సిమెంట్ ధరల పెరుగుదల ప్రభావం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులపై పడనుంది. ఇప్పటికే స్థలం ఉండి ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పనులు ప్రారంభించగా పెరిగిన సిమెంట్ ధరలపై ఆందోళన చెందుతున్నారు. సిమెంట్ బస్తా ధర దాదాపు రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగినట్లు రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ఒక్కో ఇంటికి ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు ప్రభుత్వం ఇవ్వనుండగా 600 చదరపు అడుగులలోపు ఈ ఇళ్లు నిర్మించుకోవాలి. ఈ క్రమంలోనే ఒక ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయ్యే వరకు దాదాపు 200లు బస్తాల సిమెంట్ అవసరం ఉంటుంది. లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిన
సమయంలో సిమెంట్ బస్తా ధర రూ.280 నుంచి రూ.330 వరకు ఉంది. తరువాత రూ.30 నుంచి రూ.50 వరకు ధర పెరగడంతో రూ.10వేల వరకు అదనపు భారం పడే అవకాశముంది. ప్రభుత్వం తక్కువ ధరకు సిమెంట్ సరఫరా చేస్తే ఈ ఇబ్బంది ఉండదని లేకుంటే అదనపు భారం తప్పదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేసవి ముందు ఇళ్ల నిర్మాణం ప్రారంభించి వర్షాకాలంలోగా పూర్తి చేయడానికి చాలామంది ఏర్పాట్లు చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా భారీగా ఇళ్ల నిర్మాణం చేపట్టారు. సిమెంట్ ధరలు పెరగడంతో వారందరిపై భారం పడే అవకాశముంది.