తక్షణమే బేషరతుగా సరిహద్దు ఘర్షణలను నిలిపివేయాలని థాయ్‌లాండ్, కంబోడియాలు కీలక నిర్ణయానికి వచ్చాయి. మలేసియా మధ్యవర్తిత్వంతో ఇరు పక్షాల నేతల మధ్య పుత్రజయ్‌లో సమావేశం జరిగింది. కాల్పుల, ఘర్షణల విరమణకు ఇరుదేశాల అంగీకారంతో ఇన్ని రోజులుగా సాగుతున్న భీకర పరస్పర కాల్పులకు తెరపడనుంది. అమెరికా అధ్యక్షులు ట్రంప్ ఇక్కడి ఘర్షణపై తీవ్రంగా స్పందించారు. అవసరం అయితే తాను జోక్యం చేసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ దశలోనే మలేసియా చొరవ తీసుకుని ఇరుపక్షాల మధ్య రాజీ చర్చలకు దిగింది. వెంటనే కాల్పుల విరమణకు రెండు దేశాలూ అంగీకరించడం ప్రధాన విషయం అని మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీం సోమవారం తెలిపారు. ఆయన ఆగ్నేయాసియా దేశాల ప్రాంతీయ కూటమి తరఫున సంప్రదింపులకు సారధ్యం వహించారు. నిర్మోహమాట చర్చల తరువాత ఘర్షణను వీడాలని నిర్ణయం జరిగింది. దీనితో సరిహద్దు గ్రామాలలో శాంతి స్థాపనకు, సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు వీలేర్పడిందని ఇబ్రహీం తెలిపారు.