మనతెలంగాణ సిటీ బ్యూరో ః గ్రేటర్ హైదరాబాద్‌లో కేబుల్ వైర్లను కట్ చేస్తుంటే.. ప్రభుత్వ విభాగాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో ఇటు ప్రభుత్వ అధికారులు, అటు ప్రైవేట్ బహుళ జాతి కంపనీల ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. కేబుల్ తీగలు.. ప్రజల పాలిట యమపాశాలుగా మారినాయంటూ విద్యుత్ విభాగం నగరంలోని విద్యుత్ స్తంభాలకు వేలాడుతున్న కేబుల్ వైర్లపై చర్యలు తీసుకుంటుంది. అధికారికంగా అనుమతులు ఉన్న కేబుల్ వైర్లను వదిలేసి.. అధికారిక అనుమతులు లేని కేబుల్ వైర్లను విద్యుత్ అధికారులు కట్ చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, కేబుల్ వైర్లను కట్ చేస్తుండటంతో ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయనేది ప్రధాన విమర్శగా మారింది. మరో వైపు ఇండ్లలో మహిళలకు, వర్క్‌ఫ్రం హోం చేసే ప్రైవేట్ ఉద్యోగులకు, కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయి. ఫలితంగా సాంకేతిక వ్యవస్థతో పనిచేసే వారి విధులు, వినోదాలు పూర్తిగా ఆటంకం ఏర్పడుతుంది.
ప్రభుత్వ కార్యాలయాల్లోనూ..
కేబుల్ వైర్లు కట్ చేయడంతో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయి. దీంతో ఆయా కార్యాలయాల్లో ఇటు ప్రజలకు అందించే సేవల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్ళ కారెస్పాండెన్స్ చేయడం, బట్వాడా చేయం గగనంగా మారుతోందనేది పలువురు ప్రభుత్వ ఉద్యోగులు అసహనం వ్యక్తంచేస్తున్నారు. ఈఆఫీసులో పనిచేసే వారికి నెట్ సౌకర్యం తప్పనిసరి.. ఆర్‌టిఏ లాంటి సంస్థల్లోనూ సర్వర్లు పూర్తిగా డౌన్ అవుతూ.. చేసే పనులు నిలిచిపోయి.. విధులు వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ఆన్‌లైన్‌లో సేవలు, ఫిర్యాదులు, రిమార్క్ వంటివి వేగంగా జరిగేందుకు కారవాల్సిన నెట్ లేకపోవడంతో వీరి విధులన్నీ ఇంటికే పరిమితమవుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.ఆన్‌లైన్‌లో సేవలందించే పలు సంస్థలు కూడా కేబుల్స్ వైర్లను కట్‌చేస్తే చాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ సంస్థల్లో వాహనాలు కొనుగోలు, సూపర్ మార్కెట్లో, మల్టీలేవల్ కాంప్లెక్స్‌లలోనూ నెట్ సేవలు కరువయ్యాయి. దీంతో వారంతా విద్యుత్ అధికారుల చర్యలపై అసహనం వ్యక్తంచేస్తున్నారు.
సీరియల్స్ లేక..
ఇండ్లలో ఉండే గృహిణులు నిత్యం టీవీలల్లో వరుసగా ప్రసారమయ్యే సీరియళ్ళను, వెబ్ సిరీస్‌లను చూసే వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్టు పలువురు మహిళలు వెల్లడిస్తున్నారు. కేబుల్ వైర్లు కట్ చేయడంతో ఇంటర్నెట్ నిలిచిపోతుంది. దీంతో టీవీలల్లో, ఓటిటిల్లో ప్రసారాలు నిలిచిపోతున్నాయి. గృహిణిలు.. ఎలా అంటూ.. నెట్ ఉన్న ఇండ్లలోకి వెళ్ళి తమతమ సీరియళ్ళను చూస్తూ.. హమ్మయ్య ఆంటూ ఊపిరి పీల్చుకుంటున్నారు. వర్క్ ఫ్రం హోం విధానంలో ఉద్యోగాలు చేస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నెట్‌లేక తమతమ విధులను నిర్వర్తించలేక పోతున్నట్టు పలువురు ఇంజనీర్లు అసహనం వ్యక్తంచేస్తున్నారు. పలు దరఖాస్తులు, సర్టిఫికేట్లు వంటివి కంప్యూటర్ ద్వారా చేసే ప్రక్రియలేక వారు ఇతర ప్రాంతాల్లోకి వెళ్ళి నెట్ ఉన్న చోట విధులను నిర్వర్తించే పరిస్థితి నెలకొనడంపై సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. పిల్లలు కూడా ఇంటర్నెట్ లేక వీడియోగేమ్స్ లేక సతమతమవుతున్నట్టు వారి మిత్రులు వెల్లడిస్తున్నారు.