Tuesday, July 22, 2025

తెలంగాణ ఉద్యమ కవితా సారథి… దాశరథి!

- Advertisement -
- Advertisement -

తెలుగు సాహిత్యంలో ఉద్యమ కవిత్వానికి, ప్రజాజీవితానికి ప్రతిధ్వనిగా నిలిచిన మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఓ కవి మాత్రమే కాదు, -ఓ యుగ సారథి. తెలంగాణలో జన్మించి, భాషా ఉద్యమాన్ని తన శ్వాసగా, సామాజిక స్పృహను తన ధ్యేయంగా, ప్రజల పోరాటాన్ని తన పదాల్లో నిక్షిప్తం చేసిన ఈ మహానుభావుడు, చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారు. 1925 జులై 22న మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూరు గ్రామంలో జన్మించిన దాశరథి, బాల్యంలోనే ఉర్దూ, పర్షియన్, సంస్కృత గ్రంథాలను అధ్యయనం చేయడం ద్వారా తన భావ పరిపక్వతకు బీజం వేశారు. దాశరథి విద్యాభ్యాసం ప్రారంభం చిన్నగూడూరులో, ఆపై ఖమ్మం ఉస్మానియా హైస్కూల్‌లో కొనసాగింది. అక్కడే విద్యార్థి దశలోనే మిర్జా గాలిబ్ సాహిత్యం, మౌలానా ఇక్బాల్ విప్లవాత్మక కవిత్వం చదివారు. ఈ పఠనాల ప్రభావంతోపాటు ఉపనిషత్తుల తాత్త్విక గర్భితత కూడా ఆయన ఆలోచనలకు విస్తృత దిశలను అందించింది.

ఇవన్నీ కలిసిపోయి ఆయనలో ఒక వినూత్న భావప్రకటన శైలికి, విశేషమైన ప్రజా దృక్కోణానికి రూపునిచ్చాయి. తెలంగాణ భూమిలో జరుగుతున్న సామాజిక వివక్ష, (Social discrimination) నిజాంపాలనలో ప్రజలపై జరిగే అణచివేతలు దాశరథిని కవిత్వ పోరాటబాటలో నడిపించాయి. ‘నా గీతావళి ఎంత దూరం ప్రయాణంబౌనో… ఈ భూగోళమ్మున అగ్గిపెట్టెదను’ అనే ఆయన స్వరంలో విప్లవ స్ఫూర్తి అగ్ని వర్షంలా పెల్లుబికింది. కమ్యూనిస్ట్ ఉద్యమంతో కలసి సామాజిక పరివర్తన కోసం కవిత్వాన్ని ఆయుధంగా మార్చుకున్నారు. కోయగూడెలు వంటి గ్రామాలలో ప్రచార కార్యాచరణ చేసి, లంబాడీలు, హరిజనులు, రైతులు, కూలీలు, వర్తకులను ఉద్యమంలో భాగస్వాములుగా చేశారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు సభల్లో పాల్గొంటూ భాషాసంస్కృతుల పునరుద్ధరణకు కృషి చేశారు. 1944లో ఓరుగల్లు కోటలో జరిగిన సభలో రజాకార్లు వేసిన పందిళ్లను తగలబెట్టినా, దాశరథి వెనకడుగు వేయలేదు.

జ్వాలలో ఆహుతి అయిపోతాం గాని కవి సమ్మేళనం జరిపి తీరుతాం అంటూ తన ప్రబోధన కవితలతో జనవేదికను వేడెక్కించారు. ఈ సమయంలో సురవరం ప్రతాపరెడ్డి ‘సింహగర్జన చేశావు నాయనా’ అంటూ దాశరథిని మెచ్చుకోవడం ఆయన స్వరానికి సమాజం ఇచ్చిన ప్రతిస్పందన. 1946లో కమ్యూనిస్టులతో అభిప్రాయ భేదాల నేపథ్యంలో ఆయన ‘స్టేట్ కాంగ్రెస్’లో చేరారు. స్వామి రామానందతీర్థ, కొండా వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంత రావు వంటి ఉద్యమ శిల్పులతో కలిసి ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఇదేమాట పదేపదే అనేస్తాను ‘నిజాం రాజు జన్మజన్మల బూజు’ అంటూ పోరాట శబ్దం పలికారు.  దీంతో ఆయనను గార్ల గ్రామంలో అరెస్టు చేసి, 16 నెలల కఠిన శిక్ష విధించారు. వరంగల్, అనంతరం నిజామాబాద్ జైళ్లలో కారాగార జీవితం గడిపారు.

