Sunday, May 4, 2025

కుల సర్వేను తప్పుపట్టడం తెలంగాణ ప్రజలను అవమానించడమే: బిసి కమిషన్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో జరిగిన కుల సర్వేను తప్పుపట్టడం పట్ల తెలంగాణ బిసి కమిషన్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. సెన్సెస్ జరుపటం అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలోకి వస్తుందనే విషయం నిస్సందేహం అయినా తెలంగాణలో జరిగిన కుల సర్వే, కులగణనను ఏమాత్రం తీసిపోకుండా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్నామని బిసి కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తెలిపారు. రాష్ట్ర ప్రజలల్లో ఏ కులానికి చెందినవారు ఎంత సంఖ్యలో ఉన్నారో వారి రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్యా, ఉద్యోగ పరిస్థితులను సమగ్రంగా ఇంటింటికి వెళ్ళి విచారించడం జరిగిందన్నారు.

సర్వే జరిగిన 2 దశలలో 1,12,36,849 కుటుంబాలను (97.10శాతం) కవర్ చేసినట్లు వెల్లడించారు. 94,261 ఎన్యుమరేషన్ల బ్లాక్‌లను ఏర్పాటు చేసి, 1,03,889 ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్ల ద్వారా సమాచారాన్ని సేకరించినట్లు తెలిపారు. ఇంత పకడ్భందీగా చేసిన సర్వేను తప్పుల తడకగా పేర్కొనడం తెలంగాణ ప్రజలను అవమానించడమే నని ఆయనన్నారు. ఈ సర్వే సమాచారం ఆధారంగా అసెంబ్లీలో దీనిపై పూర్తిస్థాయిలో చర్చ జరిగి, బిసిలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ 2 బిల్లులను కూడా పాస్ చేయడం జరిగిందన్నారు. ఇందుకు పార్టీలకతీతంగా అన్ని పక్షాల వారు కూడా ఆమోదించడం జరిగిందన్నారు. 2021లో జరగాల్సిన సెన్సెస్ ఇప్పటివరకు జరగకపోవటానికి బాధ్యులెవరో తెలంగాణ సర్వేను తప్పుపడుతున్న వారు తేల్చి చెప్పాలన్నారు.

బిసిలకు వారున్న సంఖ్య ఆధారంగా ప్రాధాన్యత, రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణలో కుల సర్వే జరిగిందని నిరంజన్ తెలిపారు. తెలంగాణలో సర్వే తర్వాత దేశవ్యాప్తంగా ప్రజల్లో కలిగిన ఉలికిపాటుతో జనగణన, కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించడం సంతోకరమైనా కేంద్రం చేపట్టే ఈ కులగణన, తద్వారా బిసిలకు జరిగే మేలు ఏమిటో స్పష్టం చేయలేదన్నారు. తెలంగాణలో సర్వేను అభాసుపాలు చేసే ప్రయత్నంకన్నా, కేంద్ర ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు అసెంబ్లీలో ఆమోదించి పంపిన బిల్లులకు చట్టబద్ధత కలిగించే విధంగా ప్రయత్నిస్తే తెలంగాణ ప్రజలు హర్షిస్తారని నిరంజన్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News