడుగు పెట్టడానికి వీలు లేదని ఇబ్రహీం ట్రవొరే తెల్చి చెప్పారు.

Also Read :  భారత్, రష్యాలను కోల్పోయాం

  • మల్లేపల్లి లక్ష్మయ్య (దర్పణం)
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News