ప్రధాన నిందితుడు గాలి సహా నలుగురికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10వేల
చొప్పున జరిమానా వీడీ రాజగోపాల్‌కు అదనంగా నాలుగేళ్లు కారాగారం
రిటైర్డ్ ఐఎఎస్ కృపానందంకు విముక్తి 15ఏళ్ల సుదీర్ఘ విచారణ తరువాత
తీర్పు చంచల్‌గూడ జైలుకు దోషుల తరలింపు న్యాయం గెలిచింది,
కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కా అండగా నిలిచిన వారికి ధన్యవాదాలు : సబిత
మన తెలంగాణ/హైదరాబాద్ : దేశవ్యాప్తంగా తీ వ్ర ప్రకంపనలు సృష్టించిన ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) అక్రమాల కేసుకు సంబం ధిం చి నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం తన తుది తీర్పును మంగళవారం వెలువరించింది. దా దాపు 15 సంవత్సరాల సుదీర్ఘ విచారణ ప్రక్రియ అనంతరం న్యాయస్థానం ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గాలి జనార్దన్‌రెడ్డి, ఓఎంసీ ఎండి బివి శ్రీనివాసరెడ్డి, గాలి జనార్దన్‌రెడ్డి వ్యక్తిగత సహాయకుడు కె.మెఫజ్ అలీఖాన్, అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌తో పాటు ఓఎంసీ కంపెనీని కూడా న్యాయస్థానం దో షులుగా నిర్ధారించింది. గాలి జనార్దన్‌రెడ్డి సహా నలుగురికి ఏడేళ్ల పాటు జైలు శిక్ష ఖరారు చేసిం ది. అలాగే, దోషులకు రూ.10 వేలు చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. ఓబుళాపు రం మైనింగ్ కంపెనీకి రూ.2 లక్షలు జరిమానా విధించింది. తుది తీర్పు సందర్భంగా గాలి జనార్ధ న్ రెడ్డి తనకు చాలా కంపెనీలు ఉన్నాయని తనపై ఆధారపడి వేల మంది ఉన్నారని, శిక్ష రద్దు చేయాలని జడ్జిని వేడుకున్నాడు. అయితే ఈ విజ్ఞప్తుల్ని న్యాయమూర్తి పరిగణనలోకి తీసుకోలేదు. మరోవైపు, ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ గనుల శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి న్యాయస్థానం ఊరట కల్పించింది.
ఆమెతో పాటు అప్పటి పరిశ్రమల శాఖ కార్యదర్శి గా పనిచేసిన విశ్రాంత ఐఎఎస్ అధికారి కృపానందంలను నిర్దోషులుగా ప్రకటిస్తూ సిబిఐ కోర్టు తీర్పును వెలువరించింది. వీరిపై మోపిన అభియోగాలు నిరూపితం కాలేదని న్యాయస్థానం పేర్కొన్నట్లు సమాచారం. ఈ కేసులో ఎ1గా బివి శ్రీనివాసరెడ్డి, ఎ2గా గాలి జనార్దన్‌రెడ్డి, ఎ3గా వీడీ రాజగోపాల్, ఎ4గా ఓఎంసీ కంపెనీ, ఎ7గా కె.మెఫజ్ అలీఖాన్ దోషులుగా తేలారు. కాగా, ఎ8గా ఉన్న కృపానందం, ఎ9గా ఉన్న సబితా ఇంద్రారెడ్డి నిర్దోషులుగా బయటపడ్డారు. ఈ కేసు విచారణ జరుగుతున్న సమయంలోనే ఎ5 నిందితుడిగా ఉన్న అటవీశాఖ అధికారి లింగారెడ్డి మరణించారు. ఇక, మరో నిందితురాలిగా ఉన్న సీనియర్ ఐఎఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని (ఎ6) తెలంగాణ హైకోర్టు 2022లోనే ఈ కేసు నుంచి పూర్తిగా డిశ్చార్జ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసిన సంగతి విదితమే. ఈ కేసులో వీడీ రాజగోపాల్‌కు అదనంగా మరో నాలుగేళ్లు జైలు శిక్ష విధించింది. భూగర్భ గనుల శాఖ డైరెక్టర్‌గా ఉన్నందున అవినీతి నిరోధక చట్టం కింద ఆయనకు అదనపు శిక్షను ఖరారు చేసింది. ప్రభుత్వ అధికారిగా ఉంటూ అక్రమాలకు పాల్పడినందుకు మొత్తంగా 11 ఏళ్ల పాటు అతడికి జైలు శిక్ష పడింది. 15 ఏళ్ల పాటు విచారణ అనంతరం సిబిఐ కోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
ఈ కేసులో ఐపిసి 120బి రెడ్ విత్ 420, 409, 468, 471లతో పాటు కొంతమందిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13 (2) రెడ్ విత్ 13 (1)(డి) కింద సిబిఐ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో చాలా మంది సాక్షులను విచారించారు. సాక్షులు ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని సిబిఐ విచారణలో అంశాలను పరిగణన లోకి తీసుకున్న తర్వాతే మంగళవారం సిబిఐ కోర్టు ఈమేరకు తీర్పునిచ్చింది. 2007 జూన్ 18న ఓఎంసీకి లీజులు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిం ది. ఉద్దేశపూర్వకంగానే ‘క్యాప్టివ్’ అనే పదాన్ని తొలగించారని తద్వారా అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై 2009, డిసెంబర్ 7న సిబిఐ అధికారులు కేసు నమోదు చేశారు. 2011లో మొదటి ఛార్జిషీట్ దాఖలు చేశారు. మొదటి ఛార్జిషీట్‌లోనే ఎ1, ఎ2లుగా ఉన్న గాలి జానార్దన్ రెడ్డి, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి కలిసి అక్రమంగా ఓబులాపురం మైనింగ్స్‌ను తవ్వి వాటిని ఎక్స్‌పోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా దాదాపు రూ.844 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని ఆ ఛార్జిషీట్‌లో పొందుపర్చారు. ఈ కేసు లో దాదాపు 219 మంది సాక్షులను న్యాయస్థానం ముందు ఉంచి వారి స్టేట్‌మెంట్లను రికార్డ్ చేశారు.
