బిజెపి మంత్రి విజయ్ షాకు మధ్యప్రదేశ్ హైకోర్టు షాకిచ్చింది. కర్నల్ సోఫియా ఖురేషీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మంత్రిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆయనపై కేసు నమోదు చేయాలని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ గురించి కర్నల్ సోఫియా ఖురేషి వివరించిన సంగతి తెలిసిందే.
అయితే, ఆమె ప్రెస్ మీట్ ను ఉద్దేశిస్తూ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచివేస్తే.. వాళ్ల(ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో పంపి మోదీజీ పాక్‌కి గుణపాఠం చెప్పారు’ అని నోరు జారారు. దీంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలువురు ప్రముఖులు, ఇతర రాజకీయ పార్టీ నాయకుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆయన తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. ఉగ్రవాదుల చర్యలకు మనసు వికలమై.. అలా మాట్లాడానని అన్నారు. కులమతాలకు అతీతంగా సోషియా చేసిన సేవలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. అంతేకానీ.. ఆమెను కించపరచాలనే ఆలోచన కలలో కూడా రాదని, తన మాటలు ఎవరినైనా నొప్పిస్తే.. పదిసార్లు క్షమాపణ చెప్తానని అన్నారు.