‘జైలు గోడలపై బొగ్గుతో ఓ నిజాము పిశాచమా!’ అంటూ రాసిన ఆయన పదాలు సెన్సార్ల చేత తుడిపెట్టి తొలగించబడ్డా, మరో జైలు ఖైదీ వట్టికోట ఆళ్వారుస్వామి మళ్లీ మళ్లీ రాసేవారు. జైల్లో స్వామి రామానందతీర్థను కలసిన దాశరథిని ఆయన ధైర్యానికి అభినందించారు. జైలు కవిత్వానికి తలమానికంగా నిలిచే వీరు, బాధను భావుకతగా మార్చిన అద్భుత శక్తిని కలిగివున్నారు. ‘నా తెలంగాణ కోటి రత్నాల వీణ’ అనే పద్యం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానంతరం గీతంగా నిలిచింది. ఈ పద్యానికి దక్కిన గౌరవం కేవలం శబ్దానికి కాదు అది భావానికి, భావోద్వేగానికి ప్రజలిచ్చిన గౌరవం. ఆయన కవిత్వం తెలంగాణ భూమిని ఆలింగనం చేసి, ప్రజల క్షోభను పలికించే ప్రకటనగా మారింది.

తెలుగు సాహిత్యంలో దాశరథి ప్రవేశపెట్టిన గజల్, రుబాయీ ప్రక్రియలు నూతన మాధుర్యాన్ని ప్రసాదించాయి. ఆయన రాసిన అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం, ధ్వజమెత్తిన ప్రజ, మార్పే నా తీర్పు వంటి గ్రంథాలు సాహిత్య సమాలోచనలకు దిశానిర్దేశం చేస్తున్నాయి.ఈ గ్రంథాల్లోని ప్రతి పదం ఉద్యమ స్వరూపం, ప్రజాశక్తి, శక్తివంతమైన శబ్దగర్భిత భావం. కవిత్వాన్ని రక్తహీన సౌందర్య పూజ కాకుండా, ప్రజావాణిగా మలిచిన ఘనత ఆయనది. దాశరథి కవిత్వ ధోరణి అద్భుతంగా సమన్వయంగా ఉంది. భావోద్వేగానికి బలం, సామాజిక స్పృహకు ప్రతిధ్వని, భాషా సంపదకు విశాలత. ఆయన వాక్య నిర్మాణంలో లోతుంది, ఆలోచనలో తీక్షణత ఉంది. అతిశయోక్తి లేని, అయినా అత్యంత బలమైన భావప్రకటన ఆయన ప్రత్యేకత. 1987 నవంబరు 5న దాశరథి కన్నుమూశారు.

కానీ ఆయన కవిత్వం మరణించలేదు. అది కాలగర్భంలో ఒక తేజోమయంగా వెలుగుతోంది. దాశరథి శతజయంతి వేళ, ఆయన ఆశయాల్ని మరింతగా చేర్చుకుని, నేటి సమాజానికి మార్గదర్శిగా మలచుకోవాల్సిన అవసరం ఉంది. కవిత్వం సౌందర్య పూజ మాత్రమే కాదని, అది సామాజిక మార్పునకు, మానవీయ విలువలకు ఆధ్యాత్మిక సంకేతంగా నిలవగలదని ఆయన భావించారు. దాశరథి శతజయంతి, కేవలం గౌరవార్హ సందర్భం మాత్రమే కాకుండా, భవిష్యత్ కోసం ఆలోచించాల్సిన ఆత్మస్మరణ సందర్భం. ‘కవిత్వం రక్తహీనమైన సౌందర్య పూజ కాదు… అది మనిషిని మనిషితో కలిపే శక్తి’ అన్న ఆయన వాక్యం ఈ సమాజానికి మార్గదర్శక వాక్యంగా మారాలి. అక్షరానికి అర్థాన్ని, భావానికి శక్తిని ఇచ్చిన దాశరథికి ఇది యథార్థ నివాళి.

  • రామకిష్టయ్య సంగనభట్ల, 94405 95494
  • నేడు దాశరథి కృష్ణమాచార్యులు శతజయంతి దినోత్సవం
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News