Wednesday, September 3, 2025

కులవివక్ష లేనిదెక్కడ?

- Advertisement -
- Advertisement -

భారతదేశంలో కులవ్యవస్థ ఉన్నంతకాలం విప్లవం సాధ్యపడదు అని ఓ కమ్యూనిస్టు యోధుడు అన్నట్లుగా ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఎంతో అనుభవం, అధ్యయనంతో చెప్పిన ఈ మాట అక్షరాలా నిజమే అని మన నడకనే తెలియజేస్తోంది. తరతరాలుగా వస్తున్న పెత్తనాన్ని వదులుకోవడానికి పైకులాలు సిద్ధపడడం లేదు. ఉన్నత కులాల చేతుల్లో నాయకత్వం, ఆధిపత్యం ఉన్నంతకాలం దిగువ కులాల బతుకుల్లో మార్పు రావడం అసంభవం. పైవారు తమ పెత్తనాన్ని వదులుకోరు. కిందివాళ్లకు నాయకత్వ అవకాశాలు లభించవు. కులమే ఈ దేశంలోని మనుషులను ఎన్నడూ అతుక్కోలేని ముక్కలుగా విడదీస్తోంది.

పుట్టుకతోనే కులం ముద్ర పడుతుంది కాబట్టి మనిషి గుర్తింపు ఇక్కడ కులంతోనే మొదలవుతుంది. కులం ఎంతదాకా మనిషిలోకి చొచ్చుకుపోయిందంటే వ్యక్తి ప్రవర్తనలోను అది ప్రతిఫలిస్తుంది. జన్యువులో, రక్తంలో ఇంకిపోయినట్లు కులం ఛాయలు మనిషి నడవడికలోనూ గమనించవచ్చు. ఒకరి మాట, మర్యాద తీరును తప్పుపడుతూ ‘ఆ కులమే అంత!’ అని అంటుంటారు. అంటే కులం మనిషి వ్యక్తిత్వ నిర్మాణంలోనూ, మూర్తిమత్వంలోనూ ప్రభావం చూపుతోందన్నమాట. అందుకే ఎవరైనా తాను డికాస్టిఫై అయ్యాను అని చెప్పినా ఆయన ప్రవర్తనలో కులం లక్షణాలు చచ్చిపోవు. కులాంతర వివాహాల్లో సైతం దొరికిన సంబంధాన్ని బట్టి కిందికులాల వాళ్లు పైకెదిగినట్లు సంబరపడితే, పైకులాలవాళ్లు ఏదో త్యాగం చేసినట్లు భావిస్తారు. పై కులాలవారికి ఉన్నంత సామాజిక భద్రత, నలుగురిలో తిరిగే ధీమా నిమ్నజనాలకు ఉండదు. పైవారి నడక, చూపు, మాట అన్నీ ఓ లెవల్లో ఉంటాయి.

Also Read:  వినాశకాలే ట్రంప్ విపరీత బుద్ధి!

కులం పేరు చెప్పుకోడానికి ఆసక్తి చూపుతారు. అదే కింది వారికైతే ఒకరి ఇంట్లోకి అడుగుపెట్టాలన్నా బెదురే. చేయి కలపాలన్నా జంకే. నీళ్లు తాకడానికి భయం. కులం ప్రస్తావన రాకుండా గడిస్తే బాగుండు అని కోరుకుంటారు. అడిగితే చెప్పడానికి ముందే వెన్నులోవణుకు మొదలవుతుంది. నేను ఫలానాఅని చెప్పగానే ఎదుటి వారి ముఖంలో మారే వర్ణాలు చూసి మనసు తల దించుకుంటుంది. సరే.. నిన్ను పక్కన కూచోనిస్తాను లే, మా కప్పులో టీ పోస్తానులే అనే గొప్ప దయగల చూపు నిలువునా దహించివేస్తుంది. ఈ మంట తాకాలంటే కింది కులంలో పుడితే తప్ప అర్థం కాదు. ఆ వివక్ష ఒకరికి నోటితో చెబితే తలకెక్కేది కాదు. గాయపడ్డవాడికే ఆ బాధ తెలిసినట్లు కులం తక్కువ వారికే ఆ చీత్కారాల, అమర్యాదల నొప్పి తెలుస్తుంది. ఉద్యోగాలు చేసే చోట రిజర్వేషన్ గాడు అని చిన్నచూపు చూస్తారు. అద్దె ఇంటికి వెదికితే చదువు, ఉద్యోగం కన్నా కులం మొదటి అర్హత అవుతుంది. ఇల్లు బాగుంది. అద్దె ఎంతైనా ఇస్తాం అన్నాక ‘మీరేమిట్లు?’ దగ్గర విశ్వాసం వీగిపోతుంది. కొలీగ్స్ అంతా కలిసి ఉన్నట్లే పైకి కనిపిస్తుంది.