వారి ఇచ్చిన స్టేట్‌మెంట్లను ఆధారంగా చేసుకుని ఈ కేసులో చాలా అంశాలు వెలుగులోకి వచ్చాయి. అనంతపురంలోని ఓబుళాపురంలో గనుల కేటాయింపు, తవ్వకాలకు సంబంధించి అత్యాధునిక పరికరాలతో సిబిఐ ఆధారాలు సేకరించింది. అక్రమంగా తవ్వకాలు, రవాణా, ఎగుమతులు, విక్రయాల్లో పెద్ద ఎత్తున అవక తవకలు జరిగినట్లు సిబిఐ గుర్తించింది. ఎపి, కర్ణాటక సరిహద్దుల్లో పెద్ద ఎత్తున తవ్వకాలు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై పూర్తి ఆధారాలు, సాక్షాల సేకర ణతో 2014లో తుది చార్జిషీట్ దాఖలైంది. మరోవైపు డాక్యుమెంట్ ఎవిడేషన్‌ను కూడా న్యాయస్థానం ముందు సిబిఐ పెట్టింది. డాక్యుమెంట్ ఎవిడేషన్ కింద దాదాపు 3337 డాక్యుమెంట్లను కోర్టు ముందు ఉంచింది. ప్రభుత్వం కేటాయించిన 68 హెక్టార్లలో కాకుండా పెద్ద ఎత్తున మైనింగ్ చేపట్టినట్లు సిబిఐ గుర్తించింది. విదేశాలకు అక్రమంగా దాదాపు 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఎగుమతి చేశారని, అక్రమ బినామీ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని సిబిఐ చార్జిషీట్‌లో పేర్కొంది. శిక్ష ఖరారు చేయడంతో నిందితుల్ని కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే శిక్షను ఉన్నత న్యాయ స్థానాల్లో సవాల్ చేసే అవ కాశం ఉంది. కానీ ఆ ప్రయత్నాలు జైల్లోనే ఉండి చేయాల్సి ఉంటుంది. కర్ణాటక రాజకీయాల్లో మరోసారి తన ప్రభావం చూపించాలని అనుకున్న ఆయనకు జైలు శిక్షపడటం కలకలం రేపుతోంది.
కన్నీటితో కోర్టు మెట్లు ఎక్కా : సబిత
తీర్పు అనంతరం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని, చివరకు న్యాయమే గెలిచిందని ఆమె పేర్కొన్నారు. ఈ సందర్భంగా కోర్టు వెలుపల మీడియాతో మాట్లాడుతూ, ‘పన్నెండున్నరేళ్ల క్రితం ఈ కేసు విషయంలో కన్నీళ్లతో కోర్టు మెట్లు ఎక్కాను. ఎలాంటి తప్పు చేయకపోయినా నన్ను ఈ కేసులో చేర్చడం తీవ్రంగా బాధించింది.అయితే, న్యాయవ్యవస్థ ద్వారా నాకు తప్పక న్యాయం జరుగుతుందని మొదటి నుంచి నమ్మాను. ఈ రోజు ఆ నమ్మకమే నిజమైంది‘ అని సబితా ఇంద్రారెడ్డి ఉద్వేగంగా తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా తాను ఎదుర్కొన్న మానసిక వేదనను ఆమె గుర్తుచేసుకున్నారు. ‘ఇన్నేళ్లుగా నేను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ప్రతిపక్షం లో ఉన్నవారు నన్ను అవినీతిపరురాలిగా చిత్రీకరించారు. జైలుకు వెళతానని దుష్ప్రచారం చేశారు.ఆ మాటలు నన్ను తీవ్రంగా గాయపరిచాయి. అయినప్పటికీ, నా జిల్లా ప్రజలు, ముఖ్యంగా నా నియోజకవర్గ ప్రజలు నాపై సంపూర్ణ విశ్వాసం ఉంచి నా వెన్నంటే నిలిచారు. ఎవరెన్ని రకాలు గా మాట్లాడినా వాటిని నమ్మకుండా నాకు మద్దతుగా నిలిచి నన్ను గెలిపిస్తూ వచ్చారు. ఈ కష్టకాలంలో నాతో పాటు ఉండి, ధైర్యం చెప్పిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు‘ అని ఆమె పేర్కొన్నారు. న్యాయవ్యవస్థకు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.