భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు శనివారం భారీ ఎత్తున గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు, సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా సంయుక్తంగా భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముత్యాలంపాడు క్రాస్‌రోడ్ సమీపంలో ఉన్న ఎసిఎ సులానగర్ మినిస్ట్రీ చర్చి వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్కార్ట్‌గా వస్తున్న కారుతోపాటు వ్యాన్‌ను ఆపి తనిఖీ చేశారు. అందులో 698 కిలోల నిషేధిత గంజాయిని గుర్తించారు. దీని మొత్తం విలువ సుమారుగా రూ.3 కోట్ల 49 లక్షలు విలువ ఉంటుందని అంచనా వేశారు. వ్యాన్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులను, కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. ఈ గంజాయిని అమ్మిన వ్యక్తులపైన, కొనుగోలు చేసిన వ్యక్తులు, రవాణా చేస్తున్న వ్యక్తులందరిపై కేసు నమోదు చేశారు. గంజాయిని అక్రమ రవాణాకు ఉపయోగించిన వ్యాను, కారును, 5 మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేశారు.
ఎపిలోని సీలేరు అటవీ ప్రాంతం నుంచి హర్యానా రాష్ట్రం, కురుక్షేత్ర ప్రాంతానికి అక్రమంగా ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు విచారణలో తేలింది. పట్టుబడిన నిందితులందరూ కురుక్షేత్ర జిల్లాకు చెందిన ప్రిన్స్ కుమార్ ఆదేశాలతో పార్సిల్ సర్వీస్ మాటున ఈ గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో హర్యానా రాష్ట్రానికి చెందిన సందీప్‌కుమార్ అలియాస్ రింకు, లక్విందర్, అమర్‌నాధ్ కుమార్ అలియాస్ అమర్‌నాధ్, పవన్‌కుమార్, రాజ్‌కుమార్ అలియాస్ వినోద్, కృషన్‌కుమార్ అలియాస్ కాలే ఉన్నారు. వీరికి గంజాయి అమ్మిన వ్యక్తి హరిఖారా, ప్రిన్స్‌కుమార్‌లుగా గుర్తించారు. పట్టుబడిన ఇద్దరు వ్యక్తులను జుడీషియల్ రిమాండ్ నిమిత్తం కోర్టుకు తరలించారు. కోట్ల రూపాయల విలువ చేసే గంజాయి అక్రమ రవాణాను సమర్ధవంతంగా అడ్డుకొని నిందితులను చాకచక్యంగా పట్టుకున్న సిఐ సురేష్, రాజేందర్, సిసిఎస్ ఇన్‌స్పెక్టర్ రమాకాంత్, ఎస్‌ఐలు ప్రవీణ్, రామారావు, సిబ్బందిని జిల్లా ఎస్‌పి రోహిత్‌రాజు ప్రత్యేకంగా అభినందించారు.