వారి ఇళ్లల్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వాట్సాప్‌లో ఆ మెసేజి రాదు. పోనీ పిలిచారు అనుకుంటే అడుగడుగునా కులం వెనుకబాటు గుర్తొచ్చేలా చూస్తారు. ఎందుకు వచ్చామురా అనేలా ఉంటుంది పరిస్థితి. ఈ 21 శతాబ్దంలో ఇలా ఉందా అని అనుమానం వ్యక్తం చేసేవారు ఉంటారు. ఈ మధ్య ఓ ఊర్లో జరిగిన సమావేశంలో ఆ ఊరి సర్పంచ్ జనంలో కలిసి దూరంగా నిలబడితే ‘అక్కడున్నారేం.. పక్కకు రండి’ అని పిలుస్తాడు వచ్చిన నేత. ఆయన ఎస్‌సి అని పక్కనున్న మహిళ ఒకరు ఆయనకు వినబడేలా చెబుతుంది. ‘పర్వాలేదు. వచ్చి కింది వరుసలో నిలబడు’ అని ఆ నాయకుడు ఔదార్యం చూయిస్తాడు. ఈ దృశ్యమంతా వీడియోగా వైరల్ అయింది. తక్కువ కులపు ప్రజాప్రతినిధులతో కాళ్లకు షూ తొడిగించుకున్న మహానాయకులు ఉన్నారు. ఆయన వంగలేక అలా సాయం తీసుకున్నాడు అని సవరింపులు వచ్చాయి. అదంతా పచ్చిబుకాయింపు. మీ లీడర్‌తో నేను నా చెప్పులు మోయించగలను అని అక్కడి జనాలకు ఆయనిచ్చే హెచ్చరిక అది.

పేరుకే ప్రజాస్వామ్య, పౌర సంఘాలు కాని వరుసగా పైకులాల వారే వీటిలో నాయకులు, కింది వారు కార్యకర్తలు. విప్లవ గ్రూపుల్లోనూ ఇదే తంతు నడుస్తోందని పార్టీ నుంచి బయటికి వచ్చిన బహుజనులు చెబుతుంటారు. ఆ పెత్తనం భరించలేకనే వదిలేశామని అన్నవారు కూడా ఉన్నారు. సినిమా, పత్రికా రంగాల్లో బహుజనుల స్థానం తొలి వరుసలో ఉండదు. కులవృత్తులు చేసే కుటుంబాల్లోంచి వచ్చారు కాబట్టి వీరికి కళలపై పట్టు, పరిజ్ఞానం ఉండదని ముందే స్టాంపు వేసేస్తారు. పెద్ద కులాలవారికి ఉదారంగా నిచ్చెనలు దొరికితే కిందివారిని నిర్దాక్షిణ్యంగా పాములు మింగేస్తాయి. ఇష్టంగా ఎంచుకున్న ఫీల్డ్ కాబట్టి రాజీపడి బతకాల్సిందే. ఇలా కుల వివక్షలేని రంగం ఏదైనా ఉందా అని వెదికితే ఒక్కటీ దొరకదు. హిందువుల్లో వర్ణవ్యవస్థ ఉండాల్సిందే అనే వర్గమే నేడు దేశాన్ని పాలిస్తోంది. ఈ కులంలో ఎందుకు పుట్టాను అని ఒక మనిషి బాధ పడని రోజు మన దేశంలో కనుచూపు మేరలో లేదు.

బద్రి నర్సన్, 94401 28169

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News