హైదరాబాద్: నాచురల్ స్టార్ నాని (Hero Nani) హీరోగా, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హిట్-3’. మే 1వ విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. నాని కెరీర్లోనే 100 కోట్ల క్లబ్లో చేరింది. అయితే తాజాగా ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో తన కథను కాపీ కొట్టారు అంటూ.. మహిళ కోర్టుకెక్కింది. హిట్-1, హిట్-2 చిత్రాల సిరీస్‌లో భాగంగా శైలేష్ హిట్-3ని తెరకెక్కించారు. అయితే తన స్టోరీని కాపీ కొట్టారంటూ మహిళ రచయిత విమల్ సోని మద్రాస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అంతేకాక విమల్ సోని నానికి (Hero Nani) వీరాభిమాని అని పేర్కొన్నారు. తాను రాసిన ఏజెంట్ 11, ఏజెంట్ V కథల నుంచి హిట్-3 సినిమాను తీశారని ఆమె తెలిపారు. దీంతో హిట్-3 మేకర్స్‌పై కాపీరైట్ కేసు వేశారు. ఆమె రచించిన ఒరిజినల్ కాపీని కోర్టుకు సమర్పించారు. అయితే గతంలో కూడా దర్శకుడు శైలేష్ కొలను ఇలాంటి వివాదాన్ని ఎదురుకున్నారు. వెంకటేష్ హీరోగా ఆయన ‘సైంథవ్’ అనే సినిమాను తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కథను కూడా కాపీ కొట్టారు అంటూ అప్పట్లో ఆరోపణలు వచ్చాయి.