లండన్: భారత్ తో ఐదో, చివరి టెస్ట్ కు ముందు ఇంగ్లాండ్ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. భుజం నొప్పి కారణంగా ఆ జట్టు రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ నిర్ణయాత్మక మ్యాచ్ కు దూరమయ్యాడు. స్టోక్స్ తోపాటు మరో ముగ్గురు కీలక ఆటగాళ్లు ఐదో టెస్టుకు దూరమయ్యారు. ఇంగ్లాండ్ స్టార్ బౌలర్ జోఫ్రా ఆర్చర్, ఆల్ రౌండర్ లియామ్ డాసన్, బ్రైడాన్ కార్స్ లకు విశ్రాంతినిచ్చారు. బుధవారం ఐదో టెస్ట్ మ్యాచ్ కోసం ఇంగ్లాండ్ బోర్డు ఓల్లీ పోప్ సారథ్యంలోని పదకొండు మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. కెప్టెన్ బెన్ స్టోక్స్ స్థానంలో జాకబ్ బెథెల్ ను జట్టులోకి తీసుకున్నారు. గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్ లను తిరిగి జట్టులోకి ఎంపిక చేశారు. మరోవైపు, టీమిండియా స్టార్ బౌలర్ బుమ్రా కూడా ఈ కీలక మ్యాచ్ కు దూరం కానున్నట్లు తెలుస్తోంది.
కాగా, ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్‌లో ఇంగ్లాండ్ 2-1 ఆధిక్యంలో ఉంది. మాంచెస్టర్‌లో జరిగిన నాలుగో మ్యాచ్ లో అద్భుతంగా పోరాడిన భారత్.. ఐదో టెస్టులో గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, చివరి మ్యాచ్ లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది.
ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్ (wk), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్.