సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి
ఫలితాలు విడుదల- 12వ తరగతిలో
88.39 శాతం, 10వ తరగతిలో
93.66 శాతం ఉత్తీర్ణత
విజయవాడ రీజియన్ టాప్
మన తెలంగాణ/హైదరాబాద్ : సెట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సిబిఎస్‌ఇ) 10,12 తరగతు ల ఫలితాలు విడదలయ్యాయి. మంగళవారం మ ధ్యాహ్నం తర్వాత సిబిఎస్‌ఇ బోర్డు ఫలితాలను వి డుదల చేసింది. దాదాపు 16 లక్షలకుపైగా విద్యార్థులు సిబిఎస్‌ఇ 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యారు. అందులో 88.39 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈ సంవత్సరం 12వ తరగతిలో 91 శాతం మంది బాలికలు పాసైనట్లు వెల్లడించారు. ఇది అబ్బాయిల కంటే 5.94 శా తం ఎక్కువ కావడం గమనార్హం. గతేడాదితో పో లిస్తే 0.41 శాతం ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించినట్లు బోర్డు వెల్లడించింది. విజయవాడ రీజియన్‌లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత సాధించారు. తిరువనంతపురంలో 99.32, చెన్నైలో 97. 39 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. బెంగళూరులో 95.95, ఢిల్లీ వెస్ట్‌లో 95.37, ఢిల్లీ ఈస్ట్ లో 95.06శాతం, ప్రయాగ్‌రాజ్‌లో అత్యల్పంగా 79.53 శాతం మంది ఉత్తీర్ణులైనట్లు పేర్కొంది.
సిబిఎస్‌ఇ పదో తరగతి ఫలితాల్లో 93.66 శాతం ఉత్తీర్ణత
సిబిఎస్‌ఇ పదో తరగతి ఫలితాలను విడుదల చే సింది. ఫలితాల్లో 93.66 శాతం మంది విద్యార్థు లు ఉత్తీర్ణులు కాగా, బాలికలదే పైచేయి సాధించా రు. గతేడాదితో పోలిస్తే 0.06 శాతం అధిక ఉత్తీర్ణత పొందారని అధికారులు వెల్లడించారు. పదో తరగతి ఫలితాల్లోనూ విజయవాడ రీజియన్ అదరగొట్టింది. 99.79 శాతంతో విజయవాడతో పా టు తిరువనంతపురం అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో బెంగళూరు 98.9, చెన్నై 98. 71, పుణె 96.54 శాతం ఉన్నాయి.
ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 మధ్య సిబిఎస్‌ఇ 10, 12వ తరగతి పరీక్షలను సిబిఎస్‌ఇ విజయవంతంగా నిర్వహించింది. మార్చి 18న 10వ తరగతి పరీక్షలు ముగిశాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో 14 లక్షలకు పైగా విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 23,71,939 మంది విద్యార్థులు సిబిఎస్‌ఇ పది పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాలను cbseresults.nic.in వెబ్ సైట్‌లో చూసుకోవచ్చు.
విదేశాల్లోనూ పరీక్ష కేంద్రాలు
పరీక్షల కోసం సిబిఎస్‌ఇ భారత్‌తో పాటు విదేశాల్లోనూ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో భారత్‌లో 7,842 కేంద్రాలు, విదేశాల్లో 26 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసింది. పరీక్షలను బోర్డు చాలా పకడ్బందీగా నిర్వహించింది. రెగ్యులర్ విద్యార్థులు తప్పనిసరిగా స్కూల్ యూనిఫాం ధరించాలని, ప్రైవేట్ అభ్యర్థులు మరొక రంగు దుస్తులను ధరించాలని పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. పరీక్షా రోజుల్లో విద్యార్థుల రాకపోకలు పెరిగినందున, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్, సిఐఎస్‌ఎఫ్ భాగస్వామ్యంతో ప్రత్యేక సౌకర్యాల చర్యలను తీసుకుంది.
విద్యార్థులకు ప్రధాని మోదీ అభినందనలు
సిబిఎస్‌ఇ 10, 12 తరగతుల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా అభినందనులు తెలిపారు. క్రమశిక్షణ, పట్టుదల, శ్రమకు ఈ ఫలితాలే నిదర్శమని వ్యాఖ్యానించారు. ఇందులో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమైనదని కొనియాడారు. భవిష్యత్తులో కూడా ఉన్నత లక్ష్యాలను ఛేధించాలని ఆకాంక్షించారు.