బీహార్ రాజధాని పట్నాలో ప్రముఖ బిజినెస్ మన్ గోపాల్ ఖేమ్కాను ఆయన ఇంటి వద్దనే మోటర్ సైకిల్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కాల్చి చంపారు. ఏడేళ్ల క్రితం ఆయన కుమారుడు కూడా హాజీపూర్ లో దుండగుల కాల్పుల్లో మరణించారు. గాంధీ మైదాన్ ప్రాంతంలోని తన ఇంటి వద్ద ఆయన కారు దిగుతుండగా శుక్రవారం రాత్రి 11.40 నిముషాల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. ముఖ్యమంత్రి నితిశ్ కుమార్ వెంటనే స్పందించారు. శనివారం నాడు రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థతిని సమీక్షించారు. ఖేమ్కా హత్యపై వీలైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని, దుండగులను పట్టుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. హత్య జరిగిన వార్త తెలిసిన వెంటనే స్థానిక పోలీసు అధికారులు, పెట్రోలింగ్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, అక్కడి పరిస్థితి సమీక్షించారని, నేరం జరిగిన స్థలాన్ని అదుపులోకి తీసుకున్నారని పట్నా సెంట్రల్ ఎస్పీ దీక్ష తెలిపారు.
దర్యాప్తు జరుగుతోందని, ఫెరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారని, అలాగే, సిసిటివి ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారని ఆమె తెలిపారు. సంఘటనా స్థలంలో ఒక బులెట్, ఒక కార్ట్రిడ్జ్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
గుర్తు తెలియని బైక్ పై వచ్చిన దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని వివరించారు.
ఎన్డీఏ ప్రభుత్వం శాంతి భద్రతలకు, చట్టబద్ధమైన పాలనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని సీఎం కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దర్యాప్తులో ఎలాంటి నిర్లక్ష్యం చూపినా పోలీసు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాగా, హత్య జరిగిన రెండు గంటలతర్వాత పోలీసు సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారని ఖేమ్కా బంధువులు, కుటుంబసభ్యులు ఆరోపించారు. ఈ ఆరోపణలను బీహార్ డిజీపీ విజయ్ కుమార్ ఖండించారు. పోలీసులు యాక్షన్ లో ఎలాంటి జాప్యం జరగలేదని, రాత్రి 12.30 గంటల ప్రాంతంలో పోలీసులకు సమాచారం అందిందని, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నామని డిజిపి తెలిపారు.
శుక్రవారం రాత్రి 11.40 గంటలకు కాల్పులు జరిగిన వెంటనే, ఆయన కుటుంబసభ్యులు ఖేమ్కా ను దగ్గరలోని ఓక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లారని, తర్వాత పోలీసులకు సమాచారం అందించారని వివరించారు.2018 లో ఖేమ్కా కుమారుడు హాజీపూర్ లో హత్యకు గురయ్యాడు.ఆ తర్వాత గోపాల్ ఖేమ్కాకు చెల్లింపు ప్రాతిపదికన భద్రత ఏర్పాటు చేశారు. 2024లో సెక్యురిటీ ఉపసంహరించుకున్నారు. ఆ తర్వాత కూడా ఎన్నడూ గోపాల్ ఖేమ్కా భద్రతకోసం అడగలేదని పోలీసు అధికారి తెలిపారు. శుక్రవారం నాడు ఖేమ్కా హత్య తర్వాత ఆయన కొడుకు, డాక్టర్ అయిన ఆయన రెండో కొడుకుకు భద్రత కల్పించారు.ఈ హత్యను బీహార్ అసెంబ్లీలో ప్రతిపక్షనాయకుడు తేజశ్వి యాదవ్ ఖండించారు. గోపాల్ ఖేమ్కా ఇంటికి కొద్ది దూరంలోనే పట్నాపోలీసు స్టేషన్ ఉందని , ప్రతినెలా ఎందరో వ్యాపారవేత్తలు హత్యకు గురవుతున్నారని ఆరోపించారు. కాగా, ఈ ఘటన బీహార్ లో శాంతి భద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని కాంగ్రెస్ ప్రతినిధి విమర్శించారు.