సోషల్ మీడియాలో అసభ్యకరమైన పదజాలంతో కూడిన వీడియో పోస్టింగ్ చేసిన సినీనటి కల్పికపై హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటీవల గచ్చిబౌలిలో ప్రీజం పబ్బులో కేక్ ఇవ్వలేదని సినీనటి కల్పిక గొడవ చేసిన విషయం తెలిసిందే. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పబ్బు యాజమాన్యం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే తనపై కల్పిక ఇన్‌స్టాగ్రాంలో అసభ్యంగా తిడుతూ పోస్టింగ్ పెడుతోందని,
తనకు మెసేజ్‌లు పెట్టి దారుణంగా మాట్లాడుతోందని కీర్తన అనే యువతి హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆన్‌లైన్‌లో అభ్యంతరకరమైన రీతిలో కల్పిక వేధింపులకు పాల్పడుతోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనపై వాట్సాప్ స్టేటస్ పెడుతోందని, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్‌ను బాధితురాలు పోలీసులకు సమర్పించారు. వాటిని పరిశీలించిన హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు కల్పిక గణేష్‌పై 67ఐటిఎ 2000,2008,79,356 బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